ఏటా అందరికి ఉచిత వైద్య పరీక్షలు

KCR announces Telangana Health Profile scheme - Sakshi

‘హెల్త్‌ ప్రొఫైల్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌’ పేరుతో కొత్త పథకం తెస్తాం: అసెంబ్లీలో కేసీఆర్‌

ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు కూడా..

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు నగదు సహాయం పెంచుతాం

ఆశ వర్కర్ల వేతనాల పెంపుపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన

ఈ టర్మ్‌లోనే మూడు లక్షల ‘డబుల్‌’ ఇళ్లు పూర్తిచేస్తాం

మంద కృష్ణ పనైపోయింది.. నేనే వర్గీకరణను సాధించి చూపిస్తా

ఇతర పార్టీల నేతలను బాజాప్తా చేర్చుకున్నం

అది తెలంగాణను కాపాడుకోవడం కోసమే..

తెలంగాణకు నంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయే

ఇప్పటికీ అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉన్నారు

మరో ఇద్దరి సభ్యత్వాల రద్దుకు యోచిస్తున్నామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఏటా ఉచిత వైద్య పరీక్షలు జరిపిస్తామని, ఇందుకోసం త్వరలో ‘హెల్త్‌ ప్రొఫైల్‌ ఆఫ్‌ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ’పేరుతో పథకాన్ని ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రతి ఒక్కరి వైద్య పరీక్షల సమాచారాన్ని కంప్యూటరీకరించి, లబ్ధిదారులకు కార్డు అందిస్తామని తెలిపారు. ఇందుకోసం వైద్యుల నియామకాలతో పాటు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. అమెరికా వంటి దేశాల్లో ప్రతి కుటుంబం వైద్య పరీక్షల కోసం కొన్ని డబ్బులు పక్కన పెట్టుకుంటుందని.. ఇక్కడ పేదలకు అలాంటిది సాధ్యం కాదనే పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు. బుధవారం శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల ప్రశ్నలకు కేసీఆర్‌ సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామని.. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయిస్తామన్నారు. 

వివాహాలకు సాయం పెంచుతాం 
పేద ఆడపిల్లల పెళ్లికోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద ఇస్తున్న రూ.75,116 నగదు సాయాన్ని పెంచుతామని, రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు దేశంలో మరెక్కడా లేనంతగా అధిక వేతనాలు చెల్లిస్తున్నామని.. అదే రీతిలో ఆశ వర్కర్ల వేతనాల పెంపుపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేస్తామని తెలిపారు. తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించే బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెడతామన్నారు. ఉద్యోగుల వేతన సవరణ కోసం త్వరలో పీఆర్సీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌కు బదులు పాత పెన్షన్‌ విధానం అమలు చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని, తామేమీ చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోగా 2.60 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కడతామని హామీ ఇచ్చామని, అదనంగా మరో 40 వేల ఇళ్లు కలిపి మూడు లక్షల ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రపంచ తెలుగు మహాసభలకు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించారని, అందుకే అరెస్టు చేసి జైలుకు పంపామని తెలిపారు. మంద కృష్ణ పనైపోయిందని, ఇక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆయనతో సాధ్యం కాదని పేర్కొన్నారు. తానే వర్గీకరణ సాధించి తెస్తానని ప్రకటించారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 

బాజాప్తా చేర్చుకున్నం.. అది తెలంగాణ కోసం.. 
తెలంగాణ తేవడం ఎంత ముఖ్యమో, వచ్చిన తెలంగాణలో రాజకీయ సుస్థిరత కూడా అంతే ముఖ్యమని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై కిషన్‌రెడ్డి చేసిన ఆరోపణలకు ఆయన బదులిచ్చారు. ‘‘ఇతర పార్టీల్లో ఉన్న వారిని రాజ్యాంగ బద్ధంగా మూడింట రెండు వంతులు రమ్మన్నం. టీడీపీ వారు రెండొంతులకు మించి వచ్చారు. వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, సీపీఐ పార్టీల వారు మొత్తం వచ్చి విలీనమైపోయారు. రెండు సీట్లు మళ్లీ మేం గెలుచుకున్నం. ఇవన్నీ కలిపే మీరు (స్పీకర్‌) బులెటిన్‌ విడుదల చేశారు. బాజాప్తా కలుపుకొన్నం. అది మా కోసమో, మా స్వార్థం కోసమో కాదు. తెలంగాణ కోసం కలిపేసుకున్నం. ఢిల్లీ నుంచి మా మీద కుట్ర జరిగింది. ఇక్కడ కుట్ర జరిగింది. మా ప్రభుత్వం పడిపోవాలని కొందరు కుట్రలు చేశారు. కత్తి విసురుతుంటే ఏ డాలం అడ్డుపెట్టాల్నో.. ఆ విధంగా పెట్టినం. తెలంగాణను కాపాడుకొనుడే కేసీఆర్‌ నీతి. దీనిని ప్రజలే రేపు ప్రజాకోర్టులో నిర్ణయిస్తారు..’’’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

హామీలు 100 శాతం అమలు చేశాం 
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేశామని.. హామీలు ఇవ్వకపోయినా 24 కొత్త పథకాలను అమలు చేశామని కేసీఆర్‌ చెప్పారు. 31 జిల్లాలు, 125 కొత్త మండలాలు ఏర్పాటు చేశామన్నారు. ‘‘17వేల చెరువులు మిషన్‌ కాకతీయతో బాగుపడ్డాయి. ఇంకో ఆరేడు వేల చెరువుల పనులు జరుగుతున్నది వాస్తవం కాదా? అహోరాత్రులు కష్టపడి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, దేవాదుల పథకాల పెండింగ్‌ పనులు పూర్తి చేస్తున్నాం. ప్రాజెక్టుల ద్వారా మహబూబ్‌నగర్‌లో ఆరున్నర లక్షల ఎకరాల సాగు జరుగుతోంది. వచ్చే జూన్‌కు జూరాలను కలుపుకొని పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. ఆఘమేఘాల మీద భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తిచేసి పాడేరు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరిస్తున్నాం. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని తమ్మిడిహెట్టి, ప్రాణహిత, లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది వాస్తవం కాదా? పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరం, డిండి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నాం. 119 నియోజకవర్గాల్లో బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, 204 మైనారిటీల రెసిడెన్షియల్స్‌ ఏర్పాటు చేశాం. ఇవన్నీ కనబడడం లేదా..?’’అని కేసీఆర్‌ ప్రశ్నించారు. గవర్నర్‌ ప్రసంగంలోని అంశాలు అక్షర సత్యాలని పేర్కొన్నారు. 

అసలు విలన్‌ కాంగ్రెసే.. 
తెలంగాణ వినాశనానికి, సర్వ అరిష్టాలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణమని కేసీఆర్‌ విమర్శించారు. ‘‘1956 నుంచి ఇప్పటివరకు తెలంగాణను భ్రష్టు పట్టించినది.. తెలంగాణకు నంబర్‌వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ పార్టీయే. 1999లో తెలంగాణ ఉద్యమానికి పునాది పడింది. 2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యంలో ఉద్యమం ప్రారంభమైన రోజే చెప్పా. తెలంగాణ నాశనం కావడానికి, సర్వ అరిష్టాలకు నంబర్‌వన్‌ విలన్‌ కాంగ్రెస్‌ అని. ఇప్పటికీ విలన్‌ కాంగ్రెసే. ఆనాడు తెలంగాణ ప్రజల మనోభావాలను కాలరాసి, తెలంగాణను ఆంధ్రా ప్రాంతంలో కలిపింది అప్పటి ప్రధాని నెహ్రూ అయితే.. ఆ నిర్ణయానికి తలలూ, తోకలు ఊపింది రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని రాజేసినది, 400 మంది ఆత్మహత్యలకు కారణమైనదీ.. ఆ ఉద్యమాన్ని అణిచివేసినదీ కాంగ్రెస్‌ పార్టీయే. టి.పురుషోత్తంరావు తెలంగాణ నినాదం ఎత్తుకొని మరిచిపోయిండు. తెలంగాణ ఫోరమని చెప్పిన జానారెడ్డి భుజంపై కోట్ల విజయభాస్కర్‌రెడ్డి చేయి వేయగానే అటే పోయిండు. టీఆర్‌సీసీ అని చెప్పిన చిన్నారెడ్డికి పదవి ఇవ్వగానే దానిని మూసుకున్నడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకడు హైదరాబాద్‌ను కేంద్ర పాలితం చేయాలంటే.. మరొకడు తెలంగాణ రాష్ట్రమే వద్దన్నడు. ఇంకొకడు వరంగల్‌ ఉప ఎన్నికల సందర్భంగా తమను గెలిపించకుంటే తెలంగాణను తిరిగి ఏపీలో కలిపేస్తమన్నడు. ఇలా 1956 నుంచి తెలంగాణ నాశనానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణం. ఆ పార్టీ నేతలు తెలంగాణతో ఆడుకున్నరు, వాడుకున్నరు. ముల్కీ సిఫార్సులు అమలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కాలరాస్తే.. మౌనం దాల్చింది కాంగ్రెస్‌ పార్టీ నేతలే..’’అని కేసీఆర్‌ మండిపడ్డారు. తుమ్మితే ఢిల్లీ.. దగ్గితే ఢిల్లీ అన్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల అసమర్థతే తెలంగాణ సమస్యలకు కారణమైందన్నారు. ఇప్పుడు బస్సుయాత్రకు ఢిల్లీ అనుమతి కావాలని, మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్నా వారికి ఢిల్లీ అధిష్టానం అనుమతి కావాలని ఎద్దేవా చేశారు. 

మరో ఇద్దరి సభ్యత్వాల రద్దుకు యోచన 
శాసనసభలో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇద్దరి సభ్యత్వాలు రద్దు చేశామని, మరో ఇద్దరి సభ్యత్వం రద్దు చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. వీడియో ఫుటేజీలో అంతా ఉందని తెలిపారు. 

ధర్నా చౌక్‌పై నిషేధం కొనసాగుతుంది 
ధర్నాచౌక్‌లో ఆందోళనలపై నిషేధం కొనసాగుతుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆ నిషేధాజ్ఞలు తాము పెట్టినవి కాదని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసినవని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడిపడితే అక్కడ ఆందోళనలు చేస్తామంటే సహించేది లేదన్నారు. లైవ్‌ కవరేజీ అందుబాటులో ఉన్న ప్రస్తుత సమయంలో ఎక్కడినుంచైనా నిరసన తెలిపే అవకాశం ఉందన్నారు. అలాగాకుండా అనుకున్న చోటే ధర్నా చేస్తాం, అనుమతి లేకున్నా ఆందోళన కొనసాగిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. 

రాష్ట్ర అప్పులు రూ.1.42 లక్షల కోట్లు 
రాష్ట్ర అప్పులు రూ.2 లక్షల కోట్లకు చేరాయన్న బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శలను కేసీఆర్‌ తప్పుబట్టారు. ‘‘కిషన్‌రెడ్డి చెప్పిన లెక్కలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఎంత అప్పు ఉందనే లెక్కలు రిజర్వుబ్యాంకు దగ్గర ఉంటాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి ఏపీ పంచి ఇచ్చిన అప్పు రూ.72 వేల కోట్లు. దానితోపాటు ఇప్పటివరకు చేసినవి కలిపి మొత్తం అప్పు రూ.1.42 లక్షల కోట్లు. కానీ అడ్డగోలుగా రూ.2 లక్షల కోట్ల అప్పు అని మాట్లాడుతున్నారు..’’అని స్పష్టం చేశారు. 23 జిల్లాల ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2014 వరకు క్యాపిటల్‌ ఖర్చు రూ.1,29, 683 కోట్లు అని కేసీఆర్‌ వివరించారు. అందులో జనాభా ప్రకారం తెలంగాణకు రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉన్నా.. తక్కువ ఖర్చు పెట్టారన్నారు. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ నాలుగేళ్లలోనే ఇక్కడి క్యాపిటల్‌ ఖర్చు రూ.1,24,966 కోట్లు అని వెల్లడించారు. రాష్ట్ర అప్పులపై ప్రజల్లో ఎలాంటి అలజడీ లేదని.. కాంగ్రెస్, బీజేపీలలో మాత్రమే ఉందని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి పెద్ద బాధ్యతలు స్వీకరించాలని, ఆయన ముఖ్యమంత్రి కావాలని మిత్రుడిగా కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. 

ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అసాధ్యం 
కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్నట్టుగా ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యం కాదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తాము రైతు రుణమాఫీ కోసం కేంద్రం, ఆర్బీఐ చుట్టూ అనేకసార్లు తిరిగామని, అనేక లేఖలు రాశామని.. వారు సహకరించకపోవడంతోనే నాలుగు విడతలుగా రుణమాఫీ చేశామని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు వారి జీవితకాలంలో కూడా రూ.2 లక్షల రుణమాఫీ చేయలేరని వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు వచ్చే ఆదాయం రూ.10,500 కోట్లు. అందులో రోజువారీ కట్‌ అయ్యే డెడ్‌ సర్వీస్, జీతభత్యాలు, ఎస్టాబ్లిష్‌మెంట్‌ కింద నెలకు ఐదారు వేల కోట్లు ఖర్చు చేయాలి. అంటే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే రాష్ట్రంలో ఎనిమిది నెలల పాటు పాలన మొత్తం స్తంభించాల్సి వస్తుంది. ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం రుణమాఫీకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు. అన్నీ తెలిసీ కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..’’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

విమోచనం లేదు.. ఏమీ లేదు.. 
విమోచన దినోత్సవం నిర్వహించాలని బీజేపీ నేతలు చేస్తున్న డిమాండ్లను సీఎం కేసీఆర్‌ తప్పుబట్టారు. ‘‘విమోచన దినం నేను పెట్టిందే. ఏం ఆశించి పెట్టానో లోకానికి తెలిసిందే. తెలంగాణ నిజాం సంస్థానం ప్రజాస్వామ్యానికి మారింది. అది విమోచనం కాదు.. మన్ను కాదు. ప్రజలు సోదరభావంతో కలసి ఉండాలి. ముస్లింలను కించపరిచినట్లు, ముస్లింల రాజ్యం పోయినట్లు, ముస్లింల నుంచి విమోచనమైనట్లు బీజేపీ చిత్రీకరిస్తోంది..’’అని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత విమోచనం జరపాల్సిన అవసరం లేదని.. నిజమైన విమోచన దినం జూన్‌ 2వ తేదీ అని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు నిజంగా ప్రేమ ఉంటే.. తెలంగాణ విలీనం సందర్భంగా చనిపోయిన 12 వేల మంది స్వాతంత్య్ర సమరయోధులకు కేంద్రం నుంచి పెన్షన్లు ఇప్పించాలన్నారు. విమోచన దినం విషయంలో ప్రజల్లో ఏకాభిప్రాయం లేదని, అందుకే ఏటా పార్టీ కార్యాలయంలో విలీన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top