బస్తీల్లో భయం భయం

Hyderabad Basthi People Fear on Coronavirus Positive Cases - Sakshi

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

తాజాగా మరో 51 మందికి పాజిటివ్‌

రిపోర్టుల కోసం తప్పని నిరీక్షణ

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లాలో కరోనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఒకరి తర్వాత మరొకరికి వైరస్‌ విస్తరిస్తోంది. శనివారం రాత్రి వరకు జిల్లాలో 111 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తాజాగా ఆదివారం మరో 51 కేసులు వెలుగు చూశాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 162 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 11 మంది డిశ్చార్జ్‌ కాగా, ఖైరతాబాద్, యూసఫ్‌గూడ, చంచల్‌గూడ, సికింద్రాబాద్, దారుషిఫా, న్యూమలక్‌పేట్‌లకు చెందిన ఆరుగురు మృతి చెందారు. 90 శాతం కేసులు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లోనే వెలుగు చూడటం గమనార్హం. ముఖ్యంగా సికింద్రాబాద్, ఎంజే రోడ్, మహేంద్రహిల్స్, సికింద్రబాద్, ఎంజే రోడ్, నాంపల్లి, యూసఫ్‌గూడ, ఎమ్మెల్యే కాలనీ, న్యూమలక్‌పేట, చంచల్‌గూడ, నారాయణ గూడ, ఖైరతాబాద్, దారుషిఫా తదితర బస్తీల్లోని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పక్కింట్లో ఎవరికి ఏ వైరస్‌ సోకిందో..? ఎవరి నుంచి ఎప్పడు? ఏ రూపంలో వైరస్‌ విరుచుకుపడనుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

ఐదు రోజులు..122 కేసులు  
గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో ఇప్పటి వరకు 193 కేసులు నమోదు కాగా, ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు..కేవలం ఐదు రోజుల్లోనే 122 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక రంగారెడ్డిలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదు కాగా..వీటిలో ఎక్కువగా మణికొండ, రా జేంద్రనగర్, షాద్‌నగర్‌ పరిధిల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 14 కేసులు నమోదవగా, వీటిలో ఎక్కువ కేసులు కుత్బుల్లాపూర్‌లోనే నమోదవడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కుత్బుల్లాపూర్, షాద్‌నగర్‌లకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో 450 మందికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మరో 3300 మందికిపైగా గాంధీ, ఫీవర్, సరోజినిదేవి, నేచర్‌క్యూర్, యునానీ, రాజేంద్ర నగర్‌లోని ఐసోలేషన్‌ కేంద్రాలు సహా ఇతర జిల్లాల్లో ఉన్న ఐసోలేషన్‌ కేంద్రాల్లో పరీక్షల కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిసింది. 

ఇదీ పరిస్థితి
కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి 56 కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో వారం రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆయన కూడా తబ్లీగీ సమావేశాలకు వెళ్లి వచ్చాడు. ఆయనతో పాటు ఆయన సోదరుడు, కుమారుడు సహా మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకింది. వీరందరినీ కూడాగాంధీలో ఉంచారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రిబాత్‌రూమ్‌లో కాలుజారి పడి చనిపోయాడు. దీంతోఅక్కడే ఉన్న బంధువులు వైద్యులపై దాడి చేశారు.ఇద్దరు వైద్యులను గాయపరిచారు. దీంతో వారినిఛాతి ఆస్పత్రికి తరలించారు. 

అపోలో ఆస్పత్రిలో చనిపోయిన యూసఫ్‌గూడకు చెందిన వ్యక్తి(55)కి ఆయన భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కోడళ్లు, అల్లుళ్లు, కూతుళ్లు, మనుమలు ఇలా మొత్తం 13 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురికి లక్షణాలు బయటపడ్డాయి. 

ఖైరతాబాద్‌ గ్లోబల్‌ ఆస్పత్రిలో చనిపోయిన అదే ప్రాంతానికి చెందిన వృద్ధుడు(74)కి సుమారు 25 మంది వరకు  క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఆయన భార్య, కొడుకు, కోడలికి పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చింది.  ఆయనతో పాటు ఢిల్లీకి వెళ్లిన ఇందిరానగర్‌ బస్తీకి చెందిన మరో వ్యక్తిని గుర్తించారు. ఇప్పటికే ఆయన భార్య గాంధీలో చికిత్స పొందుతున్నారు.

గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన చంచల్‌గూడకు చెందిన ఉర్దూ పత్రిక జర్నలిస్టు(58)కి ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరో 20 మంది వరకు సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. ఈయన జమాత్‌కు హాజరు కాకపోయినప్పటికీ...నూర్ఖాన్‌బజార్‌లోని ఓ కుటుంబ పెద్దతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇటీవలే వేరే దేశం నుంచి వచ్చారు. ఆయన కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. వీరి ద్వారా జర్నలిస్టుకు కూడా కరోనా వైరస్‌ విస్తరించి ఉంటుందని అంచనా. ఆయనకు క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న వారందరినీ ఇప్పటికే కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.  

గాంధీలో చనిపోయిన దారుషిఫాకు చెందిన వృద్ధుడు (65)కి ఎనిమిది మంది కుటుంబ సభ్యులు సహా మొత్తం 13 మంది క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ ఇప్పటికే కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసి, హోం క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఎక్కువ లక్షణాలు ఉన్న వారికి ఆయా ఆస్పత్రుల్లోనే చికిత్సలు
అందిస్తున్నారు.

ఢిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన న్యూ మలక్‌పేటకు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో బంధువులు ఆయన్ను మార్చి 28న మలక్‌పేటలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు.

ఆ తర్వాత ఆయన భార్య(60) కూడా ఇదే లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. వృద్ధుడు మార్చి 31న మంగళవారం రాత్రి  చనిపోగా, 1వ తేదీన బుధవారం రాత్రి పాజిటివ్‌ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. అప్పటికే భర్త చనిపోవడంతో భార్య కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయించుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె మరో ఆస్పత్రిలో చేరిన దాఖలాలు కూడా లేవు. ఆమె నుంచి ఇతరులకు వైరస్‌ సోకే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top