మీరు క్యూలో ఉన్నారు

Hyderabad People Suffering With Viral Fever - Sakshi

జ్వరాలతో ఆస్పత్రులు కిటకిట

‘గాంధీ’కి పోటెత్తిన రోగులు గంటల తరబడి క్యూలైన్లలో..

ఉస్మానియా,ఫీవర్‌ ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి

రికార్డుస్థాయిలో ఓపీ రోగుల నమోదు

సిటీకి జ్వరమొచ్చింది. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో జనంఅల్లాడుతున్నారు. విషజ్వరాల ప్రభావం తీవ్రమవడంతో రోగులు ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. నగరంలోని గాంధీ, ఫీవర్, ఉస్మానియా ఆస్పత్రులకు సోమవారం వేల సంఖ్యలో రోగులు వచ్చారు. రోగుల సంఖ్యకు తగిన వసతులు లేక నానాపాట్లు పడ్డారు. ముఖ్యంగా ఫీవర్‌ ఆస్పత్రిలో ఓపీ వద్ద చాంతాడంతలైను ఉండడంతో చాలా మంది అవస్థలు పడ్డారు. గంటల తరబడి క్యూలో నిల్చొని నీరసించిపోయారు. గాంధీలోనూ గంటలతరబడి రోగులు వేచిఉండడం కన్పించింది.

గాంధీఆస్పత్రి : మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి అవుట్‌ పేషెంట్‌ విభాగానికి సోమవారం రోగులు పోటెత్తారు. రద్దీకి అనుగుణంగా చిట్టీ కౌంటర్లు పెంపు, తగిన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో  ఓపీ చిట్టీలు, వైద్యసేవల కోసం  గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారు. వీల్‌ఛైర్లు, స్ట్రెచర్లు అందుబాటులోలేక దివ్యాంగులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. కుటుంబీకులే రోగులకు ఎత్తుకుని వైద్యసేవల కోసం తీసుకువెళ్లారు. సోమవారం రికార్డు స్థాయిలో ఓపీ రోగుల సంఖ్య నమోదైంది. సాధారణ రోజుల్లో గాంధీ ఓపీలో 3000 నుంచి 3500 మంది చికిత్సకువస్తుండగా సోమవారం మాత్రం 4వేల మంది చికిత్స కోసం వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇన్‌పేషెంట్‌ విభాగంలో ఆరోగ్యశ్రీ రోగులు 30శాతం పెరిగినట్లు   సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.

ఉస్మానియాలో..
అఫ్జల్‌గంజ్‌ : ఉస్మానియా ఆస్పత్రి సోమవారం రోగులతో కిటకిటలాడింది. దాదాపు 1600మంది చికిత్స కోసం వచ్చారు. రోగుల సౌకర్యార్థం అన్ని విభాగాల్లోని వైద్యులను అత్యవసర సేవలకు వినియోగించామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. నాగేందర్‌ తెలిపారు.

సాక్షి, సిటీబ్యూరో:  నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో సోమవారం ఓపీ సహా ఐపీ విభాగాలన్నీ కిక్కిరిసిపోయాయి.  ఓపీ సహా ఫార్మసీలో రోగుల నిష్పత్తికి తగినన్ని కౌంటర్లు లేకపోవడంతో మందులు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. అసలే జ్వరం ఆపై గంటల తరబడి క్యూలైన్‌లో నిల బడాల్సి వచ్చింది.  సాధారణంగా రోజుకు సగటున వెయ్యి నుంచి 1200 మంది రోగులు వస్తుండగా సోమవారం ఈ సంఖ్య రెండు వేలు దాటింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top