అమ్మ గెలిచింది

Gandhi Hospital Doctors Safe Delivery to Corona Patient Hyderabad - Sakshi

కరోనా సోకిన గర్భిణికి గాంధీలో డెలివరీ

తల్లీబిడ్డ క్షేమం

మహిళ సహా మరో హమాలీ కార్మికునికి పాజిటివ్‌

కొడుకుని చూసేందుకు వెళ్లిన తండ్రి గుండెపోటుతో మృతి

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌తో బాధపడుతూ గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న గర్భిణి(22)కి ఆస్పత్రి గైనకాలజీ విభాగం వైద్యులు విజయవంతంగా డెలివరీ చేశారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనిత, డాక్టర్‌ ప్రసన్నలక్ష్మి, డాక్టర్‌ సింధూ, డాక్టర్‌ మృణాళిని, డాక్టర్‌శ్రీలక్ష్మి, డాక్టర్‌ నాగార్జునలతో కూడిన వైద్య బృందం బాధితురాలికి ప్రత్యేక జాగ్రత్తల మధ్య డెలీవరి చేశారు. ఆమెకు మగబిడ్డ జన్మించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆ స్పత్రి వైద్యులు ప్రకటించారు. పుట్టిన బిడ్డకు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కంటైన్మెంట్‌ జోన్‌గా ఫాతిమా నగర్‌
ఇక హబీబ్‌ ఫాతిమా నగర్‌ ఫేజ్‌–2 బస్తీలో ఓ వ్యాపారికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. స్థానికులు బయటకు రాకుండా కంచె ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా శుక్రవారం గ్రేటర్‌లో మరో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో వీరందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి, చికిత్సలు అందజే స్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన బాధితుల్లో ఓల్డ్‌మలక్‌పేట్‌ కాగజ్‌ కార్ఖానాలేన్‌కు చెందిన మహిళ(55) సహా అల్లాపూర్‌ డివిజన్‌ రాజీవ్‌ గాంధీ నగర్‌కు చెందిన మ రో హామాలీ వర్కర్‌కు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు సహా వారికి సన్నిహితంగా మెలిగిన వారిని హోం క్వారంటైన్‌ చేశారు. ఇక ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రికి కొత్తగా 11 మంది అనుమానితులు రాగా, ఇప్పటికే ఇక్కడ చికిత్స పొందుతున్న ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను గాంధీకి తరలించారు. నెగిటివ్‌ వచ్చిన మరో ఇద్దరిని డి శ్చార్జి చేశారు. కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి ఓపీకి 72 మంది రాగా, వీరిలో 30 మంది నుంచి నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న మరో ఐదుగురిని ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. ఇద్దరికి పాజిటివ్‌ రాగా, ఎనిమిది మందికి నెగిటివ్‌ రావడంతో వారిని డిశ్చార్జి చేశారు. ఇక నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి మరో పది మంది అను మానితలు వచ్చారు. వీరి నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు.  

కొడుకును చూడడానికి వెళ్లిన వృద్ధుడి మృతి..  
జియాగూడ: కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమారుడిని చూడటానికి వెళ్లిన ఓ తండ్రి గుండెపోటుతో కుప్పకూలిన సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. జియాగూడ వెంకటేశ్వర్‌నగర్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగికి(75)ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడికి ఇటీవల టైఫాయిడ్‌ రావడంతో కిమ్స్‌ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. గురువారం  కుమారుడిని చూడటానికి వెళ్లిన వృద్ధుడు ఆసుపత్రిలో గుండెనొప్పితో పడిపోయాడు. దీంతో వెంటనే వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ప్రాంతంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

ఎస్‌ఆర్‌నగర్‌లో...
అమీర్‌పేట: అమీర్‌పేట ఎస్‌ఆర్‌నగర్‌లో మరో కరోనా కేసు నమోదైంది.ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఆనుకుని ఉండే గురుమూర్తినగర్‌కె చెందిన  ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రాగా తాజాగా ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. శివ్‌బాగ్‌లోని విష్ణు ఫైర్‌ వర్క్స్‌ ఎదురుగా కొబ్బరి కాయల వ్యాపారం చేసే అతడికి కరోనా లక్షణాలు ఉండటంతో ఆసుపత్రికి తరళించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. అతడితో పాటు ఇంట్లో ఉండే కూతురు,అళ్లుడికి నెగెటీవ్‌ వచ్చింది.వారిని హోం క్వారంటైన్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top