రైతులపై ఇరిగేషన్‌ జులుం

Irrigation Department Torturing Farmers In Karimnagar - Sakshi

సాక్షి, ప్రతినిధి, కరీంనగర్‌ : భూమిపై రైతుకున్న హక్కును నీటిపారుదల శాఖ కాలరాస్తోంది. ఇరిగేషన్‌ సీఈ స్థాయిలో ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా పెద్దపల్లి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు సొంత ఎజెండాను అమలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్దదైన గర్రెపల్లి పెద్ద చెరువులో ముంపునకు గురవుతున్న పట్టా భూముల విషయంలో అధికారులు, సిబ్బంది రైతులపై జులుం ప్రదర్శిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు నిబంధనల పేరుతో చుక్కలు చూపుతున్న అధికారులు, పెద్ద రైతులు, రాజకీయ నాయకులు, రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వారికి మినహాయింపులు ఇస్తున్నారు. పట్టా భూములను సైతం ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వచ్చే ఒక్క పంట భూములుగా చెబుతూ రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల పేరుతో మండలస్థాయి ఉద్యోగి ఒకరు రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ రైతులను వేధిస్తున్నాడు. హైకోర్టు ఆదేశాలు, నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ ఉత్తర్వులను తుంగలో తొక్కి గర్రెపల్లి పెద్దచెరువు ముంపు రైతులను చోటామోటా సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాలను పాటించక... రైతులకు వేధింపులు
గర్రెపల్లి పెద్దచెరువు నిండిన ప్రతిసారి తమ భూములు ముంపునకు గురవుతున్నాయని, ఆ భూములను ప్రభుత్వమే తీసుకొని నష్ట పరిహారం చెల్లించాలని 2006 సంవత్సరంలో కె.నర్సయ్య, మరో 27 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. గర్రెపల్లి, సాంబయ్యపల్లి, దుబ్బపేట, ముగ్దుంపూర్‌ గ్రామాల పరిధిలోని ఈ రైతులతోపాటు చాలా మంది భూములు వర్షకాలంలో చెరువులోనే మునిగే పరిస్థితి నెలకొందని, కనాకష్టంగా ఒక పంట పండించడమే కష్టంగా ఉందని హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయం స్థానం 2007 జనవరి 18న తీర్పునిస్తూ ఆరు వారాల్లో సమస్యను పరిష్కరించాలని నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో నీటిపారుదల శాఖ అప్పటి చీఫ్‌ ఇంజనీర్‌ టక్కర్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ మేరకు టక్కర్, ఇతర నీటిపారుదలశాఖ అధికారులు గర్రెపల్లి చెరువు పరిధిలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు. 2007 సెప్టెంబర్‌ 8వ తేదీన అప్పటి పెద్దపల్లి ఆర్డీవో ఓ నివేదిక ఇచ్చారు. చెరువు విస్తీర్ణం 580 ఎకరాలు ఉన్నదని, ఆయకట్టు మాత్రం అతి తక్కువగా 1200 ఎకరాలనే విషయాన్ని స్పష్టం చేశారు. 1200 ఎకరాల ఆయకట్టుకు అవసరమైన నీరు చెరువులో ఉంటే సరిపోతుందని, రైతుల పట్టా భూములు మునిగే పరిస్థితి లేకుండా నీటిని కిందికి విడుదల చేసుకోవచ్చని తేల్చారు. అలాగే పట్టా పొలాలను రక్షించుకునేందుకు రైతులు మట్టి నింపుకోవడం, ఇతర ప్రయత్నాలు చేసినా అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.

పట్టా రైతులను వేధిస్తున్న అధికారులు, సిబ్బంది
వందల ఎకరాల భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా గర్రెపల్లి చెరువులో ముంపు భూములే లేవని తేల్చిన అధికారులు హైకోర్టుకు ఈ మేరకు నివేదిక ఇచ్చి, ఫైలును పక్కన పడేశారు. కానీ వర్షాకాలంలో చెరువు నిండిన ప్పుడల్లా దుబ్బపేట, గర్రెపల్లి, మొగ్దుంపూర్‌ ప్రాంతాలకు చెందిన సుమారు 300 ఎకరాలకు పైగా భూములు ముంపునకు గురవుతూనే ఉన్నాయి. అప్పట్లో హైకోర్టును ఆశ్రయించిన రైతుల్లో కొందరు చనిపోగా, మరికొందరు తమ భూములను అమ్ముకున్నారు. వాటిని కొన్న వారు భూములను రక్షించుకునేందుకు మట్టి కట్టలు వేసుకునే ప్రయత్నం చేసినా, లెవలింగ్‌ చేయించుకున్నా, వెంటనే నీటిపారుదల శాఖ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు వీఆర్‌ఓల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పని చేసేందుకు వచ్చిన ట్రాక్టర్లు, జేసీబీల యజమానులను సీజ్‌ చేస్తామని బెదిరిస్తూ వెనక్కు పంపుతున్నారు. ఇదేమంటే ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని భూములని కొత్త పల్లవి అందుకుంటున్నారు. ఓవైపు నీటిపారుదల శాఖ పట్టా భూములు ముంపుకు గురయ్యే పరిస్థితికి రానివ్వమని చెపుతుండగా, కిందిస్థాయి ఉద్యోగులు రైతులపై దౌర్జన్యం చేస్తూ వేదనకు గురి చేస్తున్నారు.

చెరువు మట్టి పెద్ద రైతులకే..
ఇటీవల గర్రెపల్లి గ్రామంలో ఓ రైతు తన పట్టా పొలం ముంపునకు గురవుతుందని, చెరువులో తీస్తున్న మట్టిని కొంత ఎత్తుగా పోసేందుకు ప్రయత్నించగా, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదుతో వీఆర్‌ఓ అడ్డుకున్నారు. అదే చెరువు ముంపునకు గురయ్యే పొలంలో కరీంనగర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో పనిచేసే ఓ రెవెన్యూ ఉద్యోగి వాల్టా నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా బావి తవ్వినా పట్టించుకోలేదు. ఇటీవలే ఆ బావిలో నుంచి తీసిన మొరం మట్టిని చెరువు నీరు పొలంలోకి రాకుండా అడ్డుకట్టగా వేసినా నీటిపారుదల శాఖ మండల బాధ్యుడు పట్టించుకోలేదు. కానీ పట్టా భూమిలో ఉన్న పాత బావులను పూడుస్తుంటే సైతం అడ్డం పడుతుండడం గమనార్హం. కాగా ఉపాధి హామీ పథకం కింద చెరువు నుంచి తీసిన మట్టిని సైతం పెద్ద రైతులకే పంపిస్తున్నారన్న విమర్శలున్నాయి. చెరువు నుంచి మట్టి తీయడంలో కూడా ఎలాంటి పద్ధతి అనుసరించడం లేదు. చెరువులో పూడిక తీయాల్సి ఉండగా, గత మూడు నాలుగేళ్లుగా అడ్డదిడ్డంగా> చెరువును తవ్వేశారు. ఇప్పుడు కూడా ఉపాధి హామీ పనుల పేరుతో అడ్డదిడ్డంగా తవ్వుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top