‘ఆస్తుల’ కేసుల్లో కొత్త విధానం! 

 government takes measures to ensure the scientific approach in ACB Attacks - Sakshi

శాస్త్రీయత పెంచేందుకు సర్కారు చర్యలు 

వ్యక్తిగత ఫిర్యాదుల కేసులపై ఆచితూచి విచారణ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులపై అనినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జరిపే దాడులకు సంబంధించి శాస్త్రీయ విధానం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఏసీబీ నమోదు చేసే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నిలబడటం లేదని గణాంకాలు రుజువు చేస్తుండటం, ఇలాంటి కేసుల విషయంలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో కేసుల్లో శాస్త్రీయత పెంచాలని భావిస్తోంది. దీనికి సంబంధించి కొత్త విధానాన్ని ఖరారు చేసేందుకు ఏసీబీ ఉన్న తాధికారులతో సీఎం కేసీఆర్‌ త్వరలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానంపై సాగునీటి శాఖ అధికారులతో శనివారం సీఎం సమీక్ష నిర్వహించినప్పుడు ఏసీబీ కేసుల విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సాగునీటి శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చెరువుల అభివృద్ధిపై సాగునీటి శాఖ రాష్ట్ర కార్యాల యంలోని అధికారి సీఈ సురేశ్‌ కుమార్‌ సమీక్షకు హాజరవలేదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఆయన అరెస్టయ్యారు. సురేశ్‌ గైర్హాజరుతో సమీక్షలో ఈ అంశంపై కొద్దిసేపు చర్చ జరిగింది.  

తేలేందుకు ఏళ్లు పడుతోంది.. 
ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే వారిని ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే ఆ కేసుల్లో ఇబ్బంది ఉండదని.. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల్లో శాస్త్రీయత ఉండట్లేదని అధికారులు సీఎంకు తెలిపా రు. ‘ఉద్యోగులు ఏటా ఆదాయం, ఖర్చుల వివరాల ను అధికారికంగా ప్రకటిస్తున్నారు. వాటిపై సందేహాలుంటే ఏసీబీ దృష్టి పెట్టవచ్చు. ఫిర్యాదుల ఆధారం గా కూడా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. మొదట సదరు అధికారి జైలుకు వెళ్లడం, అధికారి కుటుంబం సామాజికంగా ఇబ్బందిపడుతోంది. అంకితభావం తో పని చేసేవారి విషయంలో ఇలా జరిగితే ఇబ్బంది కలుగుతోంది. ఇలాంటి కేసులు ఎక్కువ శాతం నిలబడట్లేదు. ఆదాయానికి మించిన ఆస్తులా కాదా అనేది తేలేందుకు ఏళ్లు పడుతోంది. అవినీతి ఆస్తులు కాదని నిర్ధారణ జరిగినా సదరు ఉద్యోగులకు అప్పటికే నష్టం జరుగుతోంది.

ఈ విషయంలో శాస్త్రీయత ఉండాలి’ అని సీఎంకు తెలిపారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అధికారుల అభిప్రాయంతో ఏకీభవించారు. వ్యక్తిగత కారణాలతో వచ్చే ఫిర్యాదుల విషయంలో వ్యవహరించే తీరు కొన్ని సార్లు బాగుండటం లేదన్నారు. దాడులకు ముందే అన్ని వివరాలు సేకరిస్తే బాగుంటుందని, వ్యక్తిగత ఫిర్యాదుల కేసులపై ఆచితూచి విచారణ జరిపేలా చూడాలని సూచించారు. ఈ అంశాలతో సీఎం కూడా ఏకీభవించినట్లు తెలిసింది. దీనిపై ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావుతో సీఎం ఫోన్లో మాట్లాడారని, ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో ఉద్యోగులపై చేసే దాడుల్లో శాస్త్రీయత పెంచేందుకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై సమీక్ష నిర్వహించి కొత్త విధానం రూపొందించనున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top