కోర్టును తప్పుదోవ పట్టించారు..

High Court anger against Mahabubabad forest officials - Sakshi

     మహబూబాబాద్‌ అటవీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం

     కోర్టు ధిక్కారం కింద జైలు, జరిమానా

సాక్షి, హైదరాబాద్‌: తప్పును కప్పిపుచ్చుకునేందుకు రికార్డులను తారుమారు చేయడమే కాకుండా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పేద రైతులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేసినందుకు అటవీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద మహబూబాబాద్‌ జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌ఓ) జి.కిష్టాగౌడ్, కొత్తగూడ అటవీ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసు, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సదానంద్‌లకు హైకోర్టు 2 వారాల జైలు శిక్ష విధించింది.

ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 2 వారాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. రికార్డులను తారుమారు చేసినందుకు, కోర్టుకు తప్పుడు సమాచారం (పర్జురీ) ఇచ్చినందుకు భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్లు 191, 193 కింద వారు శిక్షార్హులని, అందువల్ల వారిపై సంబంధిత జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కి ఫిర్యాదు చేయాలని హైకోర్టు రిజిష్ట్రార్‌ (జుడీషియల్‌)ను ఆదేశించింది. దీనికి సంబంధించి 4వారాల్లో నివేదికను హైకోర్టు ముందుంచాలని రిజిష్ట్రార్‌కు పేర్కొంది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి 2 రోజులక్రితం తీర్పు వెలువరించారు. వరంగల్, కొత్తగూడ రేంజ్, కంపార్ట్‌మెంట్‌ 851లో వజ్జా రాజబాబు, మరికొందరి స్వాధీనంలో ఉన్న భూముల్లో జోక్యంచేసుకోవద్దని అటవీ అధికారు లను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిం ది. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా అధికారులు రాజబాబు, మరికొందరికి చెందిన ట్రాక్టర్‌ను, జొన్న పంటను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఆ పొలాన్ని దున్నేశారు. దీనిపై రాజబాబు తదితరులు డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్‌ తదితరులపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ధిక్కార పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు అటవీ అధికారుల వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు రికార్డుల్లో మార్పులు చేశారు.

ఆ రికార్డులను పరిశీలించిన హైకోర్టు రికార్డుల్లో 851ని 850గా మార్చడంపై వివరణ కోరింది. ఇదిలా ఉండగానే అధికారులు మరోసారి రాజబాబు తదితరుల భూముల్లోకి వెళ్లి గుంటలు తవ్వి ఆ భూముల్లోకి రాకుండా వారిని అడ్డుకున్నారు. దీంతో వారు మరో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత తమపై అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంపై రాజబాబు తదితరులు మూడో ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి అటవీ అధికారుల తీరుపై మండిపడ్డారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top