రైతు సమన్వయ సమితులను రద్దు చేయాలి

రైతు సమన్వయ సమితులను రద్దు చేయాలి

వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ 

 

నల్లగొండ టూటౌన్‌: రైతు సమన్వయ సమితులను తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీఓ 39 పేరిట గ్రామాల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు జన్మభూమి కమిటీలు వేసినట్లుగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌ రైతు సమన్వయ సమితులను వేస్తున్నారని, వీటి వలన ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.



రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే చర్యలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. రైతు సమన్వయ సమితులు, జీఓ 39ని రద్దు చేయాలని ఈనెల 14న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దేవుడి ఫొటో పక్కన వైఎస్సార్‌ ఫొటో పెట్టుకున్నారని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.



రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తిసాగు వేశారని, సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆల్మట్టి నుంచి నీళ్లు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చే విధానాన్ని తమ పార్టీ తప్పుపడుతుందని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఇరుగు సునీల్‌కుమార్, ఎండి.సలీం, జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిశెట్టి యాదయ్య, కట్టెబోయిన నాగరాజు తదితరులు ఉన్నారు.
Back to Top