ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

KCR birthday celebrations as grand level - Sakshi

శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌ 

తెలంగాణ భవన్‌లో కేక్‌ కట్‌ చేసిన కవిత 

జలవిహార్‌ వేడుకల్లో మహమూద్‌ అలీ, తలసాని 

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గులాబీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు.. ప్రగతి భవన్, తెలంగాణ భవన్, జలవిహార్‌లో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ప్రగతి భవన్‌ ప్రాంగణంలోని మైసమ్మ అమ్మవారి దేవాలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, పలువురు ప్రముఖులు కేసీఆర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంకు శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, ప్రముఖులు, అభిమానులు ప్రగతి భవన్‌ తరలివచ్చారు.  

శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని 
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షాలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకాశ్‌ నడ్డా, గవర్నర్‌ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, బిహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్, ఏపీ సీఎం చంద్రబాబు, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్, విపక్ష నేత జానారెడ్డి, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తదితరులు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  

సీఎంతో చిన్నారి అభిమాని  
సీఎం కేసీఆర్‌ను చూడాలన్న వరంగల్‌ చిన్నారి విఘ్నేశ్‌ కోరిక నెరవేరింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ చిన్నారిని.. కేసీఆర్‌ తన పుట్టిన రోజున స్వయంగా ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. తల్లిదండ్రులతో కలసి ప్రగతిభవన్‌ చేరుకున్న విఘ్నేశ్‌ను సీఎం పలకరించారు. కరచాలనం చేసి ఉత్తేజపరిచా రు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. బాలుడి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.  

హ్యాపీ బర్త్‌డే డ్యాడ్‌..: కేటీఆర్‌ ట్వీట్‌ 
కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకొని ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌ ‘హ్యాపీ బర్త్‌ డే డ్యాడ్‌’ అని ట్వీటర్‌లో పోస్టు చేశారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ‘వీరాధి వీరుడు అతడు.. విజయానికి బావుటా అతడు.. ఆవేశపు విల్లంబతడు.. ఆలోచన శిఖరంబతడు’అంటూ ఓ చిన్న కవితనూ పోస్టుతో జత చేశారు.  

జలవిహార్‌లో..  
హైదరాబాద్‌ జలవిహార్‌లో కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి తలసాని కేక్‌ కట్‌ చేసి, తర్వాత రక్తదాన శిబిరం ప్రారంభించారు. మహిళలకు చీరలు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి జె.సంతోశ్‌కుమార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీధర్, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ రాజయ్య యాదవ్‌ పాల్గొన్నారు.  

ఢిల్లీలో: కేసీఆర్‌ జన్మదిన వేడుకలను శనివారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో సీఎం అదనపు వ్యక్తిగత కార్యదర్శి అమరేందర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచుకున్నారు.

తెలంగాణ భవన్‌లో...
తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 64 కిలోల భారీ కేక్‌ను ఎంపీ కల్వకుంట్ల కవిత కట్‌ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, శంభీపూర్‌ రాజు, ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఎంపీ కవిత, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రత్యేక పూజలు చేశారు. హోమం నిర్వహించారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top