కాలుష్యంపై కన్నేయరేం?

Government Negligence on Pollution Vehicles - Sakshi

కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలపై చర్యలు శూన్యం

తనిఖీ యంత్రాల వ్యాన్ల నిర్వహణలోనూ అనేక లోపాలు

ఆన్‌లైన్‌ చేయాలన్న ప్రతిపాదన  ఫైళ్లలోనే..

ఢిల్లీ, బెంగళూరుల్లో ఇప్పటికే అమలవుతున్న విధానం

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది... ఏ ఏటికాయేడు ప్రమాదఘంటికలు మోగిస్తోంది... సిటీలోని పొల్యూషన్‌లో వాహనాల వాటా గణనీయంగానే ఉంటుంది. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి తమ వంతుగా కఠిన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగాలు విఫలం అవుతున్నాయి. లోపభూయిష్టంగా ఉన్న కాలుష్య తనిఖీ యంత్రాలకు క్రమబద్దీకరించే ప్రతిపాదన ఏళ్లుగా అమలుకు నోచుకోలేదు. దీంతో పాటు చేతిలో ఇమిడిపోయే తనిఖీ యంత్రాల కొనుగోలుకు బ్రేక్‌ పడింది.

నానాటికీ భయంకరంగా...
నగరంలో కాలుష్యం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో విస్తరిస్తున్న కాలుష్యం డేంజర్‌ జోన్‌లోకి వెళ్ళింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలకు మించి పొల్యూషన్‌ లెవల్స్‌ నమోదవుతున్నాయి. దీంతో నగర వాసులు ఊపిరితిత్తులు ధూళి, దుమ్ము, ఇతర రసాయనాలతో నిడిపోయి అనారోగ్యం బారినపడుతున్నారు. ప్రత్యక్షంగా దీని ప్రభావానికి లోనవుతున్న వారి సంఖ్యకు ఎన్నోరెట్లు పరోక్షంగా ప్రభావితులవుతున్న వారు ఉంటున్నారు. ఈ కాలుష్యానికి నగరంలో సంచరిస్తున్న కాలం చెల్లిన వాహనాలు, కాలుష్యం వెదజల్లుతున్నా పట్టించుకోని యజమానులే కారణమని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసులకు కాలుష్య తనిఖీ యంత్రాల నిర్వాహకులు ఇస్తున్న సర్టిఫికెట్లే ప్రామాణికంగా ఉన్నాయి. 

ఉన్నవన్నీ లోపభూయిష్టం....
సిటీ రహదారులపై పొల్యూషన్‌ ఫ్రీ వాహనాలు మాత్రమే సంచరించాలనే నిబంధన ఏళ్ళుగా అమలులోనే ఉంది. దీని నిమిత్తమే వాహనాలు ఖరీదు చేసినప్పుడు ఏడాది తరవాత, ఆపై ప్రతి ఆరు నెలలకు కాలుష్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని అనేక పెట్రోల్‌ బంకులతో పాటు రహదారుల్లో అనేక చోట్ల కాలుష్య తనిఖీ వాహనాలు ‘సేవల్ని’ ప్రారంభించాయి. ఆర్టీఏ అప్రూవ్డ్‌ అని చెప్పుకుంటున్న వీటి నిర్వాహకులు చేస్తున్న పరీక్షలు, జారీ చేస్తున్న సర్టిఫికెట్లు లోపభూయిష్టంగా ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గతంలోనే గుర్తించారు. ప్రాథమికంగా వీటి లోపాలను సరిచేయడానికి ఆయా యంత్రాల నిర్వాహకులతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆర్టీఏ అధికారులతో సంయుక్తంగా దీన్ని నిర్వహించారు. కాలుష్య తనిఖీ సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాల్సిందిగా ఈ సమావేశంలో స్పష్టం చేశారు. అయినప్పటికీ ఒనగూరింది శూన్యమనే చెప్పాలి. 

ఆన్‌లైన్‌లోకి వెళ్తేనే ఉత్తమం...
నగర వ్యాప్తంగా అనేక పొల్యూషన్‌ చెకింగ్‌ యంత్రాలు ఉన్నాయి. అయితే వీటన్నింటి మధ్య ఎలాంటి అనుసంధానం ఉండదు. కేవలం వారు మాన్యువల్‌గా జారీ చేసే సర్టిఫికెట్లనే ప్రామాణికంగా తీసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వాటిని వాహనచోదకులు తయారు చేసినా గుర్తించే అవకాశం ఉండట్లేదు. వీటిని నిరోధించడానికి అన్ని కాలుష్య తనిఖీ యంత్రాలను అనుసంధానిస్తూ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని కొనాళ్ల క్రితమే నిర్ణయించారు. ఈ డేటా మొత్తం ఆర్టీఏ సర్వర్‌లో అందుబాటులోకి తీసుకువస్తే ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీలు సులభసాధ్యమవుతాయని భావించారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్‌ పోలీసులు ఈ–చలాన్ల జారీకి ప్రస్తుతం వాహనచోదకుల చిరునామాలు సేకరిస్తున్నట్లే కాలుష్య తనిఖీ యంత్రాలు జారీ చేసిన సర్టిఫికెట్లనూ ఆన్‌లైన్‌లో సరిచూసే ఆస్కారం ఉంటుందని భావించారు. అయితే ఇప్పటికీ ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరుల్లో ఈ విధానం అమలులోకి వచ్చి ఫలితాలు ఇస్తున్నా... సిటీలో మాత్రం పెండింగ్‌లో ఉండిపోయింది. 

డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ మాదిరిగా చేయాలి:  
నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఏ విధంగా డ్రంక్‌ డ్రైవింగ్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను చేపడుతున్నారో... అదే స్థాయిలో కాలుష్య వాహనాల పైనా చేపట్టాలి. లేదంటే భవిష్యత్తు తరాలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ ట్రాఫిక్‌ అధికారి పేర్కొన్నారు. దీనికి ముందు అందరిలోనూ అవగాహన కల్పించడానికి భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.  ట్రాఫిక్‌ పోలీసులు సమీకరించుకునే చేతిలో ఇమిడిపోయే కాలుష్య తనిఖీ యంత్రాలు కంట్రోల్‌ రూమ్‌లోని సర్వర్‌తో అనుసంధానించి ఉండాని,దీంతో ఎప్పటికప్పుడు ఉల్లంఘనలు రికార్డు అవుతాయన్నారు. ఏదైనా వాహనం మూడుసార్లు కాలుష్య రహిత వాహనమనే∙సర్టిఫికెట్‌ లేకుండా చిక్కానా, నిర్ణీత పరిమాణానికి మించి కాలుష్యాన్ని వెదజల్లుతూ పట్టుబడినా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునేలా చర్యలు ఉండాలి అని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top