సమగ్రాభివృద్ధే ధ్యేయం

Harish Rao Comments About Siddipet Development - Sakshi

సిద్దిపేజోన్‌: సిద్దిపేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా అంకిత భావంతో పనిచేయాలని ఆ దిశగా ఆయా శాఖల నిర్దేశిత లక్ష్యాలను త్వరతగతిన అధిగమించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశించారు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు స్థానిక సుడా కార్యాలయంలో అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖ అధికారులతో ఆయా శాఖల పనితీరు, నియోజకవర్గ ప్రగతిపై సమీక్ష జరిపారు. ఎంబీసీలకు సంబంధించి రూ. 2.26కోట్ల రుణాలను పంపిణీ చేయాలని అందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలంటూ జిల్లా కార్పొరేషన్‌ ఈడీకి ఆదేశాలు జారీ చేశారు. ఒక దశలో బీసీ కార్పొరేషన్‌ రుణాలకు సంబంధించిన అంశంపై చర్చిస్తూ నియోజకవర్గంలో ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్యపై ఆరా తీశారు. దీనికి ఈడీ బదులిస్తూ సిద్దిపేటలో 440 మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొనగా వెంటనే పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, త్వరలోనే పంపిణీ చేద్దామని సూచించారు.

బడ్జెట్‌ వస్తే వెసులుబాటు ఉంటుందన్న కార్పొరేషన్‌న్‌ఈడీ వ్యాఖ్యల పట్ల హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అసలు కేటగిరీల వారీగా మీ వద్ద స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు. చేర్యాలలో ప్రస్తుతం కొనసాగుతున్న సిద్దిపేట ఎస్సీ మహిళ డిగ్రీ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం సిద్దిపేటలో కొనసాగేలా ప్రతిపాదనలు పంపి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సిద్దిపేటలో బాలికల, బాలుర సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌(ఎస్‌ఎంహెచ్‌) కావాలని ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయడం జరిగిందని వాటిపై దృష్టి సారించాలని ఈడీకి సూచించారు. అదే విధంగా సిద్దిపేటలో దోబీఘాట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆదర్శంగా తీర్చి దిద్దడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ పట్టణ అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా మెదక్‌ రహదారి విస్తరణ పనులు ఇంకా ఎన్ని రోజులు చేస్తారని ఆర్‌అండ్‌బీ ఈఈ, డీఈ అధికారులను ప్రశ్నిస్తూ సుతిమెత్తగా మందలించారు. పట్టణంలో ఫుట్‌పాత్, డివైడర్‌ నిర్మాణ పనులు, చేపట్టాల్సిన పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.

రోడ్డును ఆక్రమించి ముందుకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం పట్టణంలో అంతర్గత రోడ్ల నిర్మాణ ప్రక్రియ ప్రణాళిక గూర్చి సమీక్ష నిర్వహిస్తూ సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు వరకు 7 కిమీల పొడవున డివైడర్‌తో కూడిన నాలుగులైన్‌ల రహదారికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ రవీందర్‌రావుతో ఫోన్‌లో సమస్యను వివరించి త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని సూచించారు. అదే విధంగా సిద్దిపేట పాత బస్టాండ్‌ నుంచి మెదక్‌ రహదారి వరకు ఆరులైన్‌ల రోడ్డు నిర్మాణ పనుల గురించి ఆరాతీశారు. ముస్తాబాద్‌ సర్కిల్‌ నుండి గాడిచెర్లపల్లి మీదుగా ముస్తాబాద్‌ వెళ్లే వరకు రహదారి పనులకు సంబందించి చర్చించారు. అదే విదంగా నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న బీటీ, డబుల్‌ లైన్‌ రహదారుల నిర్మాణ పనులు, చేపట్టాల్సిన పనులు, రాజీవ్‌ రహదారికి అనుసంధానం లింక్‌ రోడ్లు, ఇతరత్రా అంశాల గురించి క్షుణ్ణంగా అధికారులతో ఆరా తీశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ «అధికారి శ్రవణ్, పీఆర్‌ఈఈ రాజశేఖర్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్‌ అధికారి సరోజనతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్‌లు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top