చట్టవిరుద్ధంగా ప్రకటించలేం.. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు 

High Court Over TSRTC Strike In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించలేమని, అది తమ పరిధిలోని వ్యవహారం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం పరిధిలోకి ఆర్టీసీ రాదని స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రజోపయోగ సర్వీసుల పరిధిలోకి వస్తుందని, ఒకవేళ ఎస్మా కింద చర్యలు తీసుకోవా లంటే ఆర్టీసీని అత్యవసర సేవల పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుందని తెలిపింది. సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని పలుమార్లు ప్రభు త్వం, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలను కోరామని, ఏ ఒక్కరూ పంతాన్ని వీడి సమస్య పరిష్కారానికి మెట్టు దిగరావడానికి ఇష్టపడనప్పుడు తాము చేయగలిగిందేమీ లేదంది. చర్చల అంశం ముగిసిందని, దానిపై ఇక చర్చ అవసరం లేదని పేర్కొంది. చర్చలు జరపాలంటూ ఇకపై తాము ఎవరినీ కోరబోమని, ఈ వ్యవహారాన్ని చట్ట పరిధిలోనే తేలుస్తామంటూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అఫిడవిట్‌ వేయాలని సీఎస్‌కు చెప్పలేదు
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై ధర్మాసనం సోమవారం విచారణ కొనసాగించింది. కార్మిక సంఘాల తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. ఆర్టీసీ అంశంపై సీఎస్‌ అఫిడవిట్‌ దాఖలు చేయడంతోపాటు కార్మిక సంఘాలతో చర్చలు జరిపినా ప్రయోజనం ఉండదన్నారని చెప్పారు. దర్మాసనం స్పందిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని తాము సీఎస్‌కు చెప్ప లేదంది. ప్రకాశ్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ చర్చలకు కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయని, చర్చలు జరిపేలా ఆదేశాలివ్వాలన్నారు. దీనిపై ధర్మాసనం కాస్త ఘాటుగా స్పందించింది.

సమ్మె చేసే హక్కు ఉంది.. 
‘‘చర్చల విషయంలో ఎవరూ మంకుపట్టు వీడలేదు. ఇలాంటి విషయాల్లో పంతం వీడి ఓ మెట్టు దిగిరావాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇక చర్చల విషయం మాకు అనవసరం. ఈ వ్యవహారంపై ఇక చట్టపరంగానే విచారణ జరుపుతాం’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించే అధికారం హైకోర్టుకుం దా? లేక లేబర్‌ కోర్టుకుందా? చెప్పాలని ప్రకాశ్‌రెడ్డిని కోరింది. చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందో లేదో కూడా చెప్పాలంది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కృష్ణయ్య జోక్యం చేసుకుంటూ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అది తమ పరిధిలోని వ్యవహారం కాదంది.

‘‘రాజీ (కన్సీలియేషన్‌) విఫలమైనప్పుడు సంబంధిత అధికారి ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదికను లేబర్‌ కోర్టుకు పం పాలా వద్దా? అన్నది ప్రభుత్వమే తేల్చుకోవాలి. లేదంటే ఆ నివేదికను లేబర్‌ కోర్టుకు పంపాలని ఆర్టీసీ హైకోర్టును కోరవచ్చు. ఆర్టీసీ యాజమా న్యం అలా కోరలేదు. అలాంటప్పుడు మేం ఆదేశాలు ఎలా ఇవ్వగలం? యంత్రాలు వెళ్లలేని చోటుకు మూర్ఖులే వెళతారు. మేం అలా వెళ్లదలచుకోలేదు. రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తాం. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఉద్వేగాలు, సానుభూతి ఆధారంగా కేసులను తేల్చడం సాధ్యం కాదు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇకపై చట్ట పరిధిలోనే తేలుస్తాం’’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రజోపయోగ సేవల కిందకే...
పిటిషనర్‌ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ అత్యవసర సేవల విభాగంలో ఉన్న వారు సమ్మెకు వెళ్లరాదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిందన్నారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆర్టీసీ అత్యవసర సేవల పరిధిలోకి లేదని, కేవలం ప్రజోపయోగ సేవల పరిధిలో ఉందని గుర్తుచేసింది. పారిశ్రామిక వివాదాల చట్ట నిబంధనల ప్రకారం రాజీ ప్రయత్నాలు జరుగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని, ఇది చట్ట విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈ విషయంలో సహకరించాలని కోర్టులో ఉన్న సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ను కోరింది. ఇందుకు ఆయన స్పందిస్తూ పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్‌ 24 కింద సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించవచ్చునన్నారు. ఆర్టీసీ యాజమా న్యం కోరితే కన్సీలియేషన్‌ అధికారి చట్ట నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవచ్చన్నారు. కాగా, 5,100 రూట్ల ప్రైవేటీకరణ కేబినెట్‌ నిర్ణయంపై గత వారం ఇచ్చిన స్టే ఉత్తర్వులను హైకోర్టు పొడిగిస్తూ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top