హుస్నాబాద్‌లో హోరా హోరీ

Hora Hori in Hussnabad Election Campaign - Sakshi

హుస్నాబాద్‌లో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

గెలుపు మాదంటే మాదంటున్న అభ్యర్థులు

హుస్నాబాద్‌: మెట్ట ప్రాంతంగా పేరొందిన హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ రెండవ సారి విజయం సాధించాలన్న లక్ష్యంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. నాలుగేళ్లలో రూ. 5 వేల కోట్లతో చేసిన అభివృద్ధే తనను గట్టెక్కిస్తుందన్న ధీమాతో ఉన్నారు. మహా కూటమిలో కొరవడిన ఐక్యత కలిసివస్తుందన్న భావనతో ఉన్నారు. మరో సారి గెలిపిస్తే అభివృద్ధి పనులను పూర్తి చేసి నియోజకవర్గానికి కొత్త రూపు తెస్తానని ఓటర్ల ముందుకు వెళ్తున్నారు.

మహాకూటమి తరపున సీపీఐ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, గతంలో తాను చేసిన అభివృద్ధినే ప్రచారాస్త్రలుగా మలుచుకుంటున్నారు. కూటమిలోని అన్ని పార్టీల మద్దతుతో తన విజయం ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి చాడా శ్రీనివాస్‌రెడ్డి, శివసేన నుంచి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, బీఎస్పీ టికెట్‌ దక్కించుకున్న నారోజు కోటేశ్వరచారి సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎవరికి వారు తమ గెలపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనులు
గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టు నిర్మాణాలకు రూ.2000 కోట్లు మంజూరు

రూ. 650 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు

రూ. రూ.128 కోట్లతో పంచాయతీ రాజ్‌ పనులు 

ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారికి రూ.350 కోట్లు మంజూరు.

విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి రూ.72 కోట్లు 

శనిగరం ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.22.70 కోట్లు మంజూరు 

సింగరాయ ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.6కోట్లు .

హుస్నాబాద్‌ పట్టణంలోని మెన్‌రోడ్‌లో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు.

 పాలిటెక్నిక్‌ కళాశాల నిర్మాణం, నిర్మాణంలో 560 డబుల్‌ బెబ్రూం ఇళ్లు

బస్‌ డిపో, ఆస్పత్రి బైపాస్‌ డబుల్‌ రోడ్ల నిర్మాణాలు, 50 పడకల ఆస్పత్రి భవనం

ప్రధాన సమస్యలు...
గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో ఆలస్యం
స్థలాల కొరతతో సాగని సమీకృత భవన నిర్మాణాలు
నత్తనడకన డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు

చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ)
ప్రజా కూటమి తరుపున సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చాడ వెంకట్‌రెడ్డి స్వగ్రామం చిగురుమామిడి మండలం రేకొండ. సర్పంచ్‌గా. ఎంపీపీగా ప్రస్థానం ప్రారంభించారు. సీపీఐ పార్టీ జిల్లా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. 2004లో మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది సీపీఐ శాసనసభపక్ష నేతగా వ్యవహరించారు. 2009లో పోటీ చేసి ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి తరపున సీపీఐ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు.

చాడ శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ)
చాడ శ్రీనివాస్‌రెడ్డిది  నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం మల్లారం. 30 ఏళ్లుగా బీజేపీలో క్రీయాశీలకంగా పని చేస్తున్నారు. 2006 నుంచి 2010 వరకు పార్టీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా,  2014 నుంచి 2016 వరకు స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబ ర్‌గా పని చేశారు. ఆయన సతీమణి స్వాతిరెడ్డి గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌. మోదీ అభివృద్ధే తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తుందన్న ధీమాతో ఉన్నారు.

అయిలేని మల్లికార్జున్‌రెడ్డి(శివసేన)
మల్లిఖార్జున్‌రెడ్డి తొలుత సీపీఐలో క్రీయాశీలకంగా వ్యవహరించాడు. తండ్రి మోహన్‌రెడ్డి నక్సలైట్ల దాడిలో మృతి చెందగా ప్రభుత్వం మల్లికార్జున్‌రెడ్డికి కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం కల్పించింది. అనంతరం ఉద్యోగం మానేసి వివిధ పార్టీల్లో పని చేశారు. గత ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలపునకు కృషి చేశారు. కార్మిక సంఘాల నేతగా ఉన్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రొఫైల్‌

తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొడితెల సతీష్‌కుమార్‌ స్వగ్రామం హుజురాబాద్‌ మండలంలోని సింగాపూర్‌. విద్యార్హత ఎంటెక్‌(డిజైన్‌ ఇంజినీరింగ్‌). తండ్రి రాజ్యసభ సభ్యుడు కేప్టెన్‌ లక్ష్మీకాంతరావు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. సతీశ్‌కుమార్‌ 1995లో సింగాపూర్‌ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2005లో తుమ్మనపల్లి  సింగిల్‌ విండో చైర్మన్‌గా పని చేశారు. వరంగల్‌ అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు డైరెక్టర్‌గా పని చేశారు. మొదటి సారిగా 2014లో హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. కొన్నాళ్లు పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుత ఎన్నికల్లో హుస్నాబాద్‌ నుంచి రెండవ సారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

నారోజు కోటేశ్వరచారి(బీఎస్పీ)
నారోజు కోటేశ్వరచారి స్వగ్రామం కోహెడ మండలం చెంచల్‌చెర్వుపల్లి. 2006లో సర్పంచ్‌గా గెలిపొందాడు. గ్రామానికి నిర్మల్‌ పురస్కార్‌ అవార్డు రావడానికి కృషి చేశారు. అనంతరం బహుజన సమాజ్‌ పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ప్రస్తుతం హుస్నాబాద్‌  నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలుచున్నారు. బహుజన ఓట్లే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు.

2014 పోల్‌ గ్రాఫ్‌... 
వొడితెల సతీష్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌)  96,517ఓట్లు
అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి (కాంగ్రెస్‌)   62,248ఓట్లు
మెజార్టి 34,269 

2018 ఓట్‌ గ్రాఫ్‌..మొత్తం ఓటర్ల  సంఖ్య      2,22,429
మహిళా ఓటర్లు  1,11,692
పురుషులు   1,10,737
ఇతరులు     09
పోలింగ్‌ కేంద్రాలు   292                           

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top