కరువును తరిమేద్దాం: హరీశ్‌రావు

కరువును తరిమేద్దాం: హరీశ్‌రావు

- గోదావరి జలాలతో తెలంగాణ పునీతం

ఇటు కాళేశ్వరం, అటు శ్రీరాంసాగర్‌ పునరుద్ధరణ

 

సాక్షి, సిద్దిపేట: ‘తలాపున గోదావరి నది ఉన్నా.. తెలంగాణ ప్రజలు సాగునీటికి, తాగునీటికి అల్లాడి పోయారు. కరువుతో పల్లెలు వల్లకా డులయ్యాయి. ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చింది. గోదావరి నీళ్లు మన బీడు భూములకు మళ్లిద్దాం. కరువును తరిమేద్దాం’’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా లోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో వేసిన మొక్కజొన్న పంటలు మాడిపోతున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో కూడా కాళేశ్వరం వద్ద 220 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. ఇలా వృథాగా వెళ్తున్న నీటిని సద్వినియోగం చేసుకుంటే 22 లక్షల ఎకరాల భూములను సస్యశ్యామలం చేయవచ్చన్నారు.ఇందుకోసం ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు తోపాటు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సొరంగమార్గం ద్వారా కాల్వలు నిర్మించి రెండేళ్లలో సాగునీటిని అందించేందుకు పనులు ముమ్మరంగా జరుగుతు న్నాయన్నారు. వలసలు నిర్మూలించి పల్లెలకు పాత కళ తెచ్చేందుకు కుల వృత్తులను ప్రోత్స హిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడు తోందన్నారు. గొల్లకురుమలకు సబ్సిడీ గొర్రెలు అందచేస్తున్నామని, దీంతో పల్లెల్లోనే సంపదను సృష్టించే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. 

 

సామూహిక గొర్రెల పాకలు ఏర్పాటు చేస్తాం..

కులవృత్తులను నమ్ముకొని జీవించే వారు కలసికట్టుగా ఉంటారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో సామూహిక గొర్రెల పాకలను ఏర్పాటు చేస్తామని, ఊరికి చెందిన గొర్రెల మందలన్నీ ఇక్కడే ఉంటాయని ఆయన చెప్పారు. ఈ మేరకు సిద్దిపేట రూరల్‌ మండలంలో ఆయన శనివారం గొర్రెల పాకను ప్రారంభించారు. రాష్ట్రంలోనే ఇది మొదటిదని, త్వరలో రాష్ట్రమంతటా ఇటువంటివి నిర్మిస్తామన్నారు. వర్షాలు సకాలంలో పడాలంటే పల్లెలు పచ్చగా ఉండాలని, అందుకోసం ప్రతీ ఒక్కరు హరిత ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. 
Back to Top