చెత్త డబ్బాలకు బైబై!

GHMC Removed Dust Bins on Streets Hyderabad - Sakshi

ఇళ్ల నుంచే సేకరణను పెంచిన జీహెచ్‌ఎంసీ

క్రమేపీ తగ్గుతున్న బహిరంగ చెత్త డబ్బాలు

‘స్వచ్ఛ హైదరాబాద్‌’లో భాగంగా చర్యలు

ఇప్పటికే 25 శాతం తగ్గిన చెత్త డబ్బాలు  

దశలవారీగా డస్ట్‌బిన్‌ ఫ్రీ సిటీ అమలు

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో బహిరంగ ప్రదేశాల్లోని డంపర్‌బిన్స్‌(పెద్ద చెత్తడబ్బాలు) క్రమేపీ తగ్గుతున్నాయి. ఇంటింటికీ రెండు రంగుల చెత్త డబ్బాలు పంపిణీ చేసిన జీహెచ్‌ఎంసీ.. చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలను కూడా ప్రవేశపెట్టడంతో ఇంటి నుంచి చెత్త సేకరణ గతంలో కంటే మెరుగుపడింది. ఇంతకుముందు ఇళ్ల నుంచి చెత్త సేకరణకు కేవలం రిక్షాలు మాత్రమే ఉండేవి. నగరంలోని చాలా ఇళ్లకు చెత్త సేకరించే వారు వెళ్లేవారు కాదు. దాంతో వివిధ ప్రాంతాల్లో పెద్ద చెత్త డబ్బాలను ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ.. అవి నిండాక ట్రక్కుల ద్వారా తరలించేంది. ‘స్వచ్ఛ నగరం’ అమలులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా చేసేందుకు చెత్త ఉత్పత్తి స్థానంలోనే తడి–పొడిగా వేరు చేయడంతో పాటు ప్రతిరోజూ సేకరణ జరగాలని భావించి రెండు దశల్లో 2500 స్వచ్ఛ ఆటోలను వినియోగంలోకి తెచ్చారు. అవి వచ్చాక ఇళ్ల నుంచి చెత్త సేకరణ పెరిగింది. దాంతో బహిరంగ ప్రదేశాల్లోని చెత్త డబ్బాల అవసరం కూడా దాదాపు తగ్గింది.

ఈ క్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో అవసరం లేనిచోట్ల ఉన్న దాదాపు 800 డబ్బాలను తొలగించారు. జీహెచ్‌ఎంసీలోని మొత్తం చెత్తడబ్బాల్లో ఇవి 25 శాతం. ప్రస్తుతం స్వచ్ఛ హైదరాబాద్‌– షాన్‌దార్‌ హైదరాబాద్‌ కార్యక్రమానికి సిద్ధమైన జీహెచ్‌ఎంసీ.. అన్ని ఇళ్ల నుంచి ప్రతిరోజూ చెత్త సేకరణ జరిగేందుకు చర్యలకు సిద్ధమైంది. అందుకు ప్రతిరోజూ స్వచ్ఛ ఆటోల నిర్వాహకులు తమ పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లేదీ లేనిదీ గుర్తించడంతో పాటు, తరలించని వారిపై చర్యలు కూడా తీసుకోనున్నారు. ‘డస్ట్‌బిన్‌ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు చేపట్టిన వివిధ చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో, రోడ్ల వెంబడి చెత్తడబ్బాలను తగ్గించే కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. పెరిగిన జనాభా, కాలనీలతో చెత్త ఉత్పత్తి పెరిగినప్పటికీ, అందుకనుగుణంగా చెత్త తరలించే వాహనాలను పెంచుతున్నారు.

గ్రేటర్‌లో ‘స్వచ్ఛ’ చర్యలు ఇలా..
స్వచ్ఛ ఆటోలు: 2,500
చెత్త రిక్షాలు: 2,600
తడి–పొడి చెత్త వేరు చేసేందుకుపంపిణీ చేసిన డబ్బాలు: 44 లక్షలు
వీటికి చేసిన ఖర్చు: రూ.29 కోట్లు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top