‘ప్రాణ’హితుడు

Hussain Sagar Rescue man Shiva Special Story - Sakshi

107 మందిని రక్షించిన శివ  

 హుస్సేన్‌ సాగర్‌ అతడి అడ్డా  

ఎంతో మందిని రక్షించిన శివ పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. మురుగు నీటిలోని శవాలను వెలికి తీయడంతో పాటు ఎంతోమందిని కాపాడినందుకు మహేందర్‌రెడ్డి నగర పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో శివను అవార్డుతో సత్కరించారు.

రాంగోపాల్‌పేట్‌: అప్పుడు సమయం సాయంత్రం 3 గంటలు.. ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు ఎప్పటిలాగే ఉన్నాయి. కొంత మంది ఫుట్‌పాత్‌పై నడుస్తూ హుస్సేన్‌ సాగర్‌ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఉన్నట్లుండి ఓ 45 ఏళ్ల వ్యక్తి సాగర్‌ నీళ్లలోకి దూకేశాడు. వెంటనే వాహనదారులు, పాదాచారులు అందరు గుమికూడారు..  అయ్యో ఎవరో దూకేశారు అంటున్నారే తప్ప రక్షించేందుకు ఎవరూ సాహసించడం లేదు. కొద్ది దూరంలో ఉన్న ఓ వ్యక్తి అది గమనించి నీళ్లలోకి నీళ్లలోకి దూకి మునిగిపోతున్న వాడిని ఒడ్డుకు లాక్కొచ్చాడు. కడుపులోని నీళ్లు కక్కించి శ్వాస అందించి ప్రాణాలు కాపాడాడు. 

మిట్ట మధ్యాహ్నం ఓ మహిళ ట్యాంక్‌బండ్‌పై ఏడ్చుకుంటూ రోడ్డు దాటి వచ్చి హుస్సేన్‌ సాగర్‌లోకి దూకేసింది. అప్పటికే ఆమె పరిస్థితిని గుర్తించి అనుసరిస్తున్న వ్యర్తి వెంటనే సాగర్‌లోకి దూకి మునిగిపోతున్న ఆమెను బయటకు తీశాడు. ఆమె ప్రాణాలతో భయట పడ్డది కానీ ఆ వ్యక్తి కుడి చేయి భుజం వద్ద ఓ ఇనుప చువ్వ గుచ్చుకుని తీవ్ర గాయమైంది. అయినా అతడిలో ఓ ప్రాణం కాపాడన్న ఆనందం ఉంది తప్ప గాయాన్ని మాత్రం పట్టిచుకోలేదు. ఇలా ఒకరు.. ఇద్దరూ కాదు ఏవేవో సమస్యలతో బాధలతో హుస్సేన్‌ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకోవాలని దూకేసిన 107 మందిని అతను రక్షించాడు. అందుకు తన ప్రాణాలు ఫణంగా పెట్టిన అతడి పేరు ‘శివ’. ట్యాంక్‌బండ్‌నే అడ్డాగా మార్చుకుని అక్కడే కుటుంబంతో కలిసి ఉంటూ ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఒకవైపు ప్రాణాలు కాపాడుతూ సాగర్‌లో పడిచనిపోయిన వారి మృతదేహాలను వెలికితీయడమే ఒక దైవ కార్యంగా చేపట్టాడా సాహసి. రైలు ప్రమాదాల్లో గాయపడి మరణించిన వారి మృతదేహాలు తరలింపుతో మొదలైన అతడి ప్రస్థానం హుస్సేన్‌ సాగర్‌లో మృతదేహల వెలికితీతతో పాటు ఎంతో మంది పునర్జన్మ నిచ్చిన వ్యక్తిగా నిలుస్తున్నాడు. 

సోదరుడి లాంటి వ్యక్తి మరణంతో..
శివ జీవితం మొత్తం ఫుట్‌పాత్‌ మీదే సాగింది.. సాగుతుంది కూడా. శివకు ఐదేళ్ల వయసులో ఫుట్‌పాత్‌పై తిరుగుతుండగా ఎవరో చాదర్‌ఘట్‌లోని సిధూర్‌ హాస్టల్‌లో చేర్చారు. తర్వాత అక్కడి నుంచి ఖైరతాబాద్‌లోని మరో హాస్టల్‌కు మకాం మారింది. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో నివసించే మల్లేశ్వరమ్మ అనే మహిళ శివను చేరదీసింది. అమె కొడుకు మహేందర్, శివ అన్నదమ్ముల్లా ఉండేవారు. శివ చిన్న వయసులోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు సాయంగా వెళ్లేవాడు. తర్వాత హుస్సేన్‌ సాగర్‌లో మృతదేహాలను వెలికి తీసేవాడు. 

మహేందర్‌ మృతితో మార్పు
తనకు అన్నలాంటి మహేందర్‌ 2013లో హస్మత్‌పేట్‌ చెరువులో మునిగి చనిపోయాడు. దాంతో తల్లిలా పెంచిన మల్లేశ్వరమ్మ బాధ చూడలేకపోయాడు శివ. అప్పటి నుంచి నీటిలో మునిపోతున్న వారిని రక్షించాలన్న సంకల్పంతో హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలనే తన నివాసంగా మార్పుచుకున్నాడు. సాగర్‌ నీటిలో ఎక్కువ సేపు ఉండడం సాధ్యం కాదు. దాంతో మిత్రుడు పవన్‌తో కలిసి వైజాగ్‌ సముద్ర జలాల్లో ఈత సాధన చేసి గజ ఈతగాళ్లుగా మారారు. కానీ దురదృష్టవశాత్తు పవన్‌ ఇదే హుస్సేన్‌ సాగర్‌లో ప్రమాదవశాత్తు మరణించాడు. 

ఉపాధి చూపించిన సాగర్‌
ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న శివకు హుస్సేన్‌ సాగరే ఉపాధి చూపించింది. గణపతి నిమజ్జనాల సందర్భంగా సాగర్‌లో దొరికే ఇనుప చువ్వలు వెలికితీసి వాటిని విక్రయించి ఉపాధి పొందుతుంటాడు. ఇక చనిపోయిన వారి మృతదేహాలను వెలికితీస్తే పోలీసులు కొంత డబ్బు ఇస్తుంటారు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు శివ. ఇటీవల సినిమా షూటింగ్‌లకు నటులకు బౌన్సర్‌గా వెళుతూ ఇంకొంత సంపాదించుకుంటున్నానని చెబుతున్నాడు. తన ఏడుగురు  సంతానంతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఫుట్‌పాత్, పాడుబడిన లేపాక్షి భవనం వద్ద నివాసం ఏర్పరచుకున్నాడు. శివ కుటుంబానికి లేక్‌ ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి ఆసరాగా నిలిచారు. ఆమె మేలు ఎప్పటికీ మరచిపోలేనంటున్నాడు శివ. గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌తో ధనలక్ష్మి మాట్లాడి శివ ముగ్గురు కుమారులను రెసిడెన్సియల్‌ పాఠశాలలో చేర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top