పైసా వసూల్‌

GHMC Targets For Assets Tax in Hyderabad - Sakshi

ఆస్తిపన్ను కోసం కొత్త టార్గెట్లు

ఒక్కో సర్కిల్‌లో రోజుకు రూ.2 లక్షల నుంచి రూ.75 లక్షలు లక్ష్యం  

ఈ నెల లక్ష్యం రూ.123 కోట్లు

వాణిజ్య భవనాల రీ అసెస్‌మెంట్‌కు స్పెషల్‌ డ్రైవ్‌  

జీహెచ్‌ఎంసీ నిర్ణయం

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఖజానాలో తగినన్ని నిధులు లేక కటకటలాడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆస్తిపన్ను వసూళ్లు పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం రోజువారీ టార్గెట్లు విధించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సర్కిల్‌లో రోజుకు సగటున రూ.2 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ఆస్తిపన్ను వసూలయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అలా అయితేనే ఖజానాకు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. వాస్తవంగా జీహెచ్‌ఎంసీకి వివిధ కారణాల వల్ల నిధుల సమస్య వస్తోంది. ముఖ్యంగా నగరంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు జీహెచ్‌ఎంసీ నుంచే నిధులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పాటు పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛ ఆటోలు, స్వీపింగ్‌ యంత్రాల కొనుగోళ్లు తదితరమైన వాటితో ఖర్చు పెరిగింది. అంతే కాకుండా  ఔట్‌సోర్సింగ్‌పై  450 మంది ఇంజినీర్లనుతీసుకున్నారు. జీహెచ్‌ఎంసీలో రిటైరైనప్పటికీ పలువురు తిరిగి ఔట్‌సోర్సింగ్‌పై చేరుతూ  జీహెచ్‌ంఎసీలోనే  తిష్ట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో  వేతనాల  చెల్లింపులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ప్రతినెలా సిబ్బంది వేతనాలు, పెన్షన్ల  చెల్లింపులకే ఎన్నో తిప్పలు పడాల్సి వస్తోంది. ప్రతినెలా ఫస్టు వస్తోందంటేనే అధికారుల గుండె గుబిల్లుమంటోంది. ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చినప్పటికీ, రోజురోజుకూ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుండటంతో  ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. వాణిజ్య భవనాల నుంచి వచ్చే ఆస్తిపన్ను ఎక్కువ ఉండటంతో స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. రావాల్సిన దానికన్నా తక్కువ మొత్తం చెల్లిస్తున్నారని భావిస్తూ భారీ వాణిజ్య భవనాలను తిరిగి రీ అసెస్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. 

ముఖ్య ఆదాయ వనరులివే..
జీహెచ్‌ఎంసీ ఆదాయ వనరుల్లో ముఖ్యమైనవి ఆస్తిపన్ను, టౌన్‌ప్లానింగ్‌ ఫీజులే. ఏప్రిల్‌ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగా, ఏప్రిల్‌ నెలలో ఎర్లీబర్డ్‌ పథకం ఉండటంతో 5 శాతం రాయితీని వినియోగించుకొని ఎక్కువమంది ఆస్తిపన్ను చెల్లించడంతో  జీతాల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా  ఏప్రిల్, మే నెలలు గడిచిపోయాయి. దాదాపు రూ. 500 కోట్ల ఆస్తిపన్ను వసూలు కావడంతో ఆ ఇబ్బందులు తప్పాయి. తిరిగి గత నెల నుంచి ఇబ్బందులు తలెత్తడంతో ఆస్తిపన్నువసూళ్లపై దృష్టిసారించిన అధికారులు సర్కిళ్లకు దినవారీ టార్గెట్లు  విధించారు.  ఈ సంవత్సరం జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను రూపేణా రూ. 1800 కోట్లు వసూలు  చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.  గత నెలాఖరు వరకు రూ. 680 కోట్లు వచ్చాయి. ఈనెల పదో తేదీ వరకు రూ. 15 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. పరిస్థితి ఇలాగే ఉంటే జీతాల చెల్లింపులు కష్టం కావడంతో   దినవారీ టార్గెట్‌ నిర్ధారించారు. అలా ఈ నెల్లో  రూ.123 కోట్ల వసూళ్లు లక్ష్యంగా నిర్ధారించారు. సర్కిళ్ల వారీగా ఆయా ప్రాంతాలు, డిమాండ్, ఇంత వరకు వసూలైన మొత్తం తదితరమైనవి బేరీజు వేసి ఒక్కో సర్కిల్‌లో ప్రతిరోజు సగటున రూ.2 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు వసూలు లక్ష్యాన్ని నిర్దేశించారు. అందుకనుగుణంగా పని చేపట్టిన సిబ్బంది శుక్రవారం వరకు రూ.96 కోట్లు వసూలు చేశారు. గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే రూ.154 కోట్లు అదనంగా సేకరించారు.

వాణిజ్య భవనాలరీ అసెస్‌మెంట్‌ తనిఖీలకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు
జీహెచ్‌ఎంసీ పరిధిలో వెయ్యి గజాల స్థలం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న హోటళ్లు, షాపింగ్‌ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఫంక్షన్‌హాళ్లు, ప్రైవేట్‌ పాఠశాలలు తదితర కమర్షియల్‌ భవనాల తనిఖీలను చేపట్టేందుకు ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు కమిషనర్‌ దానకిశోర్‌ ప్రకటించారు. కమర్షియల్‌ భవనాల్లో అనుమతికి మించి అధికంగా నిర్మాణాలు చేపట్టారని, వాటి ఆస్తిపన్ను నిర్ధారణలోనూ తీవ్ర వ్యత్యాసాలున్నాయని పలు ఫిర్యాదులందినందున  ఈ వాణిజ్య భవనాలన్నింటినీ తనిఖీలు చేసి రీ అసెస్‌ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేసి జోన్ల వారీగా తనిఖీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.  ఏ జోన్‌లోని వారు అదే జోన్‌లో కాకుండా ఇతర జోన్లలోని వాణిజ్య భవనాలను తనిఖీలు చేస్తారని, ప్రధాన  కార్యాలయంలోని సెంట్రల్‌ టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షిస్తుందని తెలిపారు. సంబంధిత జోనల్‌ కమిషనర్లు, జోనల్‌ సిటీ ప్లానర్లు, డిప్యూటి కమిషనర్లు కూడా క్షేత్రస్థాయి  తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే  వ్యత్యాసాలు భారీమొత్తంలో ఉన్న భవన యజమానులపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ తనిఖీలు ఏవిధమైన వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టాలని కమిషనర్‌  స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top