సొంతగూడు వదిలి..

Interesting Political Factors In Command Medak District - Sakshi

ఎదుటి పార్టీల్లో చేరి టికెట్‌ కోసం వేట

పటాన్‌చెరు సెగ్మెంట్‌లో వింత పరిస్థితి

ఎవరు ఏ పార్టీ వారో తెలియని వైనం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఏళ్ల తరబడి ఒకే పార్టీలో కొనసాగుతున్న నేతలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు మారుతున్నారు. నియోజకవర్గంలో రాజకీయ వలసలు నిత్యకృత్యంగా మారడంతో, ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో కొనసాగుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్, టీడీపీలోకి నియోజకవర్గ ముఖ్య నేతలు చేరారు. అయితే మహా కూటమి అభ్యర్థి ఎంపిక తర్వాత కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్, బీజేపీలోకి వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డికి టీఆర్‌ఎస్‌ పార్టీ మరోమారు అవకాశం ఇచ్చింది. నెల పది రోజుల క్రితం తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో మహిపాల్‌రెడ్డి ఇప్పటికే తొలి దశ ప్రచార పర్వాన్ని దాదాపు పూర్తి చేశారు. అయితే ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలో మాత్రం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. 

ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ మహాకూటమి పేరిట ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటన తర్వాత అసమ్మతి  తలెత్తడంతో నియోజకవర్గంలో కొత్త రాజకీయ సమీకరణలు తెరమీదకు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఆశించి భంగపడిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సపాన్‌దేవ్, నియోజకవర్గ కన్వీనర్‌ గాలి అనిల్‌కుమార్, కొలన్‌ బాల్‌రెడ్డి, జె.రాములు కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సపాన్‌దేవ్‌ ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పనిచేసిన గాలి అనిల్‌తో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. దేవేందర్‌గౌడ్‌తో కలిసి టీడీపీని వీడిన జె.రాములు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పటాన్‌చెరులో పోటీ చేశారు. జిన్నారం జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎంపీపీగా పని చేసిన కొలన్‌ బాల్‌రెడ్డి 2014 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్‌లో చేరారు.

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి..?
రెండు పర్యాయాలు 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ ఆ తర్వాత బీజేపీలో చేరారు. తాజాగా మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీలో చేరి టికెట్‌ను ఆశిస్తున్నారు. దశాబ్దాల కాలంగా బీజేపీలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ రెండు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ మినహా వివిధ పార్టీల్లో టికెట్లు ఆశిస్తున్న నేతల జాబితా చాంతాడును తలపిస్తోంది. మహా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ నుంచి ఏకంగా 12 మంది, బీజేపీలో ఏడుగురు టికెట్లు ఆశిస్తుండటంతో, అవకాశం దక్కని వారు పోలింగ్‌ తేదీ నాటికి ఏ పార్టీ గూటికి  చేరుకుంటారో తెలియని పరిస్థితి ఉంది.

ఆశలిలా.. అవకాశం..?

  • కాంగ్రెస్‌ నుంచి కాటా శ్రీనివాస్‌ గౌడ్, శశికళ యాదవరెడ్డి, సపాన్‌దేవ్, గాలి అనిల్‌ కుమార్, శంకర్‌ యాదవ్, ప్రభాకర్, బాసెట్టి అశోక్, కొలన్‌ బాల్‌రెడ్డి, జె.రాములు, గోదావరి అంజిరెడ్డి పటాన్‌చెరు టికెట్‌ ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ దక్కని పక్షంలో ఒకరిద్దరు నేతలు బీజేపీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
  • టీడీపీ నుంచి పటాన్‌చెరు జెడ్పీటీసీ సభ్యుడు గడీల శ్రీకాంత్‌ గౌడ్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ తాజాగా టీడీపీలో చేరి టికెట్‌ రేసులో పోటీ పడుతున్నారు.
  • బీజేపీ నుంచి ఆదెల్లి రవీందర్, సతీష్‌గౌడ్, గాలి గిరి, గిద్దె రాజుతో పాటు ఏడుగురు నేతలు టికెట్‌ ఆశిస్తూ, ఇటీవల పార్టీకి సంయుక్త లేఖ రాసినట్లు తెలిసింది. చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే వారితో ప్రయోగాలు చేయకుండా తమలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే గతంలో పార్టీలో పనిచేసి కాంగ్రెస్‌లో చేరిన ఓ నాయకుడితో పాటు, కాంగ్రెస్‌ పార్టీ నుంచి బలంగా టికెట్‌ ఆశిస్తున్న ఓ నేత టికెట్‌ దక్కని పక్షంలో బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top