కాళేశ్వరం రిజర్వాయర్లకు గ్రీన్‌ సిగ్నల్‌

కాళేశ్వరం రిజర్వాయర్లకు గ్రీన్‌ సిగ్నల్‌ - Sakshi


► మొదటగా నాలుగు రిజర్వాయర్లకు టెండర్లు

► 22న నోటిఫికేషన్, 24 నుంచి టెండర్‌ దాఖలుకు అవకాశం




సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వా యర్ల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచేందుకు నీటిపారుదలశాఖ తేదీలను నిర్ణయించింది. తొలి దశలో ప్రాజెక్టు పరిధిలోని నాలుగు రిజర్వాయర్లకు రూ.3,379 కోట్లతో ఈ నెల 22న టెండర్లు పిలవ నుంది. ముఖ్యమైన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ టెండర్లను మాత్రం రెండో దశలో పిలిచేలా అధికారులు నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్లను రూ. 10,876 కోట్లతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే.


ఇందులో మల్లన్నసాగర్‌కు రూ. 7,249.52 కోట్లు, రంగనాయకసాగర్‌ రూ. 496.50 కోట్లు, కొండపోచమ్మ రూ. 519.70 కోట్లు, గంధమల రూ. 860.25 కోట్లు, బస్వాపూర్‌కు రూ. 1,751 కోట్ల మేర అనుమతులు వచ్చాయి. ఇందులో ఇటీవలే గంధమల, బస్వాపూర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్‌లకు సాంకేతిక అనుమతులు వచ్చాయి. ఒక్కో రిజర్వాయర్‌ను ఒక్కో ప్యాకేజీగా టెండర్లు పిలిచేలా అనుమతించారు. ప్రాజెక్టుల మొత్తం విలువలో సుంకాల ఖర్చులను తొలగించి ఎస్టిమేటెడ్‌ కాంట్రాక్ట్‌ వ్యాల్యూ (ఈసీవీ) ను నిర్ణయించారు.


దీని ప్రకారం రంగనాయకసాగర్‌ రూ. 463 కోట్లు, కొండపోచమ్మసాగర్‌ రూ. 486 కోట్లు, గంధమల రూ. 730 కోట్లు, బస్వాపూర్‌ రూ. 1,600 కోట్లుగా ఈసీవీ ఖరారైంది. ఈ విలువతోనే సోమవారం నాలుగు రిజర్వాయర్ల టెండర్లు పిలవనున్నారు. ఈ నెల 24 నుంచి కాంట్రాక్టు ఏజెన్సీలు టెండర్లు అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అయితే మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ల టెండర్లు మాత్రం మరో వారం తర్వాత పిలిచే అవకాశం ఉంది. ఈ పనులను ఎన్ని ప్యాకేజీలుగా పిలవాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. నాలుగు ప్యాకేజీలుగా అనుకున్నప్పటికీ మరో ప్యాకేజీ పెంచేలా కసరత్తు జరుగుతుండటంతో దాని టెండర్‌ను ఆపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top