హైదరాబాద్‌ సిటీలో ఆకుపచ్చ ఫ్రిడ్జ్‌లు!

Food banks in 35 locations in the Hyderabad city - Sakshi

నగరంలో 35 చోట్ల ఫుడ్‌బ్యాంకులు 

ఏ వేళలోనైనా లభిస్తున్న ఆహారం 

దాతల కోసం ‘ఫీడ్‌ ద నీడ్‌’యాప్‌ 

ఆకలిగొన్నవారికి, ఆహారదాతలకు బ్రిడ్జ్‌లా ఆకుపచ్చ ఫ్రిడ్జ్‌లు  

సాక్షి, హైదరాబాద్‌: ఆకలికి పేదా, గొప్పా, చిన్నా, పెద్దా అనే అంతరంలేదు. ఆకలిబాధ అందరికీ అనుభవమే.. ఈ నేపథ్యంలో ఆకలేస్తే అన్నంపెడతా.. అంటోంది ఫుడ్‌బ్యాంకు. హైదరాబాద్‌లో ఇలాంటి ఫుడ్‌బ్యాంకులు అన్నార్థులను అక్కున చేర్చుకుంటున్నాయి. ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, ఇతర ముఖ్య కూడళ్లు.. ఇలా 35 ప్రదేశాల్లో ఆకుపచ్చ  ఫుడ్‌ ఫ్రిడ్జ్‌ (అన్నంపెట్టె)ల రూపంలో ఫుడ్‌బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఆకలిగొన్నవారికి, ఆహారదాతలకు బ్రిడ్జ్‌లా ఈ ఫ్రిడ్జ్‌లు మారాయి. ఆహారం మిగిలిపోయిన చోటు నుంచి ఆకలిగా ఉన్నవారికి ఆహారాన్ని చేర్చడం, ఆహారం పాడు కాకుండా కూడా నిల్వ ఉంచడం ‘ఫీడ్‌ ద నీడ్‌’లక్ష్యం.  

స్పందన బాగుంది.. 
కిమ్స్‌. నిమ్స్, నిలోఫర్, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్‌ బ్యాంక్‌లలో ఎక్కువగా ఆహారం జమ అవుతోంది. ఇక్కడ రోజు కు 40 మంది చక్కటి ఆహారాన్ని పొందగలుగుతున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. ఎన్‌జీవోల సహకారం ఉన్నచోట మాత్రమే ఫ్రిడ్జ్‌ను ఏ ర్పాటు చేశారు. అవి ఒక దివ్యాంగ వ్యక్తిని ఆ ఫ్రిడ్జ్‌ పర్యవేక్షణ, శుభ్రత కోసం నియమించి భోజనంతోపాటు రూ.6 నుంచి 7 వేల జీతం ఇస్తున్నాయి.  

నీడి కాదు నీడ్‌ .. 
నగరంలో 150 అన్నపూర్ణ సెంటర్లున్నాయి. అవి మధ్యాహ్నం వేళ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఫీడ్‌ ద నీడ్‌ ఫ్రిడ్జ్‌ వద్దకు ఏ వేళలో అయినా ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, ఆఫీస్‌ నుంచి ఆలస్యంగా ఇంటికెళ్లేవారు... ఇలా ఎవరైనా సరే ఆకలితో వస్తే ఇక్కడ ఏదో ఒకటి తినడానికి దొరుకుతుంది.  

దాతల కోసం యాప్‌... 
ఫీడ్‌ ద నీడ్‌ యాప్‌ను వారం క్రితం జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది. ఇప్పటికీ 800 మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే, ఇది ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్‌కి వారం రోజుల్లో అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ఆహారం ఇవ్వాలనుకున్న దాతలు ఈ యాప్‌ ద్వారా తెలియ చేయవచ్చు. వెబ్‌సైట్‌లో ఫ్రిడ్జ్‌ లింక్‌లున్నాయి. ఫ్రిడ్జ్‌లు విరాళంగా అందించాలనుకునేవారు మున్సిపల్‌ కార్పొరేషన్‌ను సంప్రదించవచ్చు.

ఎవరైనా ఈ ఫ్రిడ్జ్‌ల్లో నిల్వచేయవచ్చు 
యాపిల్‌ హోం అనాథాశ్రమం వారు మొదటి ఫుడ్‌బ్యాంక్‌(రిఫ్రిజిరేటర్‌)ని శిల్పారామంలో ఏర్పాటు చేశారు. సమీప హోటళ్లలో జరిగే ఫంక్షన్లలో మిగిలిపోయే ఆహారాన్ని ఈ సేవసంస్థలకు తెలిపి అవసరం ఉన్నవారికి అందేలా చెయ్యవచ్చు. తిండి పదార్థాలను ఇవ్వాలనుకునేవారు నేరుగా వచ్చి ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టవచ్చు. రాబిన్‌హుడ్‌ ఆర్మీ వాలంటీర్లు దాతలిచ్చే ఆహారాన్ని తీసుకెళ్లి ఆకలిగా ఉన్నవారికి అందజేస్తారు. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా ఈ ఫ్రిడ్జ్‌ల్లో ఆహారపదార్థాలను నిల్వచేయవచ్చు.  

100 ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేస్తాం... 
ఫిబ్రవరిలో ఫీడ్‌ ద నీడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో నీడి అని కాకుండా నీడ్‌ అని వాడాం. ఎవరికి ఆకలి అయితే వారు ఆహారాన్ని తీసుకుని తినవచ్చు. నగరంలో 35 ఫుడ్‌బ్యాంకులు ఏర్పాటు చేశాం. ఇన్ని ఫ్రిడ్జ్‌లు పెట్టిన ఘనత మన నగరానిదే. దుబాయ్‌ లాంటి నగరాల్లో 10 లోపే ఉన్నాయి. గత నెలలోనే ఈ ఫుడ్‌బ్యాంక్‌ల దగ్గర ఫుడ్‌ తీసుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. చాలామంది దాతలు ఫ్రిడ్జ్‌ల ఏర్పాటుకు సహాయం చేస్తామని ముందుకొస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా 100 ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చెయ్యాలనే లక్ష్యంతో ఉన్నాం.  
– హరిచందన, జోనల్‌ కమిషనర్, జీహెచ్‌ఎంసీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top