అంతా మీ ఇష్టమేనా?

High Court Slams TS Govt On Recruitment Of Artists Without Notification - Sakshi

నోటిఫికేషన్‌ లేకుండానే 550 మందిని నియమించడంపై హైకోర్టు ఆగ్రహం 

కళాకారుల నియామకానికి 3 వారాల్లో నోటిఫికేషన్‌ ఇవ్వండి 

ఎంపిక ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్టకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 550 మందిని కళాకారులుగా ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఇష్టమొచ్చిన వారిని ఇష్టమొచ్చినట్లు నియమించుకుంటామంటే కుదరదని, ఇలా చేయడం ద్వారా అర్హులు బయట, అనర్హులు లోపల ఉంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇందుకు రాజ్యాంగం అనుమతించదని, ఏ నియామకానికైనా ఓ పద్ధతి ఉంటుందని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ‘నియామకానికి ప్రకటన ఇవ్వాలి.

అర్హుల నుంచి అత్యుత్తమ ప్రతిభ ఉన్న వారిని ఎంపిక చేయాలి. పోటీపడే తత్వాన్ని పెంచాలి. వివక్షకు తావు లేకుండా చూడాలి. అంతే తప్ప నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చేస్తామంటే ఎంత మాత్రం అంగీకరించేది లేదు. వారికి ప్రజాధనం నుంచి జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోకూడదు’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సాంస్కృతిక శాఖలో కళాకారుల అవసరం ఉందనుకుంటే, అందుకు అర్హులను ఎంపిక చేసేందుకు మూడు వారాల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతిభావంతులైన వారిని కళాకారులుగా నియమించాలని, ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలంది.

నోటిఫికేషన్‌కు అనుగుణంగా ప్రస్తుతం కళాకారులుగా నియమితులైన 550 మంది కూడా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ 550 మంది కళాకారులను కొనసాగించవచ్చని సూచించింది. మంగళవారం ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

అందుకు పాటలు పాడాలా! 
కళాకారులుగా 550 మందిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూర్‌ గ్రామానికి చెందిన జె.రమేశ్, మరో ఇద్దరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. 550 మందిని ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే ప్రభుత్వ సర్వీసులోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు సమాధానమిస్తూ, ఆయా సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కళాకారులు వలంటీర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు.

‘ఎలాంటి సమస్యలు’అని ధర్మాసనం ప్రశ్నించగా.. బయో డీగ్రేడబుల్‌ (సులభంగా భూమిలో కలిసిపోయేవి) ఉత్పత్తుల గురించి ప్రజలకు పాటల రూపంలో ఈ కళాకారులు అవగాహన కల్పిస్తారని ఏఏజీ ఉదాహరణ కింద చెప్పారు. ప్రభుత్వ పథకాల గురించి కూడా ప్రజలకు వివరిస్తారన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ‘పిల్లలకు జోల పాటలు పాడతారు. బయో డీగ్రేడబుల్‌ ఉత్పత్తుల గురించి పెద్దలకు చెప్పేందుకు పాటలు పాడాలా? నేరుగా చెబితే సరిపోదా?’అంటూ ప్రశ్నించింది. 

పారదర్శకతకు పాతర వేయడమే 
నియామక ప్రక్రియ లేకుండా వ్యక్తులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడమంటే పారదర్శకతకు పాతర వేయడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పారదర్శకత లేదంటే దానర్థం అనర్హులు లోపల, అర్హులు బయట ఉన్నట్లేనని వ్యాఖ్యానించింది. ఇష్టమొచ్చిన వారిని ఇష్టమొచ్చిన రీతిలో నియమించుకుంటామంటే రాజ్యాంగం అంగీకరించదని గుర్తు చేసింది. అసలు ఈ 550 మంది కళాకారులకు జీతాలు ఎలా చెల్లిస్తున్నారంటూ ధర్మాసనం ఆరా తీసింది. పలు సందేహాలను నివృత్తి చేసుకున్న ధర్మాసనం, ఈ 550 మంది కళాకారుల నియామకం విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుపట్టింది. నియామకాలకు ఎంపిక విధానం ఉండి తీరాలని స్పష్టం చేసింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top