సీపీఎస్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ..

Government will be given Gratuity to the CPS Employees

సీఎంకు ఫైలు పంపిన ఆర్థిక శాఖ

పాత పెన్షన్‌ పద్ధతికి మార్చడం అసాధ్యమని స్పష్టీకరణ

ఖజానాపై రూ. 40 వేల కోట్ల దాకా భారం పడుతుందని వెల్లడి

ఇచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)లో ఉన్న ఉద్యోగులకు గ్రాట్యు టీ ఇచ్చే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీ లిస్తోంది. సీపీఎస్‌ను రద్దు చేసి తమకు పాత పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేయాలని ఉద్యోగు లు, ఉపాధ్యాయులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. సెప్టెంబర్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేశారు. దీంతో సీపీఎస్‌ విధానం అమలు తీరు, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభు త్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీఎం  కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ.. డిమాండ్ల సాధ్యాసాధ్యాలు, ఆర్థికంగా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుం దన్న అంచనాలను తయారు చేసింది. ఇటీవలే ఈ ఫైల్‌ను సీఎంకు పంపినట్లు తెలిసింది. కొత్త పెన్షన్‌ విధానంలో ఉన్న ఉద్యోగులను పాత విధానంలోకి మార్చటం అసాధ్యమని ఆర్థిక శాఖ ఈ నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం.

కానీ గ్రాట్యుటీ చెల్లించే వెసులు బాటు ఉందంటూ సీఎంకు నివేదిక అందిం చింది. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం పరిశీలనలో ఉంది. సీఎం ఆమోదం పొందిన వెంటనే సీపీఎస్‌ ఉద్యోగులకు గ్రాట్యుటీ వర్తింపజేసే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. పాత పెన్షన్‌ విధా నంలో ఉన్న ఉద్యోగులకు ప్రస్తుతం గ్రాట్యుటీ చెల్లింపు అమల్లో ఉంది. పదవీ విరమణ చేసినప్పుడు లేదా చనిపోయిన సందర్భంలో గరిష్టంగా రూ.12 లక్షలకు మించకుండా గ్రాట్యుటీ చెల్లిస్తుంది. సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఈ గ్రాట్యుటీ అందటం లేదు. దీంతో తమకు భద్రత కరువైందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

రద్దు అసాధ్యమే..
సీపీఎస్‌ను రద్దు చేయటం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదని ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టంచేసింది. సీఎంకు పంపిం చిన ఫైలులోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిం చినట్లు తెలిసింది. ప్రస్తుతం రిటైరైన ఉద్యోగుల పెన్షన్లకు ఏడాదికి దాదాపు రూ.8,000 కోట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తోంది. కానీ సీపీఎస్‌ ఉద్యోగులను పాత విధానంలోకి మార్చాలనుకుంటే గుదిబండగా మారుతుం దని ఆర్థిక శాఖ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దాదాపు రూ.40 వేల కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది. అందుకే సీపీఎస్‌ రద్దు చేయటం అసాధ్యమనే వాదన ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది.

సీపీఎస్‌లో ఇలా..
సీపీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు ప్రతినెలా వారి జీతం నుంచి 10 శాతం సీపీఎస్‌ ఫండ్‌కు జమవుతుంది. అంతే మొత్తం ప్రభుత్వం తమ వాటాగా జమ చేస్తోంది. మ్యూచువల్‌ ఫండ్‌లో ఉన్న రిస్క్‌ మేరకే ఉద్యోగికి భవిష్యత్‌లో ఈ సొమ్ము చెల్లిస్తారు. కానీ.. పాత విధానంలో ఉద్యోగుల జీతం నుంచి ఒక్క రూపాయి కూడా కోత లేదు. పెన్షన్‌ చెల్లింపులకు ప్రభుత్వమే బాధ్యతగా ఉంటుంది. ఉద్యోగి మరణిస్తే కుటుంబీకుల భద్రతకు కూడా భరోసా ఉంటుంది. అందుకే పాత విధానంలో తమను చేర్చాలని సీపీఎస్‌ ఉద్యోగులు పట్టుబడుతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 1.20 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులున్నారు. 2004 సెప్టెంబర్‌ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరూ సీపీఎస్‌ పథకంలోనే ఉన్నారు. తెలంగాణలో సీపీఎస్‌ విధానంలో చేరిన ఉద్యోగుల్లో ఇప్పటికే వెయ్యి మందికిపైగా పదవీ విరమణ చేశారు. 262 మంది చనిపోయారు. పదవీ విరమణ చేసినవారికి పింఛన్‌ అందకపోగా.. చనిపోయిన కుటుంబాలకు కనీస ఆర్థిక సాయం కూడా దక్కలేదు. మరోవైపు సీపీఎస్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీని వర్తింపజేసింది. గతేడాది ఆగస్టులోనే ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లించే అవకాశాలను పరిశీలించాలని ఆ ఉత్తర్వుల్లో సూచించింది. కేంద్రం సూచన మేరకు ఇప్పటికే ఏపీ, హరియాణా రాష్ట్రాలు సీపీఎస్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీని వర్తింపజేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. లక్షకు పైగా ఉద్యోగులతో ముడిపడి ఉన్న అంశం కావటంతో గ్రాట్యుటీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. త్వరలోనే ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top