నిరుటి కంటే మెరుగు

Inteults Girls First Place In Adilabad - Sakshi

ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి

ఫస్టియర్‌లో 47.83 శాతం.. సెకండియర్‌లో 55 శాతం ఉత్తీర్ణత

ప్రథమ సంవత్సరంలో 18వ, ద్వితీయ సంవత్సరంలో 14వ స్థానం

గతేడాది ఫలితాల కంటే ఈసారి కాస్త మెరుగు..

రాష్ట్రస్థాయిలో టాప్‌లో నిలిచిన పలువురు విద్యార్థులు

మంచిర్యాలఅర్బన్‌: ఇంటర్‌ ఫలితాలు నిరుటి కంటే కాస్త మెరుగుపడ్డాయి. కానీ రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు ఆశించిన స్థానం మాత్రం దక్కలేదు. 2017–18 విద్యా సంవత్సరం ఇంటర్‌మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఇంటర్‌ బోర్డు అధికారులు హైదరాబాద్‌లో పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రస్థాయిలో గతేడాది ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 16వ స్థానంలో నిలిచిన మంచిర్యాల జిల్లా ఈసారి 14వ స్థానం సాధించి కాస్త ముందు వరుసలో నిలిచింది. గతేడాది 50 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి 55.54 శాతానికి పెరిగింది. అదేవిధంగా ఫస్టియర్‌లో ఈసారి 47.83 శాతం ఉత్తీర్ణత సాధించింది. గత ఏడాది 38 శాతంతో సరిపెట్టుకోగా.. ఈ సంవత్సరం 10 శాతం ఫలితాలు మెరగయ్యాయి. ఎప్పటిలాగే ఇంటర్‌ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే బాలురకంటే పై చేయి సాధించడం విశేషం.

ప్రథమ సంవత్సరంలో..
ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 7,494 మంది విద్యార్థులకు గాను 3,585 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 3,414 మందికి గాను 1,210 ఉత్తీర్ణత పొంది 35.44 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 4,080 మందికి గాను 2,375 మంది ఉత్తీరణ పొంది, 58.21 శాతంతో బాలుర కంటే ముందు వరుసలో నిలిచారు.

ద్వితీయ సంవత్సరంలో..
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 6921 మంది విద్యార్థులకు గాను 3,884 మంది ఉత్తీర్ణత పొందారు. వీరిలో బాలురు 2,948 మందికి గాను 1268 మంది పాసై 43.01 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బాలికలు 3,973 మందికి గాను 2576 మంది పాస్‌ కాగా, 64.83 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కళాశాలల వారీగా..
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు 84.19 శాతంలో ముందు వరుసలో నిలిచాయి. జిల్లాలో మూడు కళాశాలల్లో 215 మంది విద్యార్థులకు గాను 181 మంది ఉత్తీర్ణులయ్యారు. లక్సెటిపేట 90.67 శాతంతో ప్రథమ, బెల్లంపల్లి 89.47శాతంతో ద్వితీయ, ఇందారం 70.31శాతంతో తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే జిల్లాలోని మూడు మోడల్‌ స్కూళ్లలో 276 మందికి గాను 202 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో లింగపూర్‌ 91.94 శాతంతో ప్రథమ, మందమర్రి ద్వితీయ, మంచిర్యాల 50 శాతం ఉత్తీర్ణతో తృతీయ స్థానం సాధించాయి. అదేవిధంగా మూడు ఒకేషనల్‌ కాలేజీల్లో 296 మందికి గాను 255 మంది పాసై 86.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. బెల్లంపల్లి ఒకేషనల్‌ కాలేజీకి చెందిన 82 మంది విద్యార్థులకు గాను 79 మంది ఉత్తీర్ణత పొంది 96 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచారు. మంచిర్యాల కాలేజీకి చెందిన 117 మందికి గాను 98 మంది ఉత్తీర్ణత 83.76 శాతంతో ద్వితీయ స్థానం పొందారు. లక్సెటిపేట్‌కు చెందిన 97 మంది విద్యార్థుల్లో 78 మంది పాసై 80.41 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఫస్టియర్‌లో కళాశాల వారీగా..
ఫస్టియర్‌లో బాలురు.. టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీలో 57.35 శాతం, మోడల్‌ స్కూల్స్‌ 35.29 శాతం, ఒకేషనల్‌ కాలేజీల్లో 51శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు.. టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీలో 84.72, మోడల్‌ స్కూల్స్‌లో 56.48శాతం, ఒకేషనల్‌ కాలేజీల్లో 71 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే జిల్లాలోని ఆయా కాలేజీల వారీగా ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం వివరాలు సాయంత్రం వరకు అందలేదు.

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో..
జిల్లాలోని పది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 979 మంది విద్యార్థులకు గాను 625 మంది ఉత్తీర్ణులై 64 శాతం సాధించారు. 31 ప్రైవేటు కాలేజీల్లో 4499 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 2,193 మంది ఉత్తీర్ణులై 49 శాతం సాధించారు. ఈ లెక్కన ప్రైవేట్‌ కళాశాలల కంటే అదనంగా 15శాతం ఉత్తీర్ణతతో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ముందు వరుసలో నిలిచారు. ప్రభుత్వ కాలేజీల నుంచి బాలురు 433 మందికి గాను 247 ఉత్తీర్ణత పొందారు. 536 మంది బాలికలకు గాను 378 మంది పాసయ్యారు. ప్రైవేట్‌ కాలేజీల్లో బాలురు 1,823 మందికి గాను 603 ఉత్తీర్ణత పొందారు. 2676 మంది బాలికలకు గాను 1590 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో జన్నారం కళాశాల విద్యార్థులు ముందు వరుసలో నిలిచారు. 206 మందికి గాను 178 ఉత్తీర్ణులై జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. అలాగే కాసిపేట్‌ కళాశాల చివరన నిలిచింది. గత ఏడాది ప్రథమ స్థానంలో నిలిచిన జైపూర్‌ కళాశాల 69.35 శాతం ఫలితాలతో నాల్గోవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మే 14 నుంచి అడ్వాన్స్‌ పరీక్షలు
ఇంటర్‌మీడియట్‌ పరీక్షల్లో అనుత్తీర్ణులైన వారితో పాటు అదనపు మార్కుల (ఇంప్రూవ్‌మెంట్‌) కోసం మే 14 నుంచి 22 వరకు అడ్వాన్డ్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని డీఐఈవో బీనారాణి తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలు మే 24 నుంచి 28 వరకు, నైతిక విలువ పరీక్ష 29న, పర్యావరణ పరీక్ష 30న ఉంటుందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top