అక్రమ లే‘ఔట్‌’

Illegal Layouts in HMDA - Sakshi

లెక్క తేలింది...‘యాక్షన్‌’ మిగిలింది

హెచ్‌ఎండీఏ పరిధిలో అక్రమ లేఔట్ల కూల్చివేతకు రంగం సిద్ధం

నాలుగు జోన్‌లలో గుర్తించిన 713 వెంచర్లపై చర్యలకు నిర్ణయం

సాక్షి. సిటీబ్యూరో:  నగర శివారు ప్రాంతాలతో కలిపి ఏడు జిల్లాల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో 713 అక్రమ కట్టడాలున్నట్టు అధికారులు గుర్తించారు. అత్యధికంగా ఘట్‌కేసర్‌లో 245 ఉంటే, అతి తక్కువగా శంషాబాద్‌లో 129 అక్రమ లేఅవుట్లు ఉన్నట్టుగా లెక్క తేల్చారు. అలాగే శంకర్‌పల్లి జోన్‌లో 189, మేడ్చల్‌ జోన్‌లో 150 ఉన్నట్టుగా గుర్తించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ ఆదేశాల ప్రకారం ఏప్రిల్‌ 29 నుంచి మే 10వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన జూనియర్‌ ప్లానింగ్‌ అధికారులు, అడిషనల్‌ ప్లానింగ్‌ అధికారులు, ప్లానింగ్‌ అధికారులు నాలుగు జోన్‌లలో కలిపి 713 అక్రమ లేఅవుట్లు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఈ ప్రత్యేక డ్రైవ్‌లో అధికారులు గుర్తించిన అక్రమ లేఅవుట్‌లకు గ్రామ పంచాయతీ ద్వారా నోటీసులు జారీ చేసి కూల్చివేయనున్నారు. అయితే అధికారులు గుర్తించింది వందల్లో ఉన్నా వీటి సంఖ్య వేలల్లో ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈసారైనా దూకుడు ప్రదర్శిస్తారా...
ఆరు నెలల క్రితం కూడా పూర్వ హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం అక్రమ కట్టడాల గుర్తింపుపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించినా ఆ తర్వాత చర్యల విషయంలో మాత్రం దూకుడు ప్రదర్శించలేదు. అక్రమ కట్టడాల గుర్తింపుపై హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ అధికారులు హల్‌చల్‌ చేసినా.. ఆ తర్వాత ఏమైంది ఏమో గానీ కూల్చివేతల విషయంలో మాత్రం అడుగు ముందుకుపడలేదు. అయితే ఈసారి హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ అక్రమ లేఅవుట్‌లపై సీరియస్‌గా ఉండటంతో కూల్చివేతలు ఉండొచ్చనే అభిప్రాయం వినవస్తోంది. అక్రమ లేఅవుట్‌లను నియంత్రించడం ద్వారా హెచ్‌ఎండీఏ ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంటుందనే లెక్కలు వేస్తున్నారు. మరోవైపు భవిష్యత్‌పై భారీ ఆశలతో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి భరోసా కలిగించేలా హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ అనుమతి నియమ నిబంధనలు ఉండటం కలిసొచ్చే అంశమని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఇటు సంస్థకు, అటు ప్లాట్ల కొనుగోలుదారులకు మంచి భవిష్యత్‌ ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ను నిలువరించేగలిగితే..
ఇదిలాఉండగా హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన లేఅవుట్లలోని ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు ఇటీవల లేఖ రాయడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన లేఅవుట్ల వివరాలను స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అందులో తెలిపారు. వీటి ఆధారంగా అనుమతి పొందిన లేఅవుట్లలోని ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసేలా హెచ్‌ఎండీఏ పరిధిలోని సబ్‌రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనివల్ల పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ లేఅవుట్లను నియంత్రించడంతో పాటు భవిష్యత్‌ మీద ఆసరాతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న జనాలకు న్యాయం చేసినట్టవుతుందని అరవింద్‌కుమార్‌ అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు అక్రమ లేఅవుట్‌ల కూల్చివేతలు, మరోవైపు రిజిస్ట్రేషన్‌ జరగకుండా రెండువైపులా ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహన్ని అమలుచేస్తుండడంతో ఏమి జరుగుతుందన్న దానిపై ఆసక్తికర చర్చ ఇటు జనాల్లో, అటు రియల్టర్లలో నడుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top