నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి

Jagadish Reddy Says He Was Weak In Maths At Gitam University - Sakshi

గణితం గొట్టుకాదు మంత్రి జగదీశ్‌రెడ్డి

గీతం యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 

ఆన్‌ మ్యాథమటికల్‌ సైన్సెస్‌ అండ్‌ అప్లికేషన్స్‌ ప్రారంభం 

సాక్షి, పటాన్‌చెరు: గణిత శాస్త్రం అర్థం చేసుకోవడం కష్టం అయితే అది అర్థమైయ్యిందంటే అందులోనే నూటికి నూరుశాతం మార్కులు పొందవచ్చని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. తనకు చిన్నప్పుడు గణితశాస్త్రం అర్థమయ్యేది కాదన్నారు. తనతో పాటు చదువుకున్న 60 విద్యార్థుల్లో ఏడో తరగతి వచ్చేసరికి 27మంది మాత్రమే చదువులు కొనసాగించారని గుర్తు చేశారు. మిగతా వారంతా చదువు మానేశారన్నారు. మానవ జీవితంలో గణిత శాస్త్రం చాలా ప్రాముఖ్యమైందని ఆయన విశ్లేషించారు.

శుక్రవారం పటాన్‌చెరు మండలం పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ మ్యాథమటికల్‌ సైన్సెస్‌ అండ్‌ అప్లికేషన్స్‌ను మంత్రి ప్రారంభించారు. గీతం  అధ్యక్షుడు శ్రీభరత్‌ కూడ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ మనిషి జీవితానికి, గణితానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తగినట్టుగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానమంతా గణిత శాస్త్రంతో ముడిపడినదేనని జగదీశ్‌రెడ్డి వివరించారు. ప్రాథమిక విద్యస్థాయిలో గణితంపై పట్టు సాధించకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

గణితం మాస్టార్‌ కోసం ఆరా తీస్తున్న మంత్రి
‘తన కూతురు ఇటీవల లెక్కల్లో వెనుకబడిందని తెలిసింది. ఆమెలో లెక్కలంటే భయం లేకుండా చేయాలనేది నా ప్రయత్నం. అయితే రెండు నెలలుగా ఓ లెక్కల మాస్టార్‌ కోసం వెతుకుతున్నా’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. చిన్నారుల్లోని నిగూడమైన సృజనాత్మక శక్తిని వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన విశదీకరించారు. 

చిన్నారుల్లో అంత ఒత్తిడి అవసరమా..?
‘చిన్నప్పుడు లెక్కల్లో మంచి మార్కులు వచ్చేవి. వందకు వంద మార్కులు వచ్చేవి. ఆ తరువాత నన్ను ఫిడ్జి స్కూల్‌లో వేశారు. మార్కులు తగ్గాయి. తల్లిదండ్రులు నన్ను ఐఐటీ చదవాలనే ఉద్ధేశ్యంతో ఆ స్కూళ్లో వేశారు. ఐఐటీ చేయలేనని చెప్పేశాను. ఆ తరువాత అమెరికాలో ఓ యూనివర్సిటలో గణిత ప్రాధాన్యతతో కూడిన గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నా ప్రథమ మూడు పరీక్షల్లో ఏ మాత్రం చదవకపోయినా మంచి మార్కులు వచ్చాయి. దానికి కారణం దేశంలో ప్రాథమికస్థాయిలో చదివిన ఫౌండేషన్‌ కోర్సులే కారణం. అయితే నాకనిపిస్తుంది పిల్లలకు ఆ స్థాయిలో డిగ్రీలో నేర్పే కోర్సులు అవసరమా అంత వత్తిడి ఎందుకు’అని గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌ అన్నారు.

గణితం అనే తర్కమని(లాజిక్‌), అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమని శ్రీభరత్‌ అన్నారు. కాన్ఫరెన్స్‌కు వచ్చిన స్పందనను నిర్వాహకుడు ప్రొఫెసర్‌ మారుతీరావు వివరిస్తూ వంద పరిశోధన పత్రాలు సమర్పిస్తారని భావిస్తే.. తమ అంచాలకు మించి 300 పరిశోధనా పత్రాల సమర్పణకు గణితశాస్త్ర పరిశోధకుడు ఈ కాన్ఫరెన్స్‌కు హాజరవుతున్నారని తెలిపారు. గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్‌ శివప్రసాద్, రెసిడెంట్‌ డైరెక్టర్‌ డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, ఇండియన్‌ మాథమెటికల్‌ సొసైటీ అధ్యక్షుడు ప్రొ.ఎస్‌.ఆర్ముగం, ఆంధ్రా–తెలంగాణ మాథమెటికల్‌ సొసైటీ అధ్యక్షుడు కేశవరెడ్డి, అమెరికా నుంచి వచ్చిన తెలుగు శాస్త్రవేత్త జెర్మయ్య కె.బిల్లా పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top