జర్నీలో.. జర్క్‌లు

Hyderabad Metro Train Suffering With Technical Issues - Sakshi

వెంటాడుతున్న బాలారిష్టాలు

మెట్రో రూట్లో ఊడిపడుతున్న విడిభాగాలు

విద్యుత్‌ తీగలపై ఫ్లెక్సీ చిరిగి పడితే రైలుకు బ్రేకులు

కాలుష్యం పెరిగితే రెడ్‌ సిగ్నల్స్‌  

తరచూ నిలిచిపోతున్న మెట్రో రైళ్లు

25 కేఎంపీహెచ్‌కు పడిపోతున్న రైళ్ల వేగం

గ్రేటర్‌ అవసరాలకు సరిపోని సీబీటీసీ టెక్నాలజీ

మార్పులు చేయాలంటున్న హెచ్‌ఎంఆర్‌

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ మెట్రో రైలు వేగానికి తరచూ బ్రేకులు పడుతున్నాయి. స్టేషన్లు, ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ తీగలపై ఏర్పాటు చేసిన విడిభాగాలు చిన్న గాలి దుమారానికే ఊడిపడుతున్నాయి. ఇక మెట్రో మార్గంలో సుమారు వంద వరకు ఉన్న భారీ హోర్డింగ్‌లు.. వాటిపై ఏర్పాటు చేసిన పీవీసీ ఫ్లెక్సీలు చిరిగి విద్యుత్‌ తీగలపై పడితే రైలు నిలిచిపోతోంది. తాజాగా శనివారం అసెంబ్లీ మెట్రోస్టేషన్‌ సమీపంలో మెట్రో ట్రాక్‌పై లైటనింగ్‌ అరెస్టర్‌ రాడ్‌(పిడుగు పాటును నిరోధించేది) ఊడిపడడంతో రైలును అరగంట పాటు నిలిపేయాల్సి వచ్చింది. ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి కిందకు దించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఇరవై నెలల్లో సాంకేతిక సమస్యల కారణంగా సుమారు యాభై మార్లు మెట్రో రైళ్ల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. నగర మెట్రో రైళ్లలోని సాంకేతికత వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సీబీటీసీలో లోపాలెన్నో..
డ్రైవర్‌ అవసరం లేని సాంకేతికత.. ఉప్పల్‌లోని ఆపరేషన్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–హైటెక్‌ సిటీ ప్రధాన రూట్లలో మెట్రో రైళ్ల రాకపోకల నియంత్రణ.. కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రైన్‌ కంట్రోల్‌(సీబీటీసీ) వ్యవస్థకు ఇప్పటి దాకా ఉన్న మంచిపేరు. లండన్, సింగపూర్‌ వంటి నగరాల్లో అమల్లో ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు మన మెట్రో రైళ్లకు తరచూ బ్రేకులు వేస్తోంది. వాతావరణంలో దుమ్ము, ధూళి కాలుష్యం పెరగితే ఒక్కసారిగా మెట్రో రైళ్లు దూసుకెళ్లే రూట్లో రెడ్‌ లైట్లు ఆన్‌ అవుతున్నాయి. దీంతో కొన్నిసార్లు రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. అంతేకాదు కొన్నిసార్లు గంటకు 60 కేఎంపీహెచ్‌ వేగంతో దూసుకెళ్లే రైళ్ల వేగం కాస్తా.. 25 కేఎంపీహెచ్‌కు పడిపోతోంది. ఇటీవల ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ రూట్లో 25 రెడ్‌ సిగ్నల్స్‌ ఒకేసారి వెలిగాయి. ఈ పరిణామంతో పలు స్టేషన్ల వద్ద రైళ్లు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన మెట్రో సిబ్బంది ఈ రెడ్‌లైట్‌లను మ్యాన్యువల్‌గా ఆఫ్‌ చేశారు. 

సాంకేతిక సమస్యలు బోలెడు
నగరంలో తలెత్తే వాతావరణ మార్పులతో దుమ్ము, ధూళి కాలుష్యం ఘనపు మీటరు గాలిలో 100 మైక్రో గ్రాములు మించుతోంది. ఈ స్థాయిలో కాలుష్యం నమోదైన ప్రతిసారీ మెట్రో రూట్లలో రెడ్‌ సిగ్నల్స్‌ ఆన్‌ అవుతున్నాయి. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం వంద మైక్రోగ్రాముల లోపల ఉంటేనే సీబీటీసీ సాంకేతికత పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే, రెడ్‌లైట్లు ఆన్‌ అవుతుండడంతో మెట్రో రైలు రిస్టిక్టెడ్‌ మోడ్‌(నియంత్రిత స్థాయి)కు వస్తోంది. దీంతో కొన్నిసార్లు రైళ్లు నిలపాల్సి వస్తోంది. సీబీటీసీ సాంకేతిక అత్యాధునిక, అత్యంత భద్రమైనదని మెట్రో అధికారులు చెబుతున్నా గ్రేటర్‌ వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని హెచ్‌ఎంఆర్‌ అధికారులు ఈ సాంకేతికతను అందించిన థేల్స్‌(లండన్‌) కంపెనీకి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. గతంలో నాగోల్‌–అమీర్‌పేట్‌ రూట్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది.  
మెట్రో రైళ్లు, స్టేషన్ల నిర్వహణను చూస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్‌ సంస్థ పనితీరుపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ ఆధ్వర్యంలో స్టేషన్లు, మెట్రో మార్గాల్లో ఏర్పాటు చేసిన భద్రతకు సంబంధించిన విడిభాగాలు చిన్న గాలికే ఊడి పడుతుండడంతో దీర్ఘకాలంలో ఎలాంటి విపత్తులు ఎదురవుతాయోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం సాంకేతిక ఇబ్బందులే..
టిక్కెట్‌ వెండింగ్‌ యంత్రాలు నూతన రూ.50, రూ.100, రూ.10 నోట్లను స్వీకరించడం లేదు.
నాలుగు పాత కరెన్సీ నోట్లతో కలిపి ఒక కొత్త నోటును యంత్రంలోకి ప్రవేశపెడితే పాతనోట్లు కూడా యంత్రంలోనే ఉండిపోతుండడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
స్టేషన్‌ మధ్యభాగంలో ఆటోమేటిక్‌ ఫెయిర్‌ కలెక్షన్‌ యంత్రాలుండే ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద స్మార్ట్‌ కార్డులను స్వైప్‌చేస్తే కొన్నిసార్లు యంత్రాలు మొరాయిస్తున్నాయి. ప్రయాణికుల విలువైన సమయాన్ని వృథా చేస్తున్నాయి.
ప్లాట్‌ఫాంపైకి వెళ్లే సమయంలో సెక్యూరిటీ చెక్‌ వద్ద మొబైల్‌ను కూడా స్కానింగ్‌ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తుండడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీ ప్రతిరూట్లో ఆరు నిమిషాలకో రైలు అని ప్రకటించినా కొన్నిసార్లు 10–12 నిమిషాలకు పైగా పడుతోంది.  
సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే కనీసం 30 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేస్తున్నారు.  
హైటెక్‌సిటీ–అమీర్‌పేట్‌ రూట్లో మెట్రో అధికారులు ఎన్ని సాంకేతిక ఇబ్బందులున్నట్లు ప్రకటించినా.. ఈ మార్గంలో మెట్రో జర్నీ నత్తనడకను తలపిస్తోందని, తాము కార్యాలయాలకు వెళ్లడం ఆలస్యమవుతోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు.
పార్కింగ్‌ లాట్‌ వద్ద ద్విచక్ర వాహనానికి నెలవారీ పాస్‌ రూ.250 వసూలు చేస్తున్నారు. ఈ రుసుం అధికంగా ఉండడంతో సిటీజన్లు మెట్రో పార్కింగ్‌ లాట్‌కు దూరంగా ఉంటున్నారు.  
మెట్రో కారిడార్‌లో పిల్లర్లకు లైటింగ్‌ లేకపోవడంతో ఈ రూట్లలో రాత్రి వేళల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. వర్షాకాలంలో లైటింగ్‌ లేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
మెట్రోరైళ్ల గమనంలో సడన్‌బ్రేక్‌లు వేస్తుండడంతో ప్రయాణికులు తూలి పడిపోతున్నారు.  
రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని సార్లు శబ్దకాలుష్యం శృతిమించుతోందని కొందరు ప్రయాణికులు వాపోతున్నారు.  
స్టేషన్ల వివరాలను అనౌన్స్‌మెంట్‌ చేసే యంత్రాలు తరచూ మొరాయిస్తుండడంతో సరైన సమాచారం అందక, దిగాల్సిన స్టేషన్‌లో కాకుండా మరో స్టేషన్‌లో దిగి తలపట్టుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top