మురికివాడల్లోని విద్యాసంస్థల్లోనూ కోవిడ్‌పై అవగాహన

High Court Directs Telangana Government Over Coronavirus - Sakshi

కరోనాపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

శానిటైజర్లు, మాస్క్‌ల ధరల్ని నియంత్రించాలి

వివిధ బృందాల పనితీరును అఫిడవిట్‌లో వివరించాలి

ప్రభుత్వ చర్యలు భేష్‌.. అయినా అప్రమత్తంగా ఉండాలి

పిల్‌ విచారణ 24వ తేదీకి వాయిదా వేసిన కోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: మురికివాడల్లోని విద్యాసంస్థల్లో కోవిడ్‌ (కరోనా) గురించి పేద పిల్లలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మురికివాడల్లో కరోనాపై అవగాహన, నివారణ గురించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమేనని, అయితే ఆ ప్రాంతాల్లోని పాఠశాలలు, కాలేజీల్లో కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆదేశించింది. ఐసోలేషన్‌ (ప్రత్యేక వార్డులు) వార్డుల నిర్వహణ బృందం, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు పర్యవేక్షించే బృందం, అంబులెన్స్, ఇతర వైద్య రవాణా పర్యవేక్షణ బృందం, మందుల పర్యవేక్షణ టీం, కరోనాపై అవగాహన కల్పించే బృందాలను ఏర్పాటు చేశారో లేదో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటు చేసుంటే వాటి పని విభజన, విధులు, బాధ్యతలను నిర్ణయించి ఆమేరకు జరుగుతున్నదీ లేనిదీ పూర్తి వివరాలతో ఈ నెల 23వ తేదీ నాటికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

శానిటైజర్లు, మాస్క్‌ల ధరలకు పెరగడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు కారణమైన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలంది. అలాగే సమంజసమైన ధరలకు వాటిని విక్రయించేలా డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి వ్యాధులపై గతంలో దాఖలైన రెండు వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలను గురువారం మరోసారి విచారణ సందర్భంగా కరోనా వైరస్‌ గురించి కూడా ప్రత్యేకంగా విచారించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 44 కరోనా కేసులు ఉన్నట్లుగా చెబుతోందని, అయితే నేటి దినపత్రికల్లో 61 కేసులున్నట్లుగా వార్తలు వచ్చాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రోజుకు 500 పరీక్షలు.. 
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను 5 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయన్నారు. శుక్రవారం నుంచి ఉస్మానియా ఆస్పత్రి, ఈ నెల 20 నుంచి ఫీవర్‌ ఆస్పత్రి, వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రుల్లోని మొత్తం 5 సెంటర్లలో పరీక్షల నిర్వహణ మొదలవుతుందన్నారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో ఒకరోజుకు (24 గంటలు) వంద రక్త నమూనాల పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉంటుందన్నారు. 500 నమూనాలను పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు జరిగిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్‌ ఉన్నాయో, ఎంతమంది అనుమానితులు వైద్య పరీక్షలు చేయించుకు న్నారో వంటి వివరాలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మహిళా ఆరోగ్య సమితి, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కరోనాపై ప్రజలకు ముఖ్యంగా మురికివాడల ప్రజల కు అవగాహన కల్పిస్తున్న చర్యలు బాగున్నాయంది. చేతుల్ని శుభ్రం చేసుకునేందుకు వినియోగించే (శానిటైజర్‌) క్రీమ్స్, వైరస్‌ వ్యాప్తిని నివారించే మాస్క్‌ల ధరల్ని ఇష్టానుసారంగా పెంచేశారని, వీటిని అత్యవసర నిత్యావసర వస్తువులుగా పరిగణించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

బీదర్‌ వ్యక్తి తిరిగి వెళ్లాక మరణించాడు.. 
రాష్ట్రంలో ఒక్క కేసు మాత్రమే నమోదైందని, బీదర్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఆ వైరస్‌ లక్షణాలు ఉన్నాయని, అయితే ఆ వ్యక్తి తిరిగి బీదర్‌ వెళ్లిపోయాక అక్కడే మరణించాడని ఏజీ వివరించారు. కోర్టుకు సహాయకారిగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన వివిధ కమిటీలను జిల్లా స్థాయిల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. కరోనా సమస్యను ప్రకృతి విపత్తుల నివారణ అంశంగా చేయాలని కేంద్రం భావిస్తోందని తెలిపారు. విచారణకు హాజరైన ఇన్‌స్టిట్యూట్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్స్‌ (ఐపీఎం) డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ను ధర్మాసనం పిలిచి.. ఉష్ణోగ్రత అధికంగా ఉంటే కరోనా వైరస్‌ పరిస్థితి ఏమిటో చెప్పాలని తమ సందేహాన్ని అడిగింది. 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా వైరస్‌ బతకదని శంకర్‌ జవాబు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 35 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రోజుకు 500 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేసే ఏర్పాట్లు జరిగాయని శంకర్‌ వివరించారు. కరోనా అంటువ్యాధి కాకపోయినా తీవ్ర భయాందోళనల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ధర్మాసనం విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top