దిశా నిర్దేశం..!

KCR Meeting Yesterday In Pragathi Bhavan - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిని వివరిస్తూనే.. ఎన్నికల దాకా ఇంకా ఎలా ప్రచారం చేయాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరికీ ఆ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థిత్వాలు ఖరారైన వారితో ఆయన ఆదివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే పది స్థానాలకు టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించింది. వీరందరితో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. జిల్లాకు సంబం ధించి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందో వివరించారని పార్టీ వర్గాలు చెప్పాయి. తాజా సర్వేల ఫలితాలు దగ్గర పెట్టుకుని మరీ ఆయన అభ్యర్థులకు తగు జాగ్రత్తలు చెప్పారని సమాచారం.

ప్రతి ఒక్కరినీ కలవాలి
గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల గురించి ప్రచారం చేస్తూనే.. ఆయా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరినీ కలిసి ఓటు అడగాలని ప్రధానంగా వీరందరికీ సూచించారని చెబుతున్నారు. కేసీఆర్‌ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు తదితర రూపాల్లో అత్యధికులకు లబ్ధి చేకూరిందని, వారంతా తిరిగి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని, ఈ సమయంలో వారిని కలిసి మళ్లీ తమకు మద్దతుగా నిలవాలని కోరాలని మరీ మరీ సూచించారని తెలిసింది.

రైతుబంధు పథకం ద్వారా రైతాంగం పెట్టుబడుల కోసం ఎదురు చూసే పరిస్థితి, ప్రైవేట్‌ అప్పులు చేసే అవసరం లేకుండా పోయిందని, ఉచిత విద్యుత్‌ వల్ల రైతాంగం సంతోషంగా ఉందని, అభ్యర్థులు తమ ప్రచారంలో ఈ అంశాలను వివరిస్తూనే.. ప్రతీ రైతు ఇంటి గడప తొక్కి ఓట్లు అడగాలని సూచించారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటి వరకు జిల్లాలో అభ్యర్థులు సాగించిన ప్రచారం తీరుతెన్నులపైనా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

నెలాఖరులోగారెండు బహిరంగ సభలు..
ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోగా వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనాలని అధినేత నిర్ణయించుకున్నారని, దీనిలో భాగంగా ఈ నెలాఖరులోగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నకిరేకల్, ఆలేరుల్లో బహిరంగ సభలు జరపాలని నిర్ణయించారని సమాచారం. ఈ సభలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారని చెబుతున్నారు. ఇప్పటికే ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులకు ఈ సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. కాగా, ఈ నెల 28వ తేదీన కానీ, లేదంటే 30వ తేదీన కానీ నకిరేకల్, ఆలేరుల్లో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో ఎక్కడా అలసత్వం పాటించకుండా అప్రమత్తంగా ఉండాలని, విజయం మనదే అంటూ ఆయన అభ్యర్థులను ఉత్సాహపరిచి పంపించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మంత్రి జగదీశ్‌రెడ్డి, వేముల వీరేశం, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎన్‌.భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, సునీతా మహేందర్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top