అక్కడ దహన సంస్కారాలు ఉచితం

Free Funeral And Cremation Service In Gurralagondi Village - Sakshi

గుర్రాలగొంది గ్రామంలో వినూత్న కార్యక్రమం

చందాలు, ప్రోత్సాహక సొమ్ముతో మూలనిధి ఏర్పాటు

వడ్డీతో కార్యక్రమాల నిర్వహణ

అభినందించిన మాజీ మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట:  పేదలు చనిపోతే చందాలు వసూలు చేసి దహన సంస్కారాలకు నిర్వహించిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి.. అటువంటి పరిస్థితి తమ గ్రామంలో ఎవరికీ రాకూడదు.. అంటూ సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొంది సర్పంచ్‌ ఆంజనేయులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీలో మూల నిధి ఏర్పాటు చేసి గ్రామంలో చనిపోయిన వారికి ఉచితంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఆలోచనకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మద్దతు తెలపడం. తన వంతు కూడా సాయం అందచేస్తానని ముందుకు రావడంతో ఆ కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. 

దాతల సహకారంతో మూల నిధి..
ఉచిత దహన సంస్కారాలు నిర్వహించడానికి మూల నిధినిఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే వడ్డీతో  ఈ ఖర్చులు నిర్వహించేందుకు సర్పంచ్‌ సిద్ధమయ్యారు. గత ఏడాది ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. ఇందుకు గాను ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోత్సాహకం నుంచి రూ. 5లక్షలు, సర్పంచ్‌ రూ. 50వేలు, ఎంపీటీసీ రూ.30వేలు, జెడ్పీటీసీ రూ.25వేలు, గ్రామాన్ని దత్తత తీసుకున్న పారిశ్రామిక వేత్త రవీందర్‌రావు రూ.50వేలు, మాజీ సర్పంచ్‌ రూ.25వేలు, అదేవిధంగా ఇతర దాతలు కలిపి మొత్తం రూ.8,35,000 జమచేశారు. వీటికి తోడు కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రూ.1లక్ష అభివృద్ధి నిధుల నుంచి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గురువారం నుంచి ఆ గ్రామంలో ఎవరు చనిపోయినా  పంచాయతీ సొంత ఖర్చులతో అంత్యక్రియలు చేసేలా ఏర్పాట్లు చేశారు. 

నియోజకవర్గం అంతా అమలు
ఉచిత అంతిమ సంస్కారాల క్రమానికి మూలనిధిని అందచేసే కార్యక్రమానికి  హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్‌ అంజనేయులును అభినందించారు. గుర్రాల గొంది గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొవాలని పిలుపు నిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉచిత దహన సంస్కారాల కార్యక్రమాన్ని చేపడుతామని చెప్పారు. ఇప్పటికే పలు గ్రామాల సర్పంచ్‌లు నిధుల సేకరణ పనిలో ఉన్నారన్నారు. ఇందుకోసం గ్రామస్తులు, పారిశ్రామిక వేత్తలు, ప్రవాస భారతీయులు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top