అసెంబ్లీ భవనాల్ని ఖాళీ చేయాలని ఆర్‌ అండ్‌ బీ చెప్పిందా? 

High Court On R And B Report Over Assembly Building - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ భవనాలు వినియోగానికి యోగ్యంగా లేవని ఆర్‌అండ్‌బీ శాఖ ఇచ్చిన నివేదిక గురించి స్వయంగా వివరించేందుకు ఆ శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి శుక్రవారం జరిగే విచారణకు హాజరుకావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆర్‌ఆండ్‌బీ నివేదిక ఇచ్చి ఉంటే.. అసెంబ్లీ భవనాలు ఎంతకాలం వినియోగానికి యోగ్యంగా ఉన్నాయి, భవనం ఖాళీ చేయాలని నివేదికలో ఉందా, కొత్త అసెంబ్లీ నిర్మాణానికి ఎంత స్థలం కావాలి, నిర్మాణ ప్రణాళిక వంటివి వివరించేందుకు ఆయన స్వయంగా హాజరుకావాలంది. ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చి రాష్ట్ర చట్టసభల భవన సముదాయాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం ఎదుట గురువారం వాదనలు జరిగాయి.  

ఏ నిబంధనల మేరకు ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలను వినియోగించరాదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేబినెట్‌ ఎజెండాలోని అంశాలు తెలియజేయాలని పేర్కొంది. ఇప్పుడున్న అసెంబ్లీ భవనాలు నిజాం కాలంలో నిర్మించినవని, టౌన్‌హాల్‌ నిమిత్తం నిర్మించిన వాటిలో అసెంబ్లీ కొనసాగుతోందని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదించారు. ఆర్‌అండ్‌బీ అధ్యయనంలో అసెంబ్లీ భవనాలు సురక్షితంగా లేవని తేలిందన్నారు. ‘పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదా’అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానం ఇస్తూ ‘ఇప్పటికే పలుమార్లు మరమ్మతులు చేయడం జరిగింది, అదే మాదిరిగా కొనసాగించడం క్షేమదాయకం కాదు’అని అన్నారు. ఎర్రమంజిల్‌ పురాతన భవనాల జాబితాలో లేదని, అక్కడ శాసనసభ భవనాల సముదాయాన్ని నిర్మించాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయం కాబట్టి న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని గట్టిగా చెప్పారు. విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదంటూ సుప్రీంకోర్టుతో పాటు, రాజస్తాన్‌ హైకోర్టు తీర్పులను ఆయన ఉదహరించగా, ఇలాంటి తీర్పును ఉదహరించి మంచిపని చేస్తున్నారని అదనపు ఏజీని ధర్మాసనం అభినందించింది.  

అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్‌ లేకుండా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకోలేమని అదనపు ఏజీ చెప్పగానే.. ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంజనీర్‌ దగ్గరకు వెళ్లి ఫలానా సౌకర్యాలు ఉండేలా ప్లాన్‌ వేయించుకుంటారని, ఇక్కడేమో ప్లానే లేదని ప్రభుత్వం చెబుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై అదనపు ఏజీ కల్పించుకుని.. ప్లాన్‌ రూపొందించాలని హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాలకు చెందిన కన్సల్టెన్సీలకు బాధ్యతలు ఇచ్చామని, దీనిపై ప్రభుత్వానికి కూడా సమాచారం లేదన్నారు. ఎన్ని ఎకరాల భూమి అవసరమని నిర్ణయించారనే ప్రశ్నకు.. 17 ఎకరాల్లో నిర్మించాలని యోచిస్తున్నామని, ఇప్పుడున్న చట్టసభ సభ్యుల సంఖ్య మరో పాతికేళ్లకు రెట్టింపు కావచ్చునని, అప్పటి అవసరాలకు అను గుణంగా, పార్కింగ్, అధికారిక సమావేశాలకు వీలుగా కొత్త చట్టసభల సముదాయాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ విధానమని అదనపు ఏజీ బదులిచ్చారు. కన్సల్టెన్సీల నుంచి ప్లాన్‌లు వచ్చాక వాటి లో ప్రభుత్వం ఆమోదించే దాని ఆధారంగా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పా రు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top