కోరలు చాస్తున్న కాలుష్య భూతం

Huge Pollution In Nalgonda - Sakshi

కంపెనీల్లోనే బోర్లు వేసి వ్యర్థాలను వదులుతున్న వైనం  

మరికొన్ని చోట్ల ఏజెంట్ల ద్వారా వ్యర్థాలను తరలిస్తున్న యాజమాన్యాలు 

సాక్షి, చౌటుప్పల్‌ : ఒకప్పుడు పచ్చటి పంటలతో కళకళలాడిన చౌటుప్పల్‌ మండలం కాలుష్య కాసారంగా మారుతోంది. ప్రస్తుతం మండల భవిష్యత్‌ ప్రమాదంలో పడింది. ఇప్పటికే వ్యవసాయం నాశనం అయ్యింది. పశు సంపద మృత్యువాత పడుతోంది. కులవృత్తులన్నీ కుదేలయ్యాయి. ప్రజలంతా జీవనోపాధికి దూరమవుతున్నారు. జీవితాలన్ని అగమ్యగోచరంగా మారుతుండడంతో బతుకు జీవుడా అనుకుంటూ కుటుంబాలన్నీ వలసలు వెళ్తున్నాయి. కొందరి కాసుల కక్కుర్తితో ఇంతటి ఘోరం జరుగుతుంది. తమ స్వలాభాలే తప్పిస్తే ప్రజల క్షేమాన్ని పట్టించుకోని రసాయన పరిశ్రమల నిర్వాకమే ఈ భయానక పరిస్థితులకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

స్థానికులకు ఉపాధి కల్పిస్తామంటూ నమ్మబలికిన పరిశ్రమల యాజమాన్యాలు ఆ తర్వాత మాత్రం ఉపాధి చూపకపోగా ప్రాణాలనే హరించేవరకు వచ్చాయి. భారీ స్థాయిలో విడుదల చేస్తున్న వ్యర్థరసాయనాలతో సర్వం నాశనమే అ య్యింది.  ఇదేమని అడగాల్సిన ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఉండే రాజకీయ పార్టీల నాయకులు మాత్రం పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చే తాయిళాలకు తలొగ్గి వారికి సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారు. ఫలితంగా రానున్న కొద్ది రోజులకే మండలంలోని ఈ ఊరు... ఆఊరు అని కాకుండా ప్రతి ఊర్లోని ప్రజలంతా ఇళ్లు వదులుకుని వలసలు వెళ్లాల్సిన భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

చౌటుప్పల్‌ మండలంలో సుమారు 25 సంవత్సరాల క్రితం పదిలోపే కంపెనీలు ఉండేవి. ఉన్న కంపెనీలు కూడా కాలుష్యం వెదజల్లని పరిశ్రమలే. కానీ 1993 సంవత్సరం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. స్థానికంగా యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన ఆంధ్రా పారిశ్రామికవేత్తలు తెలివిగా స్థానికంగా పరిశ్రమలను స్థాపించారు. ఒక్కొక్కరుగా గ్రామాల్లో స్థిరపడ్డారు. అలా వచ్చిన అన్ని రకాల కంపనీలు ప్రస్తుతం సుమారుగా 80 వరకు ఉన్నాయి. వీటిలో మూడొంతులకుపైగా రసాయన పరిశ్రమలే కావడం విశేషం. ప్రారంభంలో ఎన్నో రకాల మాయమాటలతో జనాలను ఆకర్షించే యాజమాన్యాలు నేడు దగ్గరకు సైతం రానివ్వడంలేదంటే ఎంతటి దౌర్భాగ్యంగా మారిందో మండల దుస్థితి అర్థం చేసుకోవచ్చు. 

విచ్చలవిడిగా పరిశ్రమల కాలుష్యం 
ప్రస్తుతం మండలంలో రసాయన పరిశ్రమల కాలుష్యం విచ్చలవిడిగా తయారైంది. మండలంలో లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, ఆరెగూడెం, ఎస్‌.లింగోటం, మందోళ్లగూడెం, జైకేసారం, నేలపట్ల, తంగడపల్లి, చౌటుప్పల్, దేవలమ్మనాగారం, మల్కాపురం, కొయ్యలగూడెం, ఎల్లగిరి, ధర్మోజిగూడెం, తూప్రాన్‌పేట గ్రామాల్లో రకరకాల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పరిశ్రమలు వదులుతున్న కాలుష్యానికి హద్దే లేకుండాపోయింది. పరిశ్రమల కారణంగా మండలంలో ఉన్న 26 గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీలో ఉన్న 5 గ్రామాలు పూర్తిగా కలుషితమై ఘోస తీస్తున్నాయి. కాలుష్యం కారణంగా ఎలాంటి పరిశ్రమలు లేని గ్రామాలు సైతం ప్రభావితమయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు, పద్ధతులు ఏమీ లేకుండా ఆయా పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. 

కలుషితమైన భూగర్భజలాలు..
పరిశ్రమల కాలుష్యం కారణంగా మండలంలోని అనేక గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఎర్రగా, నల్లగా, పసుపుగా రంగుమారి వస్తున్నాయి. కాలుష్యం ప్రభావంతో బావులు, బోర్లల్లోని నీరు నురగలు కక్కుతుంది. చేతులతో పట్టుకుంటే చర్మం చిమచిమలాడుతుంది. ఇలాంటి జలాలతో పంటలు  సాగు చేయలేని పరిస్థితి ఉంది. దీంతో చాలా గ్రామాల్లో పంట పొలాలన్నీ పడావుగా మారాయి. తరి పంటలు కాకుండా వర్షాధార పంటలను సాగు చేద్దామని ప్రయత్నించినా పంట ఎదుగుదల రాని పరిస్థితి. ఓ వైపు భూగర్భ జలాలు కలుషి తమై, మరోవైపు పంట పొలాలన్నీ నాశనమవ్వడంతో  రైతాంగం, కుల వృత్తులపై ఆధారపడే కుటుంబీకులు జీవనోపాధికి అల్లాడుతున్నారు. అదేవిధంగా ప్రజలు, పశుసంపద పూర్తిగా ప్ర మాదకరమైన చర్మ వ్యాధులబారిన పడుతుంది.  

ప్రమాదకరమైన రసాయనాలన్నీ భూగర్భంలోకే..
పరిశ్రమల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడుతున్నాయి. తమకు కాసులే ముఖ్యమనుకుని ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని గాలికి వదులుతున్నాయి. తమ పరిశ్రమల్లో వెలువడే ప్రమాదకరమైన వ్యర్థ రసాయనాలను ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో శుద్ధి చేయాల్సి ఉంది. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను తమతమ పరిశ్రమల్లోనే ఏర్పా టు చేసుకోవాలి. కానీ కొందరు ఏర్పాటు చేసుకోగా మరికొందరు మాత్రం ఇప్పటికీ ఆ ఆలో చనే చేయడంలేదు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లల్లో వ్యర్థాలను శుద్ధి చేస్తే భారీగా ఖర్చు అవుతుందని గ్ర హించిన పరిశ్రమల యాజమాన్యాలు తమ పరి శ్రమల ప్రాంగణాల్లో భూమిలోకి కొన్ని వేల ఫీట్ల లోతు వరకు బోర్లు వేస్తున్నారు. అనంతరం వ్య ర్థాలను ఆ బోరు గుంతల్లోకి వదులుతున్నారు. ఈ వ్యవహారం బయటకు తెలియకపోతుండడంతో వారికి ఖర్చులు తప్పడంతోపాటు బదనాం నుంచి మినహాయింపు పొందుతున్నారు. 

వ్యర్థాల తరలింపు మాఫియా ఏజెంట్లు స్థానికులే..
ప్రతి సందర్భంలోనూ కంపెనీల్లోని బోర్లలోకి వ్యర్థాలను వదిలితే స్థానికంగా భూగర్భ జలాలన్నీ కలుషితమవుతాయి. దీంతో యాజమాన్యాలు తమ చేతులకు మట్టి అంటకుండానే పని ముగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా స్థానికంగా ఉన్న కొంతమందిని ఏజెంట్లుగా నియమించుకొని వారి ద్వారా ట్యాంకర్లతో వ్యర్థాలను బయటకు తరలిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు 80వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఇలా పరిశ్రమ సామర్థ్యం మేరకు ప్రతి నెలలో 3–5ట్యాంకర్ల వ్యర్థాలు వెలువడనున్నాయి. వ్యర్థాలను తరలించేందుకు నియమితులైన స్థానికులు లక్షల రూపాయలు ఆర్జిస్తూ రసాయన పరిశ్రమలకు వత్తాసు పలుకుతుంటారు.  ప్రమాదకరమైన వ్యర్థాలను ట్యాంకర్లతో రాత్రి వేళల్లోనే బయటకు తీసుకువచ్చి నీటి కాలువల్లో లేదంటే నిర్మాణుష్యమైన ప్రాంతాల్లో పారబోస్తున్నారు. వ్యర్ధాలు తరలించే వ్యక్తులు పెద్ద మాఫియాగా మారారు. 

ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు 
రసాయన పరిశ్రమల దుర్మార్గాలపై స్థానికులు, రైతులు ఇప్పటికే అనేక రకాలుగా ఫిర్యాదులు చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులందరికీ ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. ఫిర్యాదులు వచ్చిన సమయంలోనే కొద్దిపాటి హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత మాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత కలిగిన అన్ని శాఖల అధికారులకు సంబంధిత పరిశ్రమల నుంచి ఏదో ఒక రూపంలో మామూళ్లు అందుతాయి. అందుకే వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు తోడుగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు సైతం కంపనీల మామూళ్లకు అలవాటు  పడి గ్రామాలను నాశనం చేసేందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బడా కంపెనీల జోలికే వెళ్లడం లేదు
మండలంలో రసాయన పరి శ్రమల మూలంగా వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. పరి శ్రమల కాలుష్యంపై సంబం ధిత అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకర పరిశ్రమలను విడిచిపెట్టి చిన్న చిన్న కంపెనీలపై అధికారులు దాడులు చేస్తున్నారు. కాలుష్య కంపెనీలపై ఇటీవల మెంబర్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేశాం. కాలుష్య నియంత్రణ అధికారులు కంపెనీల మత్తులో తరిస్తున్నారు.
– పీఎల్‌ఎన్‌రావు, పర్యావరణ సామాజిక కార్యకర్త, లింగోజిగూడెం 

కఠిన చర్యలు తీసుకుంటాం
పరిశ్రమల వ్యర్థ రసాయనాలు ఇష్టానుసారంగా పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి వేళల్లో వ్యర్థ రసాయనాల సరఫరాపై నిఘా ఉంచాం. సిమెంట్‌ పరిశ్రమల పేరిట తీసుకెళ్తున్నారు. ఎంతో ప్రమాదకరమైన వ్యర్థాల పారబోతను సహించబోం. 
– వెంకటేశ్వర్లు, సీఐ   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top