పెరిగిన గౌరవం


సాక్షి, సంగారెడ్డి:  స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ సర్కార్ బుధవారం జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత మార్చిలో అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా... జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది. ఈ పెరిగిన వేతనాలు ఏప్రిల్ మాసం నుంచి వర్తింపజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీకతీతంగా హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు మాత్రం మరింత పెంచాలని కోరుతున్నారు. ఈ నిర్ణయంతో జిల్లాకు సంబంధించి ప్రభుత్వంపై ప్రతినెలా దాదాపు రూ.76 లక్షల అదనపు భారం పడుతుంది.

 

 పెంపు ఇలా...

 జెడ్పీ చైర్‌పర్సన్ గౌరవ వేతనం ఇంత వరకు నెలకు రూ.7,500 ఉండగా దాన్ని ఏకంగా రూ.లక్షకు పెంచారు. జెడ్పీటీసీలకు రూ.2250 నుంచి రూ.10 వేలకు, ఎంపీపీలకు రూ.1,500 నుంచి రూ.10 వేలకు, ఎంపీటీసీలకురూ.750 నుంచి రూ.5వేలకు, సర్పంచ్‌లకు రూ.1,500 నుంచి రూ. 5 వేలకు, మున్సిపల్ చైర్మన్లకు రూ.8వేల నుంచి రూ.12 వేలకు, వైస్‌చైర్మన్‌లకు రూ.3,200 నుంచి రూ.5 వేలకు, కౌన్సిలర్లకు రూ.1,800 నుంచి రూ.2,500కు పెరిగింది.   

 

 ఇదీ లెక్క...

 జిల్లాలో చైర్‌పర్సన్‌తో పాటు 46 మంది జెడ్పీటీసీ, 46 మంది ఎపీపీ, 685 మంది ఎంపీటీసీ, 1066 మంది సర్పంచ్‌లు ఉన్నారు. వీరందరికీ ప్రస్తుతం ప్రతినెలా గౌరవ వేతనం రూపేణా రూ.22.92 లక్షలు వెచ్చిస్తున్నారు. కాగా వేతనం పెంపు నిర్ణయంతో అదనంగా రూ.74.82 లక్షల భారం ప్రతినెలా పడుతుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకుగాను ఐదుగురు చైర్‌పర్సన్లు, ఐదుగురు వైస్‌చైర్మన్లు, 150 మంది కౌన్సిలర్లకు మొత్తంగా ప్రతినెలా రూ.3.26 లక్షలు వేతనంగా చెల్లిస్తున్నారు. పెరిగిన వేతనం ఫలితంగా అదనంగా ప్రతినెలా మరో రూ.1.34 లక్షలు ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాగా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గత జనవరి నుంచి గౌరవ వేతనాలు అందటం లేదు. బకాయిలతో సహా ఇప్పుడు గౌరవ వేతనాలు అందవచ్చని అధికారులు చెబుతున్నారు.

 

 ధన్యవాదాలు...

 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేయటం ఆనందంగా ఉంది. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కించపరిచాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వేతనాలను అనూహ్యంగా పెంచడం ఎంతో సంతోషకరం. ఆయనకు ధన్యవాదాలు.  

 -  మనోహర్‌గౌడ్, జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top