కాళేశ్వరం వెట్‌ రన్‌ సక్సెస్‌పై కేసీఆర్‌ హర్షం

Kaleshwaram project Package Wet Run successful - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. 130 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అత్యంత ఆనందకరమైనదిగా సిఎం అభివర్ణించారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్,  ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు. 

‘తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా మెదడును కరిగించాం. అనేక రకాల ఆలోచించాం. ఎంతో శోధించి, చివరికి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయడం మినహా మరో గత్యంతరం లేదని తీర్మానించుకున్నాం. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్ ప్రణాళిక తయారు చేయడానికి నెలల తరబడి కసరత్తు చేశాం. రక్షణ శాఖ అనుమతి తీసుకుని మరీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా లైడార్ సర్వే నిర్వహించి, పక్కా అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం.

గోదావరి నుంచి నీటిని తోడడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 139 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లను వినియోగించడానికి డిజైన్ చేశాము. గతంలో తెలంగాణలో 80 నుంచి 85 మీటర్ల వరకు మాత్రమే ఎత్తిపోసిన అనుభవం ఉంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కోపంపు గరిష్టంగా 120 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపింగ్ చేసే ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక తయారు చేయడానికి, అమలు చేయడానికి ఇంజనీర్లు, అధికారులు విదేశాలకు కూడా వెళ్లారు. సంపూర్ణ అధ్యయనం చేసి, పూర్తి అవగాహనతో పనులు చేపట్టారు. భగవంతుడి ఆశీస్సుల వల్ల అన్నీ అనుకున్నది అనుకున్నట్టు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల తలరాత మార్చే అదృష్టం. ప్రాజెక్టు పనుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న అధికారులు, ఇంజనీర్లకు హృదయపూర్వక అభినందనలు’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top