కాంగ్రెస్‌కు ఎదురుగాలి..

First Assembly Elections Congress Position Medak - Sakshi

అన్ని స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థుల విజయం

కాంగ్రెస్‌ కంచుకోటకు బీటలు

ఎన్టీఆర్‌ కేబినెట్‌లో కరణం రామచంద్రారావు

చంద్రబాబు మంత్రి మండలిలో కేసీఆర్‌

అందోలు ఉప ఎన్నికలో దామోదర రాజనర్సింహపై గెలిచిన బాబూమోహన్‌

తొలి శాసనసభ (1952)కు జరిగిన ఎన్నికల నాటి నుంచి మెదక్‌ జిల్లాలో ఎదురులేని కాంగ్రెస్‌ పార్టీకి 1985 ఎన్నికల్లో బ్రేక్‌ పడింది. కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. 1989 ఎన్నికల్లో ఏడోచోట్ల విజయం సాధించి పూర్యవైభవం సాధించింది. తిరిగి 1994 ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. పదికి పది స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు కొత్త అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేసీఆర్‌ వరుసగా మూడో పర్యాయం గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో కరణం రామచంద్రరావుకు చోటు దక్కింది. 1998లో అందోలుకు జరిగిన ఉప ఎన్నికలో సినీనటుడు బాబూమోహన్‌ అరంగేట్రంతోనే  గెలుపొందారు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పదో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నది. ఐదేళ్ల పదవీ కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం, సారా వ్యతిరేక ఉద్యమం, ప్రభుత్వ వ్యతిరేకత తదితర కారణాలతో కాంగ్రెస్‌ జిల్లాలో ఆదరణ కోల్పోయింది. టికెట్ల పంపకంలో అసంతృప్తి తలెత్తి పలు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ దక్కక పోవడంతో నారాయణఖేడ్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మెదక్‌ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ మిత్రపక్షంగా పోటీ చేసిన సీపీఐ నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. 

ఐదుగురు కొత్త వారు..
జిల్లాలో విజయం సాధించిన పది మందిలో టీడీపీ పక్షాన ఐదుగురు కొత్త అభ్యర్థులు ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టారు. దేవర వాసుదేవరావు (రామాయంపేట), డా.విజయరామారావు (గజ్వేల్‌), సదాశివరెడ్డి (సంగారెడ్డి), విజయపాల్‌రెడ్డి (నారాయణఖేడ్‌), సి.బాగన్న (జహీరాబాద్‌) నుంచి ఎన్నికయ్యారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత కూడా కాంగ్రెస్‌ కంచుకోటలుగా ఉన్న రామాయంపేట, జహీరాబాద్, సంగారెడ్డి అసెంబ్లీ స్థానాలు ఈ ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ ఖాతాలో చేరాయి.

ఎన్టీఆర్‌ కేబినెట్‌లో కరణం..
పదో శాసనసభ ఎన్నికల్లో జిల్లా నుంచి టీడీపీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించగా, మెదక్‌ నుంచి ఎన్నికైన కరణం రామచంద్రరావు ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కేబినెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 1995లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన నూతన మంత్రిమండలిలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో 1988–89 మధ్యకాలంలోనూ ఎన్టీఆర్‌ కేబినెట్‌లో స్వల్పకాలం కరువు, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా పనిచేశారు. అందోలు నుంచి రెండో పర్యాయం ఎన్నికైన మల్యాల రాజయ్య సిద్దిపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో 1998లో జరిగిన ఉప ఎన్నికలో సినీ నటుడు బాబూమోహన్‌ టీడీపీ నుంచి పోటీ చేసి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. 

సైడ్‌లైట్స్‌..
∙ 1972లో స్వతంత్ర అభ్యర్థిగా, 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మెదక్‌ నుంచి విజయం సాధించిన కరణం రామచంద్రరావు 1994లో మరోమారు విజయం సా«ధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధ కల్పన శాఖ మంత్రిగా పదవి చేపట్టారు. అయితే 1995లో టీడీపీ సంక్షోభం మూలంగా చంద్రబాబు సీఎం కాగా, ఆయన మంత్రివర్గంలో కరణంకు చోటు దక్కలేదు. 

∙ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రామాయంపేట అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దేవర వాసుదేవరావు తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

∙ టీడీపీ నుంచి దుబ్బాక ఎమ్మెల్యేగా వరుసగా రెండో పర్యాయం పోటీ చేసిన చెరుకు ముత్యంరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా ఉన్న ఎం.ఫారూక్‌ హుస్సేన్‌ ఈ ఎన్నికలో ముత్యంరెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
 
∙ సిద్దిపేటలో టీడీపీ అభ్యర్థిగా నాలుగో పర్యాయం పోటీ చేసిన ప్రస్తుత సీఎం కేసీఆర్‌ వరుసగా మూడో పర్యాయం ఎన్నియ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గంలో కేసీఆర్‌ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యేగా మూడు వరుస విజయాలు నమోదు చేసి హ్యాట్రిక్‌ సాధించారు.  

∙ టీడీపీ అభ్యర్థిగా గజ్వేల్‌ (ఎస్సీ) రిజర్వుడు స్థానం నుంచి పోటీ చేసిన డాక్టర్‌ విజయ రామారావు తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. డా.జె.గీతారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. 

∙ నర్సాపూర్‌లో చిరకాల రాజకీయ ప్రత్యర్థులు సీహెచ్‌.విఠల్‌రెడ్డి, జగన్నాథరావు వరుసగా ఎనిమిదో పర్యాయం ఎన్నికల బరిలో తలపడ్డారు. నర్సాపూర్‌ నుంచి విఠల్‌రెడ్డి ఐదో పర్యాయం సీపీఐ అభ్యర్థిగా విజయం సాధించగా, వరుసగా మూడో విజయం నమోదు చేసుకున్నారు. ఈ ఎన్నికలో ఓటమి తర్వాత సి.జగన్నాథరావు నర్సాపూర్‌ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం నుంచి నిష్క్రమించారు.

∙ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చిన పి.రామచంద్రారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి తొలిసారిగా పోటీ చేసిన సదాశివరెడ్డి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ తొలిసారిగా పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. 

∙ అందోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి మల్యాల రాజయ్య టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించినా, 1998 లోక్‌సభ ఎన్నికల్లో సిద్దిపేట ఎంపీగా విజయం సాధించారు. దీంతో సినీనటుడు బాబూమోహన్‌ అందోలు ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఆరంగేట్రం చేసి గెలుపొందారు.

∙ 1952 నుంచి జరిగిన వరుస ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చిన అప్పారావు షెట్కార్‌ ఆ తర్వాత శివరావు షెట్కార్‌ స్థానంలో తొలిసారిగా పి.కిష్టారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 1994 ఎన్నికల్లో కిష్టారెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకట్‌రెడ్డి కుమారుడు విజయపాల్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారిగా విజయం సాధించారు. 

నియోజకవర్గం                   ఎన్నిక                 పార్టీ            ప్రత్యర్థి              పార్టీ           
మెదక్‌                   కరణం రామచంద్రారావు   టీడీపీ          పి.నారాయణరెడ్డి     కాంగ్రెస్‌    
రామాయంపేట        దేవర వాసుదేవరావు       టీడీపీ          ఎ.విఠల్‌రెడ్డి            కాంగ్రెస్‌    
దొమ్మాట                సీహెచ్‌ ముత్యంరెడ్డి        టీడీపీ           ఫారూక్‌ హుస్సేన్‌    కాంగ్రెస్‌    
సిద్దిపేట                  కె.చంద్రశేఖర్‌రావు         టీడీపీ           ఎ.మదన్‌మోహన్‌     కాంగ్రెస్‌    
గజ్వెల్‌ (ఎస్సీ)         డా.విజయ రామారావు   టీడీపీ           జె.గీతారెడ్డి              కాంగ్రెస్‌    
నర్సాపూర్‌              సీహెచ్‌ విఠల్‌రెడ్డి           సీపీఐ           సి.జగన్నాథరావు      కాంగ్రెస్‌   
సంగారెడ్డి                కె.సదాశివరెడ్డి              టీడీపీ           పి.రామచంద్రారెడ్డి      కాంగ్రెస్‌   
అందోలు (ఎస్సీ)       మల్యాల రాజయ్య         టీడీపీ           డి.రాజనర్సింహ        కాంగ్రెస్‌  
నారాయణఖేడ్‌         విజయపాల్‌రెడ్డి            టీడీపీ           పి.కిష్టారెడ్డి               స్వతంత్ర  
జహీరాబాద్‌             చంగల్‌ బాగన్న            టీడీపీ           పి.నర్సింహారెడ్డి         కాంగ్రెస్‌   

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top