సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్సే

Harish Rao Slams Congress on Water for Farming - Sakshi

పాలేరు పాతకాల్వ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పరిపాలించినంత కాలం సాగునీటి రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక అవాకులు.. చెవాకులు పేలుతోందని, ఆ పార్టీ హయాంలో జరిగిన జలయజ్ఞంలో 34 ప్రాజెక్టులు చేపట్టి ఒక్కటీ పూర్తి చేయలేకపోయిందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఆధునీకరించిన పాలేరు పాతకాల్వను సోమవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, రైతుల కోసం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడమే కాకుండా.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేశారని చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి  జిల్లాలకు ప్రయోజనం కలిగించే సీతారామ ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను అనుకున్న సమయంలో పూర్తిచేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు.

పాలేరుకు గోదావరి జలాలందించాం: మంత్రి తుమ్మల
రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ రైతులకు గోదావరి జలాలను అందించాలన్నదే తన జీవితాశయమని, ఇందుకు సీఎం కేసీఆర్‌ అందించిన సహకారం మరువలేనిదన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా తన కల సాకారం కానుందని చెప్పారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు, పాలెంవాగు ప్రాజెక్టు నిర్మాణాలు దశాబ్దాల తరబడి కొనసాగినా.. అప్పటి ప్రభుత్వాలకు పట్టలేదని, ఒక్కో చోట 10 వేల ఎకరాలకుపైగా నీరందించే ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో వాటిని పట్టుదలతో నిర్మించి రైతులకు అంకితం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్, ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తప్సీర్‌ ఇక్బాల్, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి తదితరులు పాల్గొన్నారు.

పచ్చని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
వెంకటాపురం (భద్రాచలం): తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని తెలంగాణగా మార్చడమే సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని మల్లాపురం వద్ద నిర్మించిన పాలెం వాగు ప్రాజెక్టును మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 10,332 ఎకరాలకు సాగునీరు, 20 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో రూ.221 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ  తెలంగాణలో దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం హయాంలోనే ఆదిలాబాద్‌ జిల్లాలోని గొల్లపాడు, మట్టెడువాగు, రెడ్డివాగు, ర్యాలీవాగు ప్రాజెక్టులు, ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని, పాలెం వాగులు, కరీంనగర్‌ జిల్లాలో మంథని ప్రాజెక్టు, మెదక్‌ జిల్లాలో సింగూరు ప్రాజెక్టు పూర్తిచేసి 70 వేల ఎకరాలకు సాగునీరిచ్చామని, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లతోపాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మగ్గడి అంజయ్య, నూగూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోదెబోయిన బుచ్చయ్య, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ ఆకునూరి మురళి, వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి, ఎస్పీ భాస్కరన్, ఓఎస్‌డీ పుప్పాల రవీందర్, ఏఎస్పీ రాహుల్‌హెగ్డే తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top