ప్రజల కోసం పరితపించే సీఎం కేసీఆర్‌

ప్రజల కోసం పరితపించే సీఎం కేసీఆర్‌ - Sakshi


- మంత్రి కేటీఆర్‌

- వచ్చే ఏడాది మే నుంచి సాగుకు 24 గంటల కరెంటు

- ఆదిలాబాద్, బెల్లంపల్లిలో బహిరంగసభలు


సాక్షి, మంచిర్యాల/ఆదిలాబాద్‌: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్‌ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలని తపించే సీఎం.. మహిళలు, విద్యార్థులు, కార్మిక వర్గాల కోసం ఎంతగానో శ్రమిస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్‌ శనివారం ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించారు. ఉట్నూరులో మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ కుమారుడి వివాహానికి హాజరైన ఆయన అనంతరం ఆదిలాబాద్, బెల్లం పల్లిలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.



ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో, బెల్లంపల్లి ఏఎంసీ–2 గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసం గించారు. వ్యవసాయానికి ఇప్పటికే నాణ్యమైన 9 గంటల కరెంటు ఇస్తున్న సీఎం వచ్చే మే, జూన్‌ నెల నుంచి 24 గంటలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు అందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన సీఎం దేశంలో కేసీఆర్‌ తప్ప ఎవరూ లేరు’అని కొనియాడారు. పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసును మించి మూడు దశాబ్ధాల పాటు తెలంగాణకు కేసీఆర్‌ సీఎంగా కొనసాగుతారని అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో 42 రోజుల పాటు పాల్గొని ఐదు రాష్ట్రాలకు కరెంటు లేకుండా చేసిన సింగరేణి కార్మికుల త్యాగాలను ప్రభుత్వం మరువదని కేటీఆర్‌ అన్నారు.  కార్య క్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీలు నగేష్, బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ప్రభుత్వ సలహాదారు వివేక్‌ పాల్గొన్నారు.



ఈ–మంచిర్యాల యాప్‌ను విడుదల చేసిన కేటీఆర్‌

రాష్ట్రంలోనే తొలిసారిగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్‌ శాఖలను సమన్వయం చేస్తూ రూపొందించిన ఈ–మంచిర్యాల యాప్‌ను మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం విడుదల చేశారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి ఈ యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్‌ ద్వారా భూమి, గృహాల కొనుగోలుదారులు కచ్చితమైన సమాచారం తెలుసుకుని కొనుగోలు చేసేందుకు వీలుంటుందన్నారు. ఈ యాప్‌ను అన్ని స్మార్ట్‌ ఫోన్లలో ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top