గోదావరికి పోటెత్తిన వరద

Flood Flows To River Godavari Across Projects - Sakshi

సాక్షి, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీనితో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కూనవరం ప్రాంతంలో శబరి నది ఎగపోటు ఆందోళన రేపుతోంది.సీలేరు నది నుంచి నీరు విడుదల చేయడంతో శబరి నది ఉధృతంగా మారుతున్నది.గోదావరి నదిలో వరద ఉధృతి భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 11:30 గంటలకు 43 అడుగులుగా నమోదైంది.ఎగువ ప్రాంతాలు దుమ్ముగూడెం, వెంకటాపురం, పేరూరు, ఏటూరునాగారం, పాతగూడెం, కాళేశ్వరం వద్ద కూడా నీటి మట్టాలు పెరుగుతున్నాయి.

ఎగువ ప్రాంతమైన కాళేశ్వరం వద్ద ఉధృతి ఆగి...ప్రస్తుతం గోదావరి నిలకడగా ఉన్నట్టు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. కాళేశ్వరం నుంచి వరదనీరు భద్రాచలం చేరటానికి 8 నుండి10 గంటల సమయం పట్టనుండటంతో అప్పటివరకు భద్రాచలం వద్ద నీటిమట్టాలు పెరుగుతాయని అంచనా. తొలుత శనివారం సాయంత్రానికి గోదావరి 43 అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసినా వరద ఉధృతితో శుక్రవారం ఉదయం 11:30 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు చేరింది.

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌
గోదావరి ఉధృతి పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఇది 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిని చూస్తుంటే మరికొద్ది గంటల్లో48 అడుగులకు చేరుకొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక నిజామాబాద్ జిల్లా శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదఇన్ ఫ్లో పెరుగుతోంది.  శ్రీరాం సాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు,కాగా ప్రస్తుతం నీటి మట్టం 90 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 527.30 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం  590 అడుగులు.
 ప్రస్తుతం ప్రాజెక్టుకు 74202  క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కాగా 8488 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు .డ్యామ్ నీటి నిలువ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 162.9747 టీఎంసీలుగా ఉంది .  

ప్రాజెక్టుల్లో జలకళ..
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో గోదావరి జల కళ సంతరించుకుంది. మూడ్రోజుల్లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఆరు టీఎంసీ ల వరద  నీరు పోటెత్తింది. నిజామాబాద్ జిల్లా శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఇన్ ఫ్లో 58,330 క్యూసెక్కులు  తరలివస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు  కాగా ప్రస్తుత నీటి మట్టం 1066.20 అడుగులుగా ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top