కౌంటర్‌ వేయడం కూడా రాదా?

High Court Comments On IAS Officers - Sakshi

ఐఏఎస్‌లపై ఘాటు వ్యాఖ్య చేసిన కోర్టు

మున్సి‘పోల్స్‌’కౌంటర్‌ పిటిషన్‌లో అరకొర వివరాలపై మండిపాటు 

పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌:  ‘కోర్టుకు కౌంటర్‌ పిటిషన్లలో ఏవిధంగా వివరాలు సమర్పించాలో ఐఏఎస్‌ అధికారులకు తెలియడం లేదా.. ఒకదానికొకటి అందికా పొందికా లేని అస్పష్ట సమాచారంతో కౌంటర్‌ వేస్తారా..’అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని నిర్మల్‌ జిల్లాకు చెందిన కె.అంజుకుమార్‌రెడ్డి, రిజర్వేషన్‌ కేటగిరీ ఓటర్ల గుర్తింపు చట్ట ప్రకారం జరగలేదంటూ మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఎస్‌.మల్లారెడ్డి వేరువేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ కేసులో ప్రభు త్వం దాఖలు చేసిన కౌంటర్‌లో వివరాలు అరకొరగా ఉండటంపై మండిపడింది.

కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు ఏయే అంశాల్ని ప్రాతిపదికగా తీసుకుని చేశారని ప్రశ్నిం చింది. ప్రజాభిప్రాయాల్ని సేకరించకుండా వివరాల్ని వెల్లడించకుండా కొత్తవాటిని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగం ఏముంటుందని నిలదీసింది. ఉదాహరణకు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఏర్పాటు చేసేస్తే అక్కడి ఓటర్లకు ఏ వార్డుల్లో ఉంటారో తెలియాలి కదా.. అని ప్రశ్నించింది. ‘రిజర్వేషన్‌ కేటగిరీ ఓటర్ల గుర్తింపునకు జూన్‌ 21న సర్వే మొదలు పెట్టి అదే నెల 30తో పూర్తి చేశామన్నారు.  దీనిని ఏవిధమైన చట్ట నిబంధనల ప్రకారం చేశారో వివరించలేదు. ఎన్నికలు జరగాల్సిన 123 మున్సిపాలిటీల్లోని వార్డుల సంఖ్యను జనాభాకు అనుగుణంగా  ఖరారు చేయ డానికి ఆర్డినెన్స్‌ 4ను తెచి్చనట్లుగా కౌంటర్‌ పిటిషన్‌లోని పేరా 15లో పేర్కొన్నప్పటికీ వాటి వివరాలేమీ లేవు.

వార్డుల విభజనపై డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో శిక్షణ ఇచ్చామన్నారేగానీ ఏతరహాలో శిక్షణ ఇచ్చారో వివరించలేదు. వార్డుల విభజనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.  అధికారులు ప్రజాప్రతినిధుల్ని ఎప్పుడు సంప్రదించారో స్పష్టత లేదు. పేరా 18లో జూలై 2న ప్రజల నుంచి 1373 అభ్యంతరాలు వస్తే అందులో 665 పరిష్కరించామని, మిగిలినవి చట్ట ప్రకారం చేయలేని వని చెప్పారేగానీ ఏవిధంగా పరిష్కరించారో, ఎలా తోసిపుచ్చారో కూడా చెప్పలేదు..’అని హైకోర్టు తప్పుపట్టింది. జూలై 3 నుంచి 5వ తేదీ వరకూ వరుసగా 313, 372, 521 చొప్పున అభ్యంతరాలు వస్తే అందులో 665 అభ్యంతరాలను ఒకే ఒక్క రోజులో ఎలా పరిష్కరించారో, 708 అభ్యంతరాలు చట్ట ప్రకారం లేవని రాత్రికి రాత్రే ఎలా తేల్చారో అంతుపట్టకుండా ఉందని,  నమ్మడానికి వీల్లేకుండా ఉందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  

అనుమానాలు బలపడేలా ఉన్నాయి... 
‘ఎన్నికల ప్రక్రియకు 109 రోజుల సమయం కావాలని సింగిల్‌ జడ్జి కోర్టులో ప్రభుత్వం చెప్పింది. వార్డులవిభజనకు  30 రోజులు సమయం పడుతుందని చెప్పిన పాలకులు ఎనిమిది రోజుల్లోనే ఎలా పూర్తి చేశారో అర్థం  కావడం లేదు.  తూతూమంత్రంగా చేశారనే అనుమానం వస్తోంది.  అభ్యంతరాలు, వాటిలో ప్రభుత్వం పరిష్కరించిన వాటిని పరిశీలిస్తే అనుమానాలు బలపడేలానే ఉన్నాయి. ఉదాహరణకు సూర్యాపేట మున్సిపాలిటీలో 79 వస్తే అందులో ఒక్కటంటే ఒక్కటే పరిష్కరించారు. ఆర్మూర్‌లో 20 అభ్యంతరాలు వస్తే అన్నింటినీ తోసిపుచ్చారు.

ఇదే విధంగా మహబూబ్‌నగర్‌లో 77కు 39, కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 109కి 59, మీర్‌పేటలో 39కి 38 అభ్యంతరాల్ని పరిష్కరించి మిగిలినవి తోసిపుచ్చారు. ఎందుకు అభ్యంతరాల్ని తోసిపుచ్చారో కారణాలు కూడా వివరించలేదు..’అని ధర్మాసనం తప్పుల్ని ఎత్తిచూపింది. వీటన్నింటిపైనా పూర్తి వివరాలతో 20వ తేదీనాటికి కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 21న జరుపుతామని ప్రకటించింది. తొలుత అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదిస్తూ.. 109 రోజుల సమయం అవసరమని సింగిల్‌ జడ్జి వద్ద చెప్పామని, అయితే అంతకంటే తక్కువ సమయంలో ముందస్తు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయలేమని చెప్పలేదన్నారు. అభ్యంతరాలన్నింటినీ చట్ట ప్రకారం పరిష్కరించామని చెప్పారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top