మా ఆయన తాగితే కారెందుకు సీజ్‌ చేస్తారు

Hyderabad Police Caught Woamn In Drunk And Drive At Jubilee Hills - Sakshi

నేను ఇంటికెలా వెళ్లాలి 

డ్రంకన్‌ డ్రైవ్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ   

బంజారాహిల్స్‌: ‘మా ఆయన మద్యం తాగి కారు నడిపితే మీరు కేసు నమోదు చేయండి.. అంతేకాని బండి సీజ్‌ చేస్తే నేను ఇంటికెలా వెళ్లాలి?’ అని ఓ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కారును ఎలా సీజ్‌ చేస్తారని ప్రశ్నించింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–1లోని హీరో బాలకృష్ణ ఇంటి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఓ వ్యక్తి అతిగా మద్యంతాగి వాహనం నడుపుతూ శ్వాస పరీక్షలో పట్టుబడగా ఆ కారును సీజ్‌ చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు యత్నించారు. పక్కనే కూర్చున్న ఆయన భార్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  తన భర్త తాగితే ఆయనపై కేసు నమోదు చేసుకుంటే సరిపోతుందని, ఇక్కడి నుంచి తాను ఎలా వెళ్లాలంటూ వాగ్వాదానికి దిగింది.

కారును ఎందుకు సీజ్‌ చేస్తారంటూ ప్రశ్నించింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కారు సీజ్‌ చేసేందుకు పోలీసులు యత్నించగా ఆమె నిరసన వ్యక్తం చేసింది. ఇంత హంగామా అవసరమా అంటూ నిలదీసింది. రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు చూపించడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు మీడియాకు సమాచారం అందించారు.ఓ చానల్‌ విలేకరి అక్కడికి వచ్చి వాగ్వాదానికి దిగిన మహిళను వీడియో తీస్తుండగా ఆమె తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ దుర్భాషలాషలాడింది. కెమెరాను కింద పడేసి పగులగొట్టింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. వారి పేర్లు చెప్పడానికి కూడా నిరాకరించారు. ఎక్కడుంటారో కూడా పోలీసులకు చెప్పలేదు. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా డ్రంకన్‌ డ్రైవ్‌లో మోతాదుకు మించి మద్యం తాగి వాహనం నడుపుతున్న 101 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 61 ద్విచక్రవాహనాలు, 39 కార్లు, ఒక ఆటో ఉన్నాయి.  

మద్యం మత్తు..అదుపుతప్పిన వైద్యుడి కారు   
బంజారాహిల్స్‌: మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వైద్యుడు బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యుడు తన నిస్సాన్‌ కారు (ఏపీ09సీఎం6424)లో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి మీదుగా ముందుకు వెళ్తున్నాడు. పీకల దాకా మద్యం సేవించిన మత్తులో కారును అదుపుతప్పిన వేగంతో పోనిస్తుండగా ఆస్పత్రి సమీపంలో అదుపుతప్పింది.

 రోడ్డు మధ్యలో ఉన్న గోడకు కారు ఢీకొట్టడంతో గోడ కూలగా కారు దెబ్బతిన్నది. అయితే వైద్యుడు మెల్లగా జారుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీయగా ఆ కారు వైద్యుడిదని తేలింది. అయితే పోలీసుల కళ్లుగప్పి కేసు తనపైకి రాకుండా సదరు వైద్యుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. పోలీసులు సదరు వైద్యుడ్ని విచారిస్తున్నారు. టైరు పంక్చర్‌ కావడం వల్లనే కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టినట్లు వైద్యుడు ఆరోపిస్తుండగా ఇక్కడున్న ప్రత్యక్ష సాక్షులు మాత్రం అదుపుతప్పిన వేగంతో వచ్చి గోడను ఢీకొట్టినట్లు పోలీసుల విచారణలో  వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top