తెలంగాణను దేశంలోనే అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ వెళ్తున్న వారు హుస్నాబాద్‌లో ఆగారు.
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : తెలంగాణను దేశంలోనే అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమా ర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ వెళ్తున్న వారు హుస్నాబాద్‌లో ఆగారు. ఈ సందర్భంగా వారికి స్థానిక పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో వినోద్, ఈటెల మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు ఏళ్ల తరబడి పోరాటం చేశామని, ఇక రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తామని తెలిపారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం కొత్త ఒరవడి సృష్టిస్తుందన్నారు. ఉద్యమానికి జిల్లా ప్రజలు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని, వారందరికీ కృతజ్ఞతలు ప్రకటించారు. అధికారంలోకొచ్చామని అహం తెచ్చుకోవద్దని, ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త ప్రజలతో మమేకం కావాలని హితబోధ చేశారు. అంతకుముందు వారికి జెడ్పీటీసీ రాయిరెడ్డి రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాలోతు బీలునాయక్, పార్టీ మండల అధ్యక్షుడు ఎడబోయిన తిరుపతిరెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ అభ్యర్థి సుద్దాల చంద్రయ్య, నాయకులు కన్నోజు రామకృష్ణ, గూళ్ల రాజు తదితరులు స్వాగతం పలికి స్వీట్లు తినిపించారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం
హుజూరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకా లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎంపీ బోయినపల్లి వి నోద్‌కుమార్ వెల్లడించారు. ఎంపీగా గె లిచిన తర్వాత తొలిసారిగా హుజూరాబాద్‌కు వచ్చిన ఆయన మాట్లాడుతూ పేదలకు రూ.3లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తామని, మేనిఫెస్టో అంశాలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్లలో ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామన్నారు.
ధనయజ్ఞం ఉండదు : ఈటెల
కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల తరహాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ధనయజ్ఞం, అవినీతి, అక్రమాలు ఉండవని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఎంపీతో కలిసి హుజూరాబాద్‌కు వచ్చిన ఆయనకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఆకలికేకలు లేని, ఆత్మహత్యలు లేని తెలంగాణ కోసం అహర్నిశలు కృషిచేస్తామన్నారు. వారివెంట హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ఉన్నారు.