జై మట్టి గణేశా

HMDA Focus Eco Friendly Ganesh Statue Distributing - Sakshi

గ్రేటర్‌లో 1.60 లక్షల మట్టిగణపతుల పంపిణీకి పీసీబీ శ్రీకారం..

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 40 వేల విగ్రహాల పంపిణీ..

ఈనెల 27 నుంచి పంపిణీకి సన్నాహాలు..

గణేష్‌ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాటు

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 26 ప్రత్యేక చెరువులు

నిమజ్జనం కోసం శుద్ధి

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌వ్యాప్తంగా మట్టిగణపతుల పంపిణీకి పీసీబీ,హెచ్‌ఎండీఏ విభాగాలు సన్నాహాలు చేస్తున్నాయి. సెప్టెంబరు 2న వినాయకచవితి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో..ఈనెల 27 నుంచి నగరంలోని ముఖ్యకూడళ్లు,కమ్యూనిటీహాళ్లు,జీహెచ్‌ఎంసీ జోనల్,డివిజన్‌ కార్యాలయాలు,పార్కులు,మార్కెట్లు,ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఈసారి 2 లక్షల మట్టిగణపతుల  పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోపీసీబీ ఆధ్వర్యంలో 1.60 లక్షలు...హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సుమారు 40 వేల విగ్రహాలను పంపిణీచేయనున్నారు. గతేడాది కూడా ఈ రెండు విభాగాలు ఇదే సంఖ్యలో మట్టిగణపతులను పంపిణీచేయడం విశేషం. కాగా గతేడాది కూడళ్లలో ఏర్పాటుచేసే మంటపాల్లో పూజించుకునేందుకు వీలుగా ఐదు,ఆరు,ఏడు,ఎనిమిది అడుగుల గణపతి విగ్రహాలను పంపిణీ చేసినప్పటికీ..వాటిని రవాణా చేసే సమయంలో విగ్రహాలు ముక్కలుగా విరిగిపోతున్నాయన్న కారణంతో ఈ సారి కేవలం ఇళ్లలో పూజలందుకునేలా ఎనిమిది అంగుళాల గణపతులను మాత్రమే పంపిణీ చేయనుండడం విశేషం.

మట్టి గణపతులే పర్యావరణ హితం..
రంగులు,రసాయనాలు లేని మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే ప్రతిష్టించి.. నిమజ్జనం చేయాలి. వీటి పరిమాణం
సైతం చిన్నవిగానే ఉండాలి.
ఆయా జలాశయాల్లో నిమజ్జనం చేసే వినాయక విగ్రహాల సంఖ్యను ఏటేటా తగ్గించా లి. ఎక్కడి విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసేలా ఆయా విభాగాలు చర్యలు
తీసుకోవాలి.
నగరంలో మంచినీటి చెరువులు, బావుల్లో విగ్రహాల నిమజ్జనం చేయరాదు.
వినాయక విగ్రహాలతోపాటు జలాశయాల్లోకి పూవులు,కొబ్బరి కాయలు,నూనె,
వస్త్రాలు,పండ్లు,ధాన్యం,పాలిథీన్‌ కవర్లను పడవేయరాదు.
నిమజ్జనం జరిగిన గంటలోపే వ్యర్థాలను తొలగించాలి.
పర్యావరణంలో త్వరగా కలిసిపోయే పదార్థాలనే విగ్రహాల తయారీలో వాడాలి.
పీఓపి(ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీస్‌)తో తయారు చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితిలో నిమజ్జనం చేయరాదు. వాటిని జలాశయం వద్దకు తీసుకొచ్చి కొంత నీరు చల్లాలి.వచ్చే ఏడాది వీటిని వినియోగించేలా ప్రోత్సహించాలి.
జలాశయాల్లో వ్యర్థాలు పోగుపడడంతో దోమలు వృద్ధిచెంది.. మలేరియా,డెంగీ వ్యాధులు విజృంభిస్తాయి.
జలాశయంలో వృక్ష,జంతు జాతులు,నీరు,మృతిక, గాలి,పర్యావరణం దెబ్బతినకుండా అన్ని వర్గాల్లో అవగాహన పెంచాలి.

పర్యావరణ హననం ఇలా..
మట్టివిగ్రహాలకు బదులుగా ప్లాస్టర్‌ఆఫ్‌ ప్యారిస్‌ ఇతర హానికారక రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జనం చేసినపుడు వాటిలో హానికారక రసాయనాలు నీటిలో చేరుతున్నాయి. ముఖ్యంగా లెడ్‌ సల్ఫేట్, చైనా క్లే,సిలికా,జింక్‌ ఆక్సైడ్, రెడ్‌ ఐరన్‌ ఆౖMð్సడ్, రెడ్‌ లెడ్, క్రోమ్‌ గ్రీన్,పైన్‌ ఆయిల్,లిన్సీడ్‌ ఆయిల్, లెడ్‌ అసిటేట్, వైట్‌ స్పిరిట్,టర్పీన్,ఆల్కహాల్, కోబాల్ట్‌ తదితరాలు ప్రమాదకరమవుతున్నాయి.

పీఓపీ విగ్రహాల నిమజ్జనంతో తలెత్తే అనర్థాలివే..
ఆయా జలాశయాల్లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు,పక్షులు,వృక్ష,జంతు అనుఘటకాలమనుగడ ప్రశ్నార్థకమౌతుంది.
పర్యావరణం దెబ్బతింటుంది.
సమీప ప్రాంతాల్లో గాలి,నీరు కలుషిత మౌతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది.
ఆయా జలాశయాల్లో  పట్టిన చేపలను పలువురు మత్స్యకారులు నగరంలోని వివిధ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి తిన్న వారికి
శరీరంలోకి హానికారక మూలకాలు చేరుతున్నాయి.
చేపల ద్వారా మానవ శరీరంలోకి మెర్క్యురీ మూలకం చేరితే మెదడులో సున్నితమైన కణాలు దెబ్బతింటాయి.
మలేరియా,డెంగీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా
మారతాయి.
నగరంలో జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. జలాల్లో అరుదుగా పెరిగే వృక్షజాతులు అంతర్థానమౌతాయి.
ఆర్సినిక్, లెడ్, మెర్క్యురీ మూలకాలు  పరిశోధనాసంస్థలు సూచించిన పరిమితులను మించి ఉండడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top