ఎన్‌టీఆర్‌పై గెలుపును మరిచిపోలేను

I can Not Forget Win Over NTR says Chittaranjandas - Sakshi

32 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం

మొదటిసారే విజయం సాధించా  

ఆ సమయంలో రూ.3లక్షలు ఖర్చయ్యాయి

రెండోసారి టీడీపీ వ్యవస్థాపకుడిపై గెలుపొందాను

ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశా

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జక్కుల చిత్తరంజన్‌దాస్‌

‘తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావుపై పోటీచేసి గెలుపొందడం నా జీవితంలో మరిచిపోలేను. అప్పుడే రాష్ట్ర మంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. ఆ సమయంలో అందరూ నన్ను జాయింట్‌ కిల్లర్‌గా పిలిచారు’ అని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జక్కుల చిత్తరంజన్‌దాస్‌ చెప్పారు. చిన్నప్పటి నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచిన నాకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి 32 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వచ్చింది. రెండవసారి ఎన్టీఆర్‌పై పోటీచేశాను. అని వివరించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చిత్తరంజన్‌దాస్‌ తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌లో మా నాన్నగారు అడ్వకేట్‌గా పనిచేస్తూ కల్వకుర్తిలో స్థిరపడ్డారు. మాది మొదటి నుంచి రాజకీయ కుటుంబం. మా నాన్న నర్సింహదాస్‌ కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తుండేవారు. దీంతో చిన్నప్పటి నుంచే నాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. యూత్‌ కాంగ్రెస్‌లో పనిచేశాను. కల్వకుర్తి బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా, జిల్లా కాంగ్రెస్‌ సేవాదళ్‌ చైర్మన్‌గా కూడా పనిచేశాను. అప్పట్లో మాజీ మంత్రులు మహేంద్రనాథ్, జైపాల్‌రెడ్డి ప్రచారాలలో  పాల్గొన్నాను.

తొలిసారిగా అవకాశం...
1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తొలిసారిగా కల్వకుర్తి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం వచ్చింది. ఆ నియోజక వర్గంలో అప్పటికే కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది.  నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేశారు. అప్పుడు జనతాపార్టీ అభ్యర్థి లింగారెడ్డిపై దాదాపు 10 వేల మెజార్టీతో విజయం సాధించాను. మొదటిసారి ఎన్నికల్లో దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశాను.

బీసీలకు 40 శాతం టికెట్లు ఇవ్వాలి  
ప్రస్తుతం కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ సెల్‌ చైర్మన్‌గా పనిచేస్తున్నాను. ఈ ఎన్నికలలో బీసీలకు 40 శాతం టికెట్లు ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కోరాను. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాలను బీసీలకు ఇవ్వాలని కోరాం.

పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు  
ఎమ్మెల్యేగా, మంత్రిగా కల్వకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. కల్వకుర్తికి 220 కేవీ సబ్‌స్టేషన్, ఆర్టీసీ బస్‌డిపో, బస్టాండ్, బాలికల ఐటీఐ ఏర్పాటు చేశాను. మంత్రిగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని (కేఎల్‌ఐ) కేబినెట్‌లో ఆమోదింపచేసి గవర్నర్‌ ప్రసంగంలో పెట్టించాను. ఆ తరువాత నాగర్‌కర్నూల్‌లో కేఎల్‌ఐ కార్యాలయం ఏర్పాటు చేసి సర్వే పనులు ప్రారంభించాను. సుద్దకల్‌ బ్రిడ్జి కూడా నిర్మించాను.  

మంత్రిగా అవకాశం..  
ఎన్టీఆర్‌ను ఓడించి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో అప్పడు కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి కల్పన, టూరిజం శాఖామంత్రిగా పనిచేసే అవకాశం నాకు లభించింది. ఆ తరువాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాను. కాంగ్రెస్‌ పార్టీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తాను. దివంగత మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు కల్వకుర్తిలో నిర్వహించిన ప్రచారంలో వారితో కలిసి పాల్గొనడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి. ఆ తరువాత 1994 ఎన్నికల్లో ఓడిపోయాను. అప్పుడు లో అవేర్‌ సంస్థ చైర్మన్‌ మాధవన్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఓటమి పాలయ్యాను. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top