రైతు సంక్షేమాన్ని విస్మరించిన సర్కార్


సంగారెడ్డి క్రైం:  రైతు సమస్యల పరిష్కారంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఆయన మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ జిల్లా పరిస్థితులను వైఎస్ జగన్‌కు వివరించారు. ముఖ్యంగా రైతు సమస్యలు, ఆత్మహత్యల నివారణ, విద్యుత్ సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు తదితర విషయాల గురించి ఆయన జగన్మోహన్‌రెడ్డికి వివరించారు.  రైతులకు సంబంధించి రుణమాఫీ సరిగా అమలు కాక జిల్లాలో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వ్యవసాయ రంగానికి కరెంట్ కోత విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో కరెంట్ సమస్య ఉన్నందున ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయ రంగానికి 8 గంటల పాటు నిరంతరంగా విద్యుత్‌సరఫరా చేసేలా ప్రభుత్వంపై జగన్మోహన్‌రెడ్డి ఒత్తిడి తేవాలని కోరారు. అలాగే జిల్లాలో పాము కాటు బారిన పడి అనేక మంది రైతులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పాము కాటు మందును అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని తాము పలుమార్లు ఉన్నతాధికారులను కోరామని చెప్పారు.  రైతుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవిరళ కృషి చేశారని ప్రభుగౌడ్ కొనియాడారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నర్ర భిక్షపతి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యద ర్శి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

 

పేద విద్యార్థుల చదువును అడ్డుకుంటున్న ప్రభుత్వం

 రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ ఆరోపించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని సక్రమంగా అమలు చేయనందున చాలా మంది ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు.   ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన  హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. రుణమాఫీ పథకం సక్రమంగా అమలు చేసి రైతులను ఆదుకోవాలని, అర్హులందరికీ ఫించన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. చాలామంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్లు అందక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top