కాంబో కథ కంచికేనా?

Hyderabad Metro MMTS And RTC Cambo Project Delayed - Sakshi

ప్రతిపాదనలకే పరిమితమైన కామన్‌ టికెట్‌

ఇప్పటికీ పురోగతి లేని వైనం  

ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్‌లలో ప్రయాణానికి ఉపయుక్తం  

అమల్లోకి వస్తే అందుబాటులోకి ఉమ్మడి రవాణా

 సాక్షి, సిటీబ్యూరో: మేడిపల్లికి చెందిన శ్రీకాంత్‌ సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు. హైటెక్‌ సిటీలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగి. మెట్రో రాకముందు ప్రతిరోజు క్యాబ్‌లో వెళ్లేవాడు. ఉప్పల్‌ నుంచి అమీర్‌పేట్‌ మీదుగా హైటెక్‌ సిటీ వరకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత... అతని రవాణా సదుపాయాల్లో మార్పులు వచ్చాయి. మేడిపల్లి నుంచి ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్‌ వరకు సిటీ బస్సులో వస్తాడు. అక్కడి నుంచి మెట్రోలో   హైటెక్‌ సిటీకి వెళ్తాడు. ఇందుకోసం అతడు రెండుసార్లు టికెట్‌ తీసుకోవాల్సి వస్తోంది. తిరుగు ప్రయాణంలో హైటెక్‌ సిటీ నుంచి ఎంఎంటీఎస్‌ రైలులో సికింద్రాబాద్‌ వరకు వస్తాడు. అక్కడి నుంచి సిటీ బస్సు/మెట్రోలో వెళ్తాడు. ఈ మూడు రకాల ప్రయాణాలకు మూడు టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పైగా ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లో, మెట్రో స్టేషన్‌లో టికెట్‌ కోసం కొంత సమయం వెచ్చించక తప్పదు. ఇది ఒక్క  శ్రీకాంత్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. చాలామంది ప్రయాణికులు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఒక రకమైన రవాణా సదుపాయం నుంచి మరో రకమైన రవాణా సదుపాయంలోకి మారేందుకు ఒకే టికెట్‌పై ప్రయాణం చేసే అవకాశం లేకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. పైగా ప్రయాణికులు కొన్ని రాయితీలు, సదుపాయాలనూ కోల్పోవాల్సి వస్తోంది. ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్‌.. ఈ మూడింటిలోనూ పనిచేసే విధంగా కామన్‌ టికెట్‌ ప్రవేశపెట్టాలని సంకల్పించినప్పటికీ... అది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇది అమల్లోకి వస్తే ప్రయాణికులకు ఉమ్మడి రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుంది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. 

ప్రయాణం ఏకీకృతం  
గ్రేటర్‌ ప్రజా రవాణాలో ఇప్పటికీ ఆర్టీసీనే అతి పెద్ద సంస్థ. సుమారు 3,850 బస్సులతో ప్రతిరోజు 32లక్షల మందికి పైగా రవాణా సదుపాయం అందజేస్తోంది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చిన మార్గాల్లో అనివార్యంగానే కొన్ని ట్రిప్పులను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎల్‌బీనగర్‌ నుంచి లింగంపల్లికి వెళ్లే మార్గంలో ఏసీ బస్సులను ఉపసంహరించుకున్నారు. సికింద్రాబాద్‌ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే ఏసీ బస్సులు కూడా దాదాపు రద్దయ్యాయి. మెట్రో రైలుకు సమాంతరంగా ఉన్న మార్గాల్లో సిటీ బస్సులకు కొంతమేర ఆక్యుపెన్సీ తగ్గింది. ప్రస్తుతం మెట్రో రైళ్లలో  ప్రతిరోజు 3లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు  121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు తిరుగుతున్నాయి. రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. అలాగే మరో 5లక్షల మంది ఆటోరిక్షాలను వినియోగించుకుంటున్నారు. సుమారు 1.3 లక్షల ఆటోలు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. అయితే అన్ని రకాల ప్రజా రవాణా సాధనాల్లో రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా ఒకే స్మార్ట్‌ కార్డు (కామన్‌ టికెట్‌)ను అందుబాటులోకి తేవాలని ఏడాది క్రితమే ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ తరహా అన్ని రవాణా సదుపాయాల్లో వినియోగించుకొనే స్మార్ట్‌కార్డును తయారు చేసి అందజేసేందుకు అప్పట్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటిచింది. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. 

రాయితీలతో ప్రయోజనం  
ఆర్టీసీ, మెట్రో కంటే ఎంఎంటీఎస్‌లో ప్రయాణం ఎంతో చౌక. సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లి వరకు కేవలం రూ.10. ప్రయాణం చేసే దూరాన్ని బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు ఎంఎంటీఎస్‌ నెలవారీ పాస్‌లు ఉన్నాయి. కానీ అన్ని రూట్లలో ఎంఎంటీఎస్‌ లేదు కదా! అలాగే స్మార్ట్‌కార్డులపై మెట్రో 10 శాతం రాయితీ అందజేస్తోంది. ఏరోజుకారోజు టికెట్‌ తీసుకొని ప్రయాణం చేయడం కంటే.. ఇది ఎంతో ప్రయోజనం. సిటీ బస్సుల్లోనూ వివిధ రకాల పాస్‌లు ఉన్నాయి. రోజువారీ టికెట్‌లపై 25శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఈ మూడు రకాల సదుపాయాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక స్మార్ట్‌కార్డు (కామన్‌ టికెట్‌) రూపంలో ఉమ్మడి ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తే... ప్రయాణికుడికి మూడు సదుపాయాలు లభించడమే కాకుండా వివిధ సంస్థలు అందజేసే రాయితీలతో చార్జీలు తగ్గే అవకాశం ఉంది. పైగా ఆన్‌లైన్‌ చెల్లింపుల వల్ల కూడా కొంత రాయితీ లభించవచ్చు. ప్రయాణికుడు ఏ రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకుంటే ఆ సంస్థ ఖాతాలోకి చార్జీలు జమయ్యే విధంగా ఈ కామన్‌ కార్డు ఉంటుంది. ప్రస్తుతం మెట్రో స్టేషన్‌లలో స్మార్ట్‌ కార్డులను వినియోగిస్తున్న ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌ ఎంట్రీ గేట్‌ల తరహాలో ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సిటీ బస్సుల్లో అయితే ఈ తరహా సదుపాయాన్ని డోర్స్‌ వద్ద ఏర్పాటు చేస్తారు. లేదా కండక్టర్‌లకే ఆటోమేటిక్‌ టిక్కెట్‌ ఫేర్‌ కలెక్షన్‌ యంత్రాలను అందజేయాల్సి ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top