మళ్లీ మనదే అధికారం

Kcr about 2019 General Elections - Sakshi

టీఆర్‌ఎస్‌ ఎల్పీ భేటీలో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ :  ‘‘అన్ని సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయి. ప్రతిపక్షాల పరిస్థితి ఏమంత బాగా లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 96 నుంచి 104 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించ బోతోంది. 99 శాతం మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తాం. సీట్ల సంఖ్య పెరిగితే కొత్త వారికి అవకాశమిస్తాం. కనీసం మూడు నెలల ముందే టికెట్లు ప్రకటిస్తాం.

టికెట్ల కోసం ఎవరూ తెలంగాణ భవన్‌ చుట్టూ తిరగొద్దు, పైరవీలు చేయొద్దు. పనిచేయండి, ప్రజల్లో ఉండండి..’’అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరుగుతుందన్న సమాచారముందని, గుజరాత్‌ ఎన్నికల తర్వాత ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు.

గురువారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు శుక్రవారం నుంచి జరగనున్న శాసనసభ, మండలి సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. పార్టీలో వర్గ రాజకీయాలను ఎవరూ ప్రోత్సహించవద్దని హెచ్చరించారు.

విప్‌ల పనితీరుపై అసంతృప్తి
శాసనసభ, మండలిలలో విప్‌ల పనితీరు సంతృప్తికరంగా లేదని కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ విప్‌లు సమన్వయంతో వ్యవహరించాలని.. చురుగ్గా ఉండాలని, తమ పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఇరుసభలకు సభ్యులు బాగా సిద్ధమై రావాలని, తమకు అప్పగించిన అంశంపైనే కాకుండా అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు కలగజేసుకోవద్దని సూచించారు.

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడి గోవర్ధన్‌పై ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మాటిమాటికి ఫిర్యాదు చేయడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారని, భూపతిరెడ్డి పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారని తెలిసింది. అసలు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేల వ్యవహారాల్లో ఏం పని అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సేన్‌ వివాదం వ్యవహారంలో ఏదో కుట్ర ఉందని సీఎం అనుమానం వ్యక్తం చేశారు.

ఫారుఖ్‌ తప్పేమీ లేదని.. మాజీ మంత్రి శ్రీధర్‌బాబు చిల్లర రాజకీయం చేశాడని, అది మంచి పని కాదని అభిప్రాయపడ్డారు. శ్రీధర్‌బాబు అంత నేరుగా దొరికిపోయినా ఆ జిల్లా పార్టీ నాయకులు సరిగా స్పందించలేదని మండిపడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించిన కేసీఆర్‌.. ఎవరూ పరిధి దాటొద్దని, కొత్త సమస్యలు సృష్టించవద్దని హెచ్చరించారు.

ఎమ్మెల్యేలతో సమన్వయంతో పనిచేసుకుంటూ పోవాలని, పార్టీ అభివృద్ధికి శ్రమించాలని సూచించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితులు, భూరికార్డుల ప్రక్షాళన, పంచాయతీరాజ్‌ చట్టంలో తీసుకురానున్న మార్పుల గురించి వివరంగా తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రగతి నివేదన: కడియం
గత మూడున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. వాటన్నింటినీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం అనంతరం మంత్రులు ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలతో కలసి కడియం విలేకరులతో మాట్లాడారు.

కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ సంయుక్త సమావేశం జరిగిందని.. నూతనంగా ప్రకటించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని అందరికీ పరిచయం చేశారని చెప్పారు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను అప్పజెప్పారని తెలిపారు. ఒక్కో కార్యదర్శిని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా నియమించామన్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. ఇక అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా సరైన సమాచారంతో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించినట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల రోజే కాంగ్రెస్‌ పార్టీ చలో అసెంబ్లీకి పిలుపివ్వడం దురదృష్టకరమని కడియం విమర్శించారు.  

ఏ జిల్లాలో ఎవరికి...?
మెదక్‌
ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ: చాగళ్ల నరేంద్రనాథ్‌

నియోజకవర్గ ఇన్‌చార్జులు..
పన్యాల భూపతిరెడ్డి: సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక
రాధాకృష్ణ శర్మ: మెదక్, నర్సాపూర్, ఆందోల్‌
ఫరీదుద్దీన్‌: పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి

నల్లగొండ
ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ: పల్లారాజేశ్వర్‌రెడ్డి
బడుగు లింగయ్య యాదవ్‌: ఆలేరు, భువనగిరి, నల్లగొండ
లింగంపల్లి కిషన్‌రావు: మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి
(ఈ జిల్లాలో మిగతా నియోజకవర్గాలకు)
ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ: సత్యవతి రాథోడ్‌
ఎర్నేని వెంకటరత్నం: నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ
వై.వెంకటేశ్వర్లు: సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌

నిజామాబాద్‌
ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ: తుల ఉమ
లోక బాపురెడ్డి: నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ, ఆర్మూర్‌
ఫారూక్‌హుస్సేన్‌: నిజామాబాద్‌ ఆర్బన్, బోధన్, బాన్సువాడ
బక్కి వెంకటయ్య: ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్‌

వరంగల్‌
ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ: గ్యాదరి బాలమల్లు
బి.వెంకటేశ్వర్లు: నర్సంపేట, భూపాలపల్లి, ములుగు
మందుల సామేలు: మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి
ఎడవెల్లి కృష్ణారెడ్డి: పరకాల, వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు
మాలోతు కవిత: స్టేషన్‌ ఘన్‌పూర్, జనగాం, వర్ధన్నపేట

ఆదిలాబాద్‌
ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ: నారదాసు లక్ష్మణ్‌రావు
అరికెల నాగేశ్వరరావు: బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల
మూల విజయారెడ్డి: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్,  
లోక భూమారెడ్డి: ఆదిలాబాద్, బో«థ్, ఖానాపూర్‌
దాదన్నగారి విఠల్‌: నిర్మల్, ముధోల్‌

రంగారెడ్డి/హైదరాబాద్‌
జహంగీర్‌పాషా: మేడ్చల్, కుత్బుల్లాపూర్‌
సఫాన్‌దేవ్‌: సనత్‌నగర్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌
తాడూరి శ్రీనివాస్‌: ఎల్‌బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, అంబర్‌పేట్‌
వి.కె.మహేశ్‌: సికింద్రాబాద్, కంటోన్మెంట్, ముషీరాబాద్‌  
పోచారం శ్రీనివాస్‌రెడ్డి: శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, గోషామహల్‌
నక్క ప్రభాకర్‌గౌడ్‌: ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌  
నాగేందర్‌గౌడ్‌: వికారాబాద్, పరిగి, చేవెళ్ల, తాండూరు

కరీంనగర్‌
ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ: బస్వరాజు సారయ్య
కోలేటి దామోదర్‌: మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్‌
భానుప్రసాద్‌: సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల
జి. ప్రవీణ్‌: కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి
కె. శ్రీహరి: పెద్దపల్లి, మంథని, రామగుండం

ఖమ్మం
ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ: తక్కళ్లపల్లి రవీందర్‌
టి.మధుసూదన్‌ : పాలేరు, ఖమ్మం, వైరా, మధిర
తెల్లం వెంకటరావు: భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట
నూకల నరేశ్‌రెడ్డి: కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి

మహబూబ్‌నగర్‌
శ్రీనివాస్‌యాదవ్‌: కొల్లపూర్, నాగర్‌ కర్నూల్, అచ్చంపేట
పి.నరేందర్‌రెడ్డి: నారాయణపేట, మక్తల్, కొడంగల్‌
గట్టు రాంచందర్‌రావు: మహబూబ్‌నగర్, దేవరకద్ర, వనపర్తి
అందెబాబయ్య: షాద్‌నగర్, కల్వకుర్తి, జడ్చర్ల
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి: అలంపూర్, గద్వాల

పార్లమెంట్‌ ఏరియా బాధ్యులు
బండి రమేశ్‌: సికింద్రాబాద్‌
వి.గంగాధర్‌: చేవెళ్ల
మైనంపల్లి హన్మంతరావు: మల్కాజిగిరి
నిరంజన్‌వలీ: హైదరాబాద్‌
పి.రాములు: నాగర్‌కర్నూల్‌
బండ ప్రకాశ్‌: మహబూబ్‌నగర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top