ఉత్కంఠ

Income Tax Officers Attack On Revanth Reddy House - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి పాలమూరు ప్రాంతంలోని రాజకీయాల్లో ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. ముందస్తు ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు చేపట్టిన సోదాలు రెండో రోజైన శుక్రవారం కూడా కొనసాగాయి. అయితే రేవంత్‌ విషయంలో ఎప్పుడేం జరుగుతుందనే విషయంలో కాంగ్రెస్‌ వ ర్గాలు ఆందోళన చెందుతున్నా యి. ముఖ్యంగా కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన రోడ్‌ షోలో తనను అరెస్టు చేసే అవకాశం ఉందం టూ ఆయన స్వయంగా చెప్పడం కాంగ్రెస్‌ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అంతేకాదు ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారం కోసం రేవంత్‌పైనే ఆధారపడ్డారు. దీంతో ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనను అదుపులోకి తీసుకుంటే పరిస్థితి ఏమిటనే అయోమయంలో పడిపోయారు.

ప్రజాకర్షణ నేతగా... 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుతో పా టు, సీఎం కేసీఆర్‌ కుటుంబంపై నిప్పులు చెరిగే రేవంత్‌ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు అన్ని చోట్ల అభిమానులను ఏర్పరుచుకున్నారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలను సూటిగా విమర్శించడంతో పాటు టార్గెట్‌ చేసిన వ్యక్తులను మాటలతో ఉక్కిరిబిక్కిరి చేయడం ఆయన నైజం. అందుకే కాంగ్రెస్‌లో చేరిన అతి తక్కువ సమయంలోనే పార్టీ నేతలను ఆకర్షించారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గ ఇన్‌చార్జీలు సభలు, సమావేశాలకు రేవంత్‌ను ముఖ్య అథితిగా పిలుస్తున్నారు. ఇటీవల కాలంలో చేరికలు చాలా వరకు రేవంత్‌ సమక్షంలోనే జరుగుతున్నాయి. ఇక బహిరంగసభలు ఏర్పాటు చేస్తే స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలను రేవంత్‌ తూర్పార పడుతూ వస్తున్నాయిరు.

గతంలో జడ్చర్లలో జరిగిన బహిరంగసభలో మంత్రి లక్ష్మారెడ్డిపై ‘రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదంటూ’ ఘాటు విమర్శలు చేశారు. దీనికి మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తే... తిరిగి ఇంకా తీవ్రమైన విమర్శలతో ప్రతిస్పందించారు. అలాగే ఇటీవలి కాలంలో వనపర్తి, పెబ్బేరులో నిర్వహించిన సభల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై ఘాటు విమర్శలు చేసి కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపారు. ఇక అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో కూడా స్థానిక నేతలపై ఇలాగే విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఆయన ‘స్టార్‌ కాంపెయినర్‌’గా నిలిచారు.
  
భారమంతా రేవంత్‌ మీదే... 
రాబోయే ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిలు పలువురు భారమంతా రేవంత్‌పైనే వేశారు. ఒక విధంగా చెప్పాలంటే పాలమూరు ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ కొత్త ఊపు తీసుకొచ్చారు. అందుకే ఇటీవలి కాలంలో రేవంత్‌ సమక్షంలో చేరికలు ఊపందుకున్నాయి. అలాగే రాబోయే ఎన్నికలకు సంబంధించి జడ్చర్లలో మల్లు రవి, కల్వకుర్తిలో వంశీచంద్‌రెడ్డి, అచ్చంపేటలో వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్‌లో నాగం జనార్దన్‌రెడ్డి, కొల్లాపూర్‌లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి, వనపర్తిలో  జి.చిన్నారెడ్డిని  తమ  ప్రాంతంలో జరిగే సభలకు ఆహ్వానిస్తున్నారు.

ఇది వరకే ఆయా నియోజకవర్గాల్లో ఒక రౌండ్‌ వేసిన రేవంత్‌ రాబోయే ఎన్నిక ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు తన మాటల వాగ్దాటితో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకున్నట్లు  పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుంటే పరిస్థితి ఏంటనేది కాంగ్రెస్‌ నేతలకు అంతుపట్టడం లేదు. ఫలితంగా రేవంత్‌  వ్యవహారం  కాంగ్రెస్‌లోనే కాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠను నింపిందని చెప్పొచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top