పనితీరులో ప్రత్యేకం... ఈవీడీఎం

GHMC Special Force EVDM Hyderabad - Sakshi

ఆక్రమణలపై ఉక్కుపాదం ∙ ఫుట్‌పాత్‌లు, ఆస్తుల సంరక్షణ  

విభాగం బలోపేతానికి డైరెక్టర్‌ విశ్వజిత్‌ కృషి  

పూర్తయిన ఏడాది.. రెండో పడిలోకి అడుగు  

సాక్షి, సిటీబ్యూరో: దేశంలోనే ముంబై మినహా మరే ఇతర నగరాల్లో లేని విధంగా జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) పనితీరులో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. విపత్తుల సమయంలో ఈ విభాగం స్పందించిన తీరు అభినందనీయం. ‘రైట్‌ టు వాక్‌’ను పకడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు చేపట్టి ప్రశంసలందుకుంది.  ఈ విభాగం డైరెక్టర్‌గా నియమితులైన ఐపీఎస్‌ అధికారి విశ్వజిత్‌ కంపాటి దశల వారీగా విభాగాన్ని బలోపేతం చేస్తున్నారు. ఈ విభాగం ఏర్పాటై ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఈవీడీఎం పనితీరు, పురోగతిపై ‘సాక్షి’ కథనం.  

15 స్పెషల్‌ డ్రైవ్స్‌...  
ఈవీడీఎం విభాగంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌లో రెండు బలగాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్క్వాడ్‌ (ఈఎన్‌ఎఫ్‌), లేక్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌( ఎల్‌పీఎఫ్‌) ఉన్నాయి. ఈఎన్‌ఎఫ్‌లో 8 బృందాలుండగా... ఇవి రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు తొలగించాక మళ్లీ అదే పని చేసిన వారిపై 294 కేసులు నమోదు చేశాయి. జరిమానాల కింద రూ.15.15లక్షలు వసూలు చేశాయి. నిబంధనలు అతిక్రమించిన 70 వాణిజ్య భవనాలను సీజ్‌ చేశాయి.  
ఈ విభాగం ఇప్పటి వరకు 15 స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహించి, ఫుట్‌పాత్‌లపై 16,092 ఆక్రమణలను తొలగించింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.  
జీహెచ్‌ఎంసీ పార్కులు, ఖాళీ స్థలాలు తదితర ఆస్తులను రక్షించేందుకు ప్రత్యేకంగా లేక్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. ఈ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా, ఇక్కడ ఎలాంటి వ్యర్థాలు వేయకుండా చూడడం వీటి బాధ్యత. 17 చెరువులు, ఒక పార్కు వద్ద 24గంటల పాటు మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.  

అక్రమాలకు చెక్‌...
నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అమల్లోకి తీసుకొచ్చిన బయోమెట్రిక్‌లోనూ అక్రమాలను ఈ విభాగం వెలికి తీయడం సంచలనం సృష్టించింది. ఇందుకు సింథటిక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ వాడుతున్నారని గుర్తించింది. దాదాపు 1,300 మంది స్వీపర్ల జీతం దారిమళ్లుతుండడాన్ని గుర్తించి, జీహెచ్‌ఎంసీ ఖజానాకు పడుతున్న గండిని అరికట్టింది. దీంతోపాటు కమిషనర్‌ ఆదేశాల మేరకు వివిధ అంశాలకు సంబంధించి 72 ఎంక్వైరీలు చేసింది. వీటిల్లో 59 ఎంక్వైరీల నివేదికల్ని తదుపరి చర్యల కోసం కమిషనర్‌కు అందజేసింది.  

రక్షణే ధ్యేయంగా... 
విపత్తుల నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు విపత్తుల సమయంలో తక్షణం స్పందిస్తూ సేవలందిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బార్లు, పబ్‌లను గుర్తించి తగు చర్యలు తీసుకుంటోంది. ప్రమాదకరంగా ఉన్న 17 సంస్థల్ని సీజ్‌ చేసింది. 8 డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలు మూడు షిఫ్టులుగా 24 గంటల పాటు విధుల్లో ఉంటూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే తక్షణ సహాయం అందిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీలోని విద్యుత్, రవాణా విభాగాల్లో అదనంగా ఉన్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికే తగిన శిక్షణనిచ్చి వివిధ సేవలకు వినియోగిస్తుండడం విశేషం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top