ఇక రెవెన్యూ పనే!

KCR Focus On Rejuvenation Of Revenue Department - Sakshi

‘పుర’చట్టం ఆమోదం పొందగానే రెవెన్యూ సంస్కరణలపైనే సీఎం కేసీఆర్‌ దృష్టి 

తాజా అవినీతి మకిలీతో గరంగరం... మరీ ఇంత ఘోరమా అని వ్యాఖ్యలు 

ప్రక్షాళన ప్రక్రియలో వేగం పెంచాలని ఉన్నతాధికారులకు అంతర్గత ఆదేశాలు 

కొత్త రెవెన్యూ చట్టమే కాకుండా ఉద్యోగుల విలీనంపైనా ఆలోచన 

వెలుగులోకి వస్తున్నఅవినీతి వీడియోలతో ‘రెవెన్యూ’ ఉక్కిరిబిక్కిరి  

సాక్షి, హైదరాబాద్‌: పైసలు ఇవ్వందే ఫైలు కదలని పరిస్థితి. ఆమ్యామ్యాలు అందనిదే రికార్డులు ఆన్‌లైన్‌లోకి ఎక్కని దుస్థితి. వేళ్లూనుకున్న అవినీతి వటవృక్షాల ‘భూ’ప్రకంపనలు రెవెన్యూ వ్యవస్థ ప్రతిష్టకే మచ్చ తెచ్చేలా మారాయి. కొందరు అధికారుల నిర్వాకం ఆ శాఖకే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. వ్యవస్థీకృతమైన చేతివాటంతో ఇటీవల ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అవినీతి వీడియోలు ప్రభుత్వ పరువునే భ్రష్టు పట్టిస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ రెవెన్యూ శాఖను సమూల ప్రక్షాళన చేసేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో తాజా పరిణామాలు ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి దారితీస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతు శరత్‌తో ఫోన్‌లో సంభాషించిన కేసీఆర్‌.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెవెన్యూ వ్యవస్థను సంస్కరిస్తామని స్పష్టం చేశారు. అనుకున్నట్లుగా ఇప్పటికే నూతన పురపాలక చట్టాన్ని కొలిక్కి తెచ్చిన ఆయన ఈ నెల 18, 19వ తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దానికి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. కొత్త ‘పుర’చట్టం అనంతరం నయా రెవెన్యూ చట్టం తీసుకురానున్నట్లు ఇది వరకే ప్రకటించిన సీఎం.. కొత్త చట్టాన్ని త్వరితగతిన తీసుకురావాలని ఉన్నతాధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 

భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం... 
రెండేళ్ల క్రితం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతూ భూ రికార్డుల ప్రక్షాళనకు రా>ష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఈ ప్రక్షాళనే రెవెన్యూలో మరిన్ని భూ తగాదాలకు ఆజ్యం పోసింది. క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించకుండానే ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో భూ వివాదాలు పెరిగిపోవడానికి దారితీసింది. సర్వే చేయకుండానే అడ్డగోలుగా రికార్డులు తారుమారు చేయడం, వాటిని సరిచేసేందుకు తహసీల్దార్ల చుట్టూ తిప్పించుకోవడం అవినీతికి దారితీసింది. లంచం ఇస్తే గానీ రికార్డులను సరిచేయని పరిస్థితి తలెత్తింది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం జరిగిన తప్పిదాలపై ఇంటలిజెన్స్‌ విభాగంతో ఆరా తీసిన ముఖ్యమంత్రి రెవెన్యూ యంత్రాంగం అవినీతి లీలలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ వ్యవస్థను సమూలంగా సంస్కరించాలనే నిర్ణయానికి వచ్చారు. ఒక దశలో రెవెన్యూ శాఖను పంచాయతీ రాజ్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాలు పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రయత్నించాయి. అందులో భాగంగా లంచం ఇవ్వకూడదని, అవినీతిరహిత కార్యాలయాలుగా పేర్కొంటూ.. ఎవరైనా డబ్బులడిగితే ఫిర్యాదు చేయమని ఫోన్‌ నంబర్లతో కూడిన బోర్డులను తహసీల్దార్‌ కార్యాలయాల ముందు ప్రదర్శించాయి. 

నీతులు బోర్డులకే పరిమితం... 
అయితే ఈ నీతులు బోర్డులకే పరిమితం కావడం, రోజుకో అధికారి ఏసీబీ వలలో చిక్కుతుండటంతో ఆ శాఖ అవినీతి మకిలీ బయటపడుతోంది. మెదక్‌ జిల్లాలో ఓ తహసీల్దార్‌ ఏకంగా రూ.8 లక్షల లంచాన్ని చెక్కు రూపేణా తీసుకోవడం.. పని చేయకపోవడం వెలుగులోకి వచ్చింది. అలాగే తాజాగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్‌ లావణ్య, వీఆర్‌ఓ అనంతయ్య లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చుకు చిక్కారు. ఈ దాడిలో తహసీల్దార్‌ ఇంట్లో ఏకంగా రూ.93 లక్షల నగదు పట్టుబడటం రెవెన్యూ చరిత్రలోనే సంచలనం సృష్టించింది. ఈ పరిణామాలన్ని రెవెన్యూ ఉద్యోగ సంఘాలను ఇరుకున పడేశాయి. ఎన్నికల వేళ బదిలీ చేసిన తహసీల్దార్లను పాత జిల్లాలకు పంపాలని పేషీల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో తలపట్టుకున్న నేతలకు.. కొందరు అవినీతి అధికారుల వ్యవహారశైలి తలెత్తుకోకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే ఉద్యమబాటకు పిలుపునిచ్చిన సంఘాలు.. వ్యూహాత్మకంగా ఆందోళన విరమించుకుంటున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నాయి. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉండటంతోనే ఉన్నతాధికారులు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని పరిస్థితుల్లో తాజా పరిణామాలు మింగుడు పడకుండా చేశాయి.

రద్దా.. విలీనమా? 
ఈ నేపథ్యంలో మరోసారి కొత్త రెవెన్యూ చట్టం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నూతన చట్టంపై మల్లగుల్లాలు పడుతున్న నిపుణుల కమిటీ.. రెవెన్యూ శాఖను రద్దు చేయాలా? లేక ఇతర శాఖల్లో విలీనం చేయాలా? అని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కిందిస్థాయిలోని సిబ్బందిని పంచాయతీరాజ్‌ పరిధిలోకి తేవాలని, ఇతర అధికారుల హోదాలు, అధికారాలను కుదించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా పూటకో అధికారి అవినీతి వలలో పడుతుండటంతో సాధ్యమైనంత త్వరగా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ‘పుర’చట్టం కార్యరూపం దాల్చగానే.. కొత్త రెవెన్యూ చట్టంపై తుది కసరత్తు ప్రారంభవుతుందని, ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టత రావచ్చని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top