మహదేవపూర్‌ అడవుల్లో జింకల వేట

మహదేవపూర్‌ అడవుల్లో జింకల వేట


వేటగాళ్లను వెంటాడిన అటవీ అధికారులు

తుపాకీతో బెదిరించి వేటగాళ్లు పరార్‌
మహదేవపూర్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు రెండు జింకలను చంపేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అటవీ శాఖాధికారులు వేటగా ళ్లను వెంబడించి రెండు జింకల మృతదేహాలతోపాటు ఒక ఇండికా కారును స్వాధీ నం చేసుకున్నారు. అటవీ అధికారులను వేటగాళ్లు తుపాకీతో బెదిరించి తప్పించుకుపోయారు. వారు వదిలివెళ్లిన (ఏపీ13 ఏఈ 2752) ఇండికా కారులో ఫజల్‌ మహమ్మద్‌ ఖాన్‌ అనే వ్యక్తి ఫొటోలు, ఆధార్‌కార్డు, మరో యువకుడి ఫొటోతో పాటు జంగిల్‌ నైఫ్‌ తదితరాలు లభించినట్లు మహదేవపూర్‌ రేంజర్‌ రమేశ్‌ వెల్లడించారు.మహదేవపూర్‌ అడవుల్లో వన్యప్రాణులను వేటాడినట్లు ఆదివారం రాత్రి జిల్లా అటవీ అధికారులకు సమాచారం అందడంతో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పలిమెల రేంజ్‌ అధికారి నర్సింహమూర్తి, మహదేవపూర్‌ రేంజ్‌ అధికారి రమేశ్‌లను అప్రమత్తం చేశారు. వేటగాళ్ల వాహనాన్ని లెంకలగడ్డ అడవిలో ఫారెస్ట్‌ అధికారులు నిలువరించే ప్రయత్నం చేయగా వారు ఆపకుండా దూసుకుపోయారు. దీంతో అంబట్‌పల్లి పొలిమేరల్లో మాటు వేసి వాహనాన్ని అడ్డుగా పెట్టారు. అయినా వేటగాళ్లు ఆగకుండా రేంజర్‌ వాహనాన్ని ఢీకొట్టి అంబట్‌పల్లిలోని అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడి పశువుల కొట్టంలోకి తీసుకెళ్లారు.టైర్ల అచ్చుల ఆనవాల్లతో ఆ పశువుల కొట్టం వద్దకు అటవీ అధికారులు వెళ్లగా.. ఒక వేటగాడు రేంజర్‌పై తుపాకీ ఎక్కుపెట్టి చంపుతామని బెదిరించాడు. ఆ వెంటనే వారు పారిపోయారు. ఇంతలో అంబట్‌పల్లికి చేరుకున్న అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్‌ నాయకుడు కారును, జింకలతో సహా వదిలి వేయాలని,  కేసు నమోదు చేయొద్దని రేంజర్‌ రమేశ్‌పై ఒత్తిడి తెచ్చి నట్టు తెలిసింది. దానికి అంగీకరించని ఆయన.. సర్పంచ్, గ్రామపెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించి వాహనాన్ని మహదేవపూర్‌లోని ప్రభుత్వ కలప డిపోకు తరలించారు. పశువైధ్యాధికారి మల్లేశం పోస్ట్‌మార్టం నిర్వహించి కాల్చి చంపినట్లు నిర్ధారించారు. కాగా, వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసి మంథని కోర్టులో నివేదించామని, జడ్జి ఆదేశాల మేరకు జింకల కళేబరాలను దహనం చేశామని రేంజర్‌ రమేశ్‌ తెలిపారు.

Back to Top