సమ్మర్‌లో చల్లగా..

Hyderabad Summer temperature Rises - Sakshi

గ్రేటర్‌లో 41 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

వాహనాలు, మొక్కలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల  విషయంలో తస్మాత్‌ జాగ్రత్త   

పెంపుడు జంతువులపై ఓ కన్నేయాలి

గ్రేటర్‌ సిటీ నిప్పుల కుంపటిని తలపిస్తోంది.. వారం రోజులుగా 41 డిగ్రీలకు పైగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు సొమ్మసిల్లుతున్నారు. రోగులు, చిన్నారులు మండుటెండలకు విలవిల్లాడుతున్నారు.ఇళ్లలోని పెంపుడు జంతువులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అలంకరణ కోసం ఇళ్లలో పెంచుకునే మొక్కలు సైతం మాడిపోతున్నాయి. ఎలక్ట్రానిక్‌పరికరాలు మొరాయిస్తున్నాయి. ఎండలో పార్క్‌చేసిన వాహనాలు, ప్రధాన రహదారులపై వెళుతున్న వాహనాల్లో సైతం అగ్నికీలలు ఎగిసిపడి మంటల్లో ఆహుతవుతున్నాయి. ఈనేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయావిభాగాల నిపుణులు సూచనలు అందజేస్తున్నారు.

చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
ఎక్కువసేపు ఎండలో తిరిగితే వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఉదయం 10గంటల లోపు, సాయంత్రం 5గంటల తర్వాతే బయటకు అనుమతించాలి.  
ఎక్కువ నీరు తాగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి.  
జీన్స్‌ కాకుండా తేలికైన తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. చెమటపొక్కుల సమస్య ఉండదు.  
రోజుకు రెండుసార్లు చన్నీటి స్నానం చేయించాలి. వేసవిలో పిల్లలకు చికెన్‌ఫాక్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలి.

సొమ్మసిల్లితే...
సహజంగా మనిషి రోజుకు 7–8 లీటర్ల నీరు తాగాలి. కానీ చాలామంది పని ఒత్తిడితో 2–3లీటర్లు కూడా తాగడం లేదు. రోజంతా ఎండలో తిరగడం వల్ల అనేక మంది వడదెబ్బకు గురవుతున్నారు. ఇలాంటి వారిని వెంటనే నీడ ప్రదేశానికి తీసుకెళ్లి నీటితో ముఖం శుభ్రం చేయాలి.నిమ్మకాయ, ఉప్పు కలిపిన నీళ్లు, కొబ్బరి బొండం తాగించాలి. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలించాలి.  
ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్‌ ధరించాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవడం మంచిది.  

ఎలక్ట్రానిక్‌ వస్తువులతో జాగ్రత్త..
ఎండలో పార్కు చేసిన కారులో ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, కెమెరా వంటి వాటిని ఉంచరాదు.
ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను కూలింగ్‌ ప్యాడ్‌లో ఉంచేందుకు ప్రయత్నించాలి.
ఉపకరణాలను సహజఫైబర్, నియోమ్రేన్‌ కవర్‌లో భద్రపరచాలి.  

మీ వాహనాలు చల్లగా..
సాధ్యమైనంత వరకు  ద్విచక్రవాహనం, కార్లను నీడలో పార్కింగ్‌ చేయాలి.
అధిక ఎండలో వాహనాలను నిలిపితే అందులోని ఇంధనం ఆవిరవుతుంది.
కార్లలో కూలెంట్‌ను, ఇతర ఫ్లూయిడ్స్‌ను సమపాళ్లలో ఉండేలా తనిఖీ చేసుకోవాలి.
కారు వైపర్‌ బ్లేడ్లలో ఉన్న దుమ్ము, ధూళి, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వైపర్‌బ్లేడు పాడయితే కొత్తవి వేయాలి.
ద్విచక్రవాహనం, కార్లలో గాలి ఒత్తిడి (టైర్లలో ప్రెజర్‌)సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. లేనిపక్షంలో అధికంగా ఇంధనం వినియోగమవుతుంది.  గాలి ఒత్తిడిని ప్రతి రెండురోజులకోమారు తనిఖీ చేసుకోవాలి.
ఎప్పటికప్పుడు మెకానిక్‌లతో తనిఖీ చేయించాలి.

మంచినీరు తాగాలి...   
ద్విచక్రవాహనాలపై వెళ్లేటపుడు తేలికైన తెల్లని కాటన్‌ దుస్తులు ధరించడంతోపాటు తలకు క్యాప్‌ పెట్టుకోవాలి.
దాహం వేసినపుడు ఎక్కడపడితే అక్కడి నీరు(కలుషిత) తాగడం వల్ల వాంతులు, విరేచనాల బారినపడాల్సి వస్తుంది.   

మొక్కలు పదిలం ఇలా..
మీ టెర్రస్‌ పై ఉన్న మొక్కలపై అధిక సూర్యరశ్మి పడకుండా షేడ్‌నెట్స్‌ను వినియోగించడం. కనీసం గోనెతట్లను రక్షణ ఉంచండి.
రోజూ ఉదయం,సాయంత్రం వేళల్లో నీటిని అందించండి.
మొక్కల మొదళ్లభాగంలో తేమ ఉండేలా చూసుకోవాలి. ఎండిన ఆకులను కత్తిరించాలి. 
ద్రవాహారాలకు ప్రాధాన్యమివ్వాలి ∙తేలిగ్గా జీర్ణమయ్యే ఓట్స్, రాగిజావ, గోధుమ రవ్వ ఉప్మా ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి.  ఒక ఉడకబెట్టిన గుడ్డును అల్పాహారంతో పాటు తీసుకోవడం వల్ల చక్కటి శక్తి లభిస్తుంది.
పొట్ల, బీర, దోస, సొరకాయ వంటి నీటి శాతం అధికంగా ఉన్న కూరగాయలను తీసుకోవాలి.
మాంసాహారం ఇంట్లో వండుకొని తింటే మంచిది.   
ఎండల వల్ల శరీరం ఎప్పటికప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగడం కాకుండా  ప్రతి గంటకు ఒక సారి నీళ్లు తాగాలి. దీనివల్ల శరీరం చల్లగా ఉంటుంది.  
కొబ్బరినీళ్లు, వాటర్‌మిలన్, తర్బూజా, ఆరెంజ్‌ జ్యూస్‌ వంటివి ప్రతి 2 గంటలకు ఒకసారి తీసుకోవాలి.  
సీనియర్‌సిటిజన్స్, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు  ఎలక్ట్రోరల్‌వాటర్, ఓఆర్‌ఎస్‌ వంటివి ప్రతి  4 గంటలకు  ఒకసారి ఇవ్వాలి. మధుమేహంతో బాధపడేవాళ్లు గ్లూకోజ్‌ వాటర్‌కు బదులు మజ్జిగ తీసుకోవాలి.
మజ్జిగ, సగ్గుబియ్యం, బార్లి గంజి వంటివి మంచిది. సబ్జా గింజలను  మజ్జిగతో కలిపి తీసుకొంటే శరీరానికి చల్లదనంతో శక్తి వస్తుంది.  

 పెంపుడుజంతువులు పదిలం ఇలా..
అధిక ఎండలో పెంపుడు జంతువులువిపరీతంగా ప్రవర్తిస్తాయి.  
పార్కింగ్‌ చేసిన కార్లలో పెంపుడు జంతువులను ఎక్కువ సేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవి ఎండకు తిరగకుండా జాగ్రత్తలు తప్పనిసరి.
సమపాళ్లలో ప్రత్యేక ఆహారం అందించాలి.

ఐస్‌క్రీములు వద్దు
వేసవిలో ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింకులు, శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయనుకోవడం అపోహే.
కాఫీ,టీ, ఆల్కహాల్‌ వల్ల  నష్టమే.

జావలకు ప్రాధాన్యతనివ్వండి   
వేసవిలో ఘనాహారం కంటే ద్రవరూపంలో ఉండి, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. రాగులు, కొర్రలు, అరికెలు వంటి చిరుధాన్యాలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం జావలాగా చేసుకొని తీసుకోవాలి. బియ్యం గంజి  చేసుకొని తాగడం వల్ల  చాలా శక్తి లభిస్తుంది.  –   డాక్టర్‌ సుజాత, ప్రముఖ పోషకాహార నిపుణులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top